- ఇంజెక్టబుల్స్ తయారీ కేంద్రం ఏర్పాటుకు ఓకే
- సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో అంగీకారం
- ఫార్మాస్యూటికల్ గ్లాస్ ట్యూబ్ తయారీ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామన్న కార్నింగ్ కంపెనీ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు దిగ్గజ కంపెనీలు ముందుకు వస్తున్నాయి. ప్రపంచంలోనే పేరొందిన వివింట్ ఫార్మా కంపెనీ హైదరాబాద్‌లోని జీనోమ్ వ్యాలీలో అత్యాధునిక ఇంజెక్టబుల్స్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. రూ.400 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ఈ కంపెనీ అంగీకరించింది. దీంతో దాదాపు వెయ్యి మందికి ఉద్యోగాలు లభించనున్నాయి.
రాష్ట్రానికి పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు వివింట్ ఫార్మా కంపెనీ ప్రతినిధులతో చర్చలు జరిపారు. అనంతరం పెట్టుబడులకు సంబంధించి కంపెనీ ప్రతినిధులు ప్రకటన చేశారు. సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ‘‘హైదరాబాద్‌లోని జీనోమ్ వ్యాలీలో పెట్టుబడులకు వివింట్ ఫార్మా కంపెనీ ముందుకు రావటం సంతోషదాయకం.
లైఫ్ సైన్సెస్ రంగంలో కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. అవసరమైన రాయితీలు, మౌలిక సదుపాయాలు కల్పిస్తుంది” అని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో అన్ని పరిశ్రమలకు అనుకూల వాతావరణం ఉందని, జీనోమ్ వ్యాలీ ఔషధ కంపెనీలను తప్పకుండా ఆకర్షిస్తుందని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. తమ ప్రభుత్వం అనుసరిస్తున్న పారిశ్రామిక విధానాలతో కొత్త కంపెనీలు ఆసక్తి ప్రదర్శిస్తున్నాయని, వివింట్ ఫార్మా కొత్త తయారీ కేంద్రం ఏర్పాటు రాష్ట్రంలో లైఫ్ సైన్సెస్ రంగం వృద్ధికి దోహదపడుతుందని పేర్కొన్నారు.
హైదరాబాద్‍లో కంపెనీ తొలి ఫ్యాక్టరీ
ఇప్పటికే హైదరాబాద్‌లోని జీనోమ్ వ్యాలీలో వివింట్ కంపెనీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఉంది. సుమారు రూ. 70 కోట్లతో నెలకొల్పిన ఈ సదుపాయాలతో పాటు అంతర్జాతీయ మార్కెట్‌లో విస్తరించేందుకు కంపెనీ ప్రణాళికలు రూపొందించింది. అందులో భాగంగానే హైదరాబాద్‌లోనే తన మొదటి తయారీ ఫ్యాక్టరీని స్థాపించనుంది. పరిశోధన, ఆవిష్కరణ కేంద్రంతో పాటు తయారీ యూనిట్, మౌలిక సదుపాయాల కల్పనకు జీనోమ్ వ్యాలీలో 5.5 ఎకరాలను కొనుగోలు చేసింది.
వచ్చే ఏడాది నుంచి కార్నింగ్ కంపెనీ ఉత్పత్తి
ప్రపంచంలో పేరొందిన కార్నింగ్ ఇన్ కార్పొరేటెడ్ కంపెనీ తెలంగాణలో కొత్త ఆవిష్కరణల అభివృద్ధికి సిద్ధమైంది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు.. ఎమర్జింగ్ ఇన్నోవేషన్ గ్రూప్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రోనాడ్ వెర్క్లీరన్ ఆధ్వర్యంలోని కార్నింగ్ ప్రతినిధుల బృందంతో చర్చలు జరిపారు. అవగాహన ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.
ఈ ఒప్పందం ప్రకారం.. అడ్వాన్స్ మాన్యుఫ్యాక్చరింగ్, కెమికల్ ఇంజనీరింగ్ విభాగాల్లో కార్నింగ్ కంపెనీ తెలంగాణ ప్రభుత్వానికి పరస్పర సహకారం అందిస్తుంది. ఫార్మాస్యూటికల్, కెమికల్ రంగాల్లో అత్యాధునిక పరిశోధన, అభివృద్ధి కేంద్రంగా తెలంగాణను తీర్చిదిద్దడంతో భాగస్వామ్యం పంచుకుంటుంది. రాష్ట్రంలో ఫార్మాస్యూటికల్ గ్లాస్ ట్యూబ్ తయారీ కేంద్రం నెలకొల్పటంపై కార్నింగ్ కంపెనీ ప్రతినిధులు ముఖ్యమంత్రితో చర్చించారు. 2025 నుంచి ఇందులో వాణిజ్య ఉత్పత్తి ప్రారంభిస్తామని ప్రకటించారు. ఈ అత్యాధునిక గ్లాస్ ట్యూబ్ తయారీ కేంద్రం ఫార్మా రంగం అభివృద్ధికి దోహదపడుతుంది. ఔషధాల ప్యాకేజింగ్ పరిశ్రమలో ఈ గ్లాస్ ట్యూబ్‌లను ఉపయోగిస్తారు.