న్యూఢిల్లీ: చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ వివోపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తీవ్ర ఆరోపణలు చేసింది. దిగుమతుల ముసుగులో కంపెనీ భారతదేశం నుంచి 70 వేల కోట్ల రూపాయలను చైనాతోపాటు మరికొన్ని దేశాలకు మళ్లించిందని పేర్కొంది. ఈ మేరకు కోర్టులో అనుబంధ చార్జిషీట్‌ను దాఖలు చేసింది. వివో ఇండియా, దాని 23 స్టేట్ డిస్ట్రిబ్యూటర్ కంపెనీల (ఎస్డీసీలు) ద్వారా భారతదేశంలో అన్ని కార్యకలాపాలను నియంత్రించిందని, మొబైల్మార్కెట్లో గుత్తాధిపత్యం సాధించిందని స్పష్టం చేసింది.
ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లోని రిపోర్ట్ ప్రకారం, వివో మొబైల్ ప్రైవేట్ లిమిటెడ్ హాంకాంగ్, సమోవా, బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్‌లలోని సంస్థల నుంచి దిగుమతుల కోసం 2014 నుంచి భారతదేశం వెలుపలకు రూ. 70,837 కోట్లు పంపింది. ఈ సంస్థలన్నీ వివో చైనా నియంత్రణలో ఉన్నాయి. దిగుమతుల ద్వారా వచ్చిన ఆదాయం దాదాపు రూ. 20,241 కోట్లకు చేరింది. వివో చైనా, వివో ఇండియాతో తన సంబంధాన్ని కాగితాలపై మాత్రమే దూరం చేసుకుంది. సరఫరా గొలుసును నియంత్రించడాన్ని కొనసాగించింది. అన్ని కంపెనీలూ - వివో చైనా నియంత్రణలోనే ఉన్నాయి.
అక్రమాలు చేసింది ఇలా...
వివో చైనా ఇతర దేశాలలో స్పెషల్ పర్పస్ వెహికల్స్ (ఎస్‌పీవీ)లను ఏర్పాటు చేసింది. ఇందులో ఇతర కంపెనీల ద్వారా వివోకు వాటాలు ఉన్నాయి. ఉదాహరణకు, వివో మొబైల్ ఇండియా హాంకాంగ్‌లోని మల్టీ అకార్డ్ లిమిటెడ్‌కు అనుబంధ సంస్థగా నమోదయింది. వివో చైనా లక్కీ క్రెస్ట్‌లో వాటాదారు. ఇది మరొక హాంకాంగ్-నమోదిత సంస్థ. ఇదే కంపెనీ మల్టీ అకార్డ్ వాటాదారు. ఈ సంక్లిష్టమైన విధానం ద్వారా వివో చైనా వివో ఇండియాను నియంత్రించింది. వివో ఇండియా దాని 23 ఎస్డీసీలు దాని లాభదాయకమైన యాజమాన్యం గురించి భారత ప్రభుత్వానికి తప్పుడు వివరాలు అందించాయి.
ట్రేడింగ్కంపెనీ హాంకాంగ్‌లోని యిప్ ఫంగ్ బిల్డింగ్‌లో పనిచేస్తున్నాయి. వివో చైనా ల్యాబ్‌క్వెస్ట్ ఇంజినీరింగ్ అనే భారతీయ కంపెనీని రిటైల్ వ్యాపార కార్యకలాపాలను నిర్వహించడానికి అక్రమంగా ఉపయోగించుకుందని ఈడీ తెలిపింది. ఇది మనదేశ ఎఫ్‌డీఐ విధానానికి వ్యతిరేకమని స్పష్టం చేసింది. గత డిసెంబర్లో వివో ఇండియాకు వ్యతిరేకంగా మనీలాండరింగ్ విచారణకు సంబంధించి ఈడీ ఏడుగురిని అరెస్టు చేసింది.