ఒకేషనల్ టీచర్స్ అసోసియేషన్.. రాష్ట్ర కమిటీ ఎన్నిక

హైదరాబాద్, వెలుగు: స్కూల్ ఎడ్యుకేషన్​పరిధిలో పనిచేస్తున్న ఒకేషనల్ టీచర్లకు సంబంధించి ఏర్పాటైన ఒకేషనల్ ఇన్​స్ర్టక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా గొడిశల శ్రీనివాస్, కార్యదర్శిగా పోతిగంటి వెంకట్ రెడ్డి ఎన్నికయ్యారు. సోమవారం నారాయణగూడలో జరిగిన  అసోసియేషన్ రాష్ట్ర కమిటీ సమావేశంలో ఎమ్మెల్సీ కూర రఘోత్తం రెడ్డి, పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పింగిలి శ్రీపాల్ రెడ్డి, కార్యదర్శి బీరెల్లి కమలాకర్ రావు చీఫ్ గెస్టులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొత్త కమిటీని ఎన్నుకున్నారు. అనంతరం వృత్తివిద్యా టీచర్లకు 1990 అక్టోబర్ 30 నుంచి సర్వీస్ ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలిచ్చినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పీఆర్టీయూ నేతలకు అసోసియేషన్ ప్రతినిధులు వివరించారు. దీనిపై పీఆర్టీయూ నేతలు  స్పందిస్తూ..ప్రభుత్వం ద్వారా జీవో ఇప్పించేందుకు కృషి చేస్తామని, ఒకేషనల్ టీచర్లను స్కూల్ అసిస్టెంట్లుగా గుర్తించేందుకు ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ‘బలగం’ సినిమాలో నటించిన వృత్తి విద్యా ఉపాధ్యాయ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు భిక్షమయ్యను వారు సన్మానించారు. 

ALSO READ :సైంధవ్ లో వెంకటేశ్ న్యూ లుక్