ప్రభుత్వ సలహాదారుగా చాన్స్ ఇవ్వండి..
అభివృద్ధి అంటే ఏంటో చూపిస్త
సీఎస్‌కు జైళ్ల శాఖ మాజీ డీజీ వీకే సింగ్ లెటర్
హైదరాబాద్,వెలుగు: జైళ్ల శాఖ మాజీ డీజీ వీకే సింగ్ మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో ఏడేండ్లలో ఏమీ అభివృద్ధి జరగలేదని, తనకు ప్రభుత్వ సలహాదారుగా అవకాశం ఇస్తే 7 నెలల్లోనే అభివృద్ధి చేసి చూపిస్తానని అన్నారు. ఈ మేరకు పోయిన నెల 23న సీఎస్ సోమేశ్ కుమార్ కు ఆయన లెటర్ రాశారు. తనకు 7 నెలల పాటు ప్రభుత్వ సలహాదారుగా అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సీఎస్ కు లెటర్ రాసినట్లు వీకే సింగ్ బుధవారం తెలిపారు. ‘‘అమరుల త్యాగాలతో రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ వచ్చి ఏడేండ్లవుతున్నా ఏమీ అభివృద్ధి జరగలేదు. రాష్ట్ర అభివృద్ధిపై ప్రజలు, మేధావులు, అధికారులతో పాటు కోర్టులు, మీడియా నిరాశతో ఉన్నాయి. ప్రజల ఆకాంక్షలు నెరవేరకపోవడంతో వారు ఆగ్రహంతో ఉన్నారు. ఉపాధి అవకాశాలు,హెల్త్, ఎడ్యుకేషన్ క్వాలిటీ, అవినీతి నిర్మూలనపై గతంలో నేను అనేక లెటర్లు రాశాను. తెలంగాణలో 34 ఏండ్లు పని చేసిన అనుభవం నాకు ఉంది. జైళ్ల శాఖ, గ్రేహౌండ్స్, స్పెషల్ టాస్క్ ఫోర్స్, బీహార్, లీగల్ మెట్రాలజీ, పోలీస్ అకాడమీలో పని చేశాను. నేను పని చేసిన అన్ని వింగ్స్‌లో అనేక మార్పులు తెచ్చాను. ప్రభుత్వ సలహాదారుగా నాకు అవకాశం కల్పిస్తే.. 7 ఏండ్లలో చేయలేనిది, కేవలం 7 నెల్లలోనే చేసి చూపిస్తాను. నేను చెప్పినట్లుగా అభివృద్ధి చేయకపోతే ఏ శిక్షనైనా సిద్ధం. రాజకీయ నాయకుల జోక్యం లేకుండా చూస్తే పోలీస్ ఫోర్స్ ఓ గేమ్ ఛేంజర్ అవుతుంది” అని వీకే సింగ్ లెటర్ లో పేర్కొన్నారు.