సర్కార్​కు పట్టని ఒకేషనల్ జేఎల్స్

సర్కార్​కు పట్టని ఒకేషనల్ జేఎల్స్


శాంక్షన్​ పోస్టులు లేవని రెగ్యులర్​ చేయట్లే
ఒకేషనల్ కోర్సుల్లో 842 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు
కమల్ నాథన్ కమిటీ రిపోర్టు
23ఏండ్లుగా పనిచేస్తున్న పర్మినెంట్​అదృష్టం లేదు
ఆరు నెలలుగా అందని జీతాలు

మహబూబ్​నగర్, వెలుగు:    రాష్ట్ర ప్రభుత్వం అందరినీ చేసినట్టే తమను రెగ్యులరైజ్ చేస్తుందని ఆశించిన  కాంట్రాక్ట్​ ఒకేషనల్  జూనియర్  లెక్చరర్లకు నిరాశే ఎదురైంది.  జూనియర్ కాలేజీల్లో ఒకేషనల్  కోర్సులకు సంబంధించి శాంక్షన్​ పోస్టులు లేవని  పైఆఫీసర్లు చెప్తుండడంతో నాలుగు నెలలుగా వీరి రెగ్యులరైజేషన్ ప్రక్రియకు బ్రేక్ పడింది.  ఒకేషనల్ కాలేజీలు, ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఖాళీలను  భర్తీ చేసేందుకు 1990లో అప్పటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వం పార్ట్​టైం వర్కర్లను నియమించింది.  క్వాలిఫికేషన్లను బట్టి 1996లో కొందరిని రెగ్యులరైజ్ చేసి, మిగతా వారికి మినిమం టైం స్కేల్ (ఎంటీఎస్) వర్తింపజేసింది. 2000 తర్వాత ఒకేషనల్ కాలేజీల్లో 12 రకాల కొత్త కోర్సులను ప్రవేశపెట్టి, 603 మందిని కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకున్నారు. ఇందులో ఇంజినీరింగ్, బయో టెక్నాలజీ, బీఎస్సీ నర్సింగ్, ఎంసీఏ చదువుకున్న వారు ఉన్నారు. వీరు 24 ఏండ్లుగా పనిచేస్తున్నా  రాష్ర్ట ప్రభుత్వం పర్మినెంట్ చేయలేదు. వీరితోపాటు సమానంగా పని చేసిన రెగ్యులర్ కాంట్రాక్ట్ జేఎల్స్ 2,905 మందిని ఇటీవల రెగ్యులర్ చేశారు. అయితే, వీరిలాగే తమను కూడా పర్మినెంట్ చేయాలని ఒకేషనల్ జేఎల్స్ డిమాండ్ చేస్తున్నారు.

శాంక్షన్​ పోస్టులు లేవని..

ఉమ్మడి ఏపీ నుంచి తెలంగాణ విడిపోయినప్పుడు ఒకేషనల్ కోర్సులో  842 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కమల్​నాథన్​ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. ప్రస్తుతం తెలంగాణలో 603 మంది ఒకేషనల్ జేఎల్స్​లో నలుగురు చనిపోగా, 599 మంది ఆయా జిల్లాల్లో పనిచేస్తున్నారు. ఈ పోస్టులను రెన్యువల్ చేసేందుకు ఏటా ఇంటర్ బోర్డు నుంచి రెన్యూవల్ ప్రొసిడింగ్స్ జారీ చేస్తున్నారు. కొద్ది రోజుల కింద కాంట్రాక్ట్ లెక్చరర్స్​ను ప్రభుత్వం పర్మినెంట్ చేయగా, ఒకేషనల్ జేఎల్స్​ను కూడా అదే టైంలో పర్మినెంట్ చేయాల్సి ఉంది. కానీ, కేవలం 184 శాంక్షన్ పోస్టులే ఉన్నాయని, మిగతా పోస్టులకు ప్రభుత్వం నుంచి శాంక్షన్ లేదని ఉన్నతాధికారులు రిపోర్ట్ ఇవ్వడంతో వీరి రెగ్యులరైజేషన్ ప్రక్రియ ఆగిపోయింది. వీరంతా ఆందోళన వ్యక్తం చేయడంతో, రెండు వారాల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన ఆఫీసర్లు, ప్రభుత్వం ఇప్పుడు సప్పుడు చేయడం లేదు. 

పోస్టులు లేకుండా ఎట్ల తీసుకున్నరు?

ఒకేషనల్ కోర్సుల్లో 842 పోస్టులకు 184 పోస్టులను రెగ్యులర్ చేయడంతో ఇంకా 658 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కానీ ఈ పోస్టులకు సంబంధించిన వివరాలను ఉన్నతాధికారులు బయటకు చెప్పడం లేదు. వాస్తవానికి ఈ పోస్టుల్లో కాంట్రాక్ట్ లెక్చరర్లను తీసుకున్నప్పుడే ఆఫీసర్లు ఖాళీల వివరాలను ప్రభుత్వానికి అందజేయాల్సి ఉంది. 

క్వాలిఫికేషన్స్ ఉన్నా  రెగ్యులర్ చేస్తలేరు

మాకు అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. కానీ, రెగ్యులర్ చేస్తలేరు. ఆఫీసర్లను అడిగితే శాంక్షన్ పోస్టులు లేవని చెప్తున్నారు. మాతో సమానంగా పని చేసిన రెగ్యులర్ కాలేజీల కాంట్రాక్ట్ జేఎల్స్​ను మాత్రం పర్మినెంట్ చేశారు. బోర్డు వాళ్లు చేసిన తప్పిదం వల్ల మాకు అన్యాయం జరిగింది. 
- కొండయ్య, మహబూబ్​ నగర్​