
Vodafone Idea Shares: ఒకప్పుడు టెలికాం రంగాన్ని ఏలిన కంపెనీలుగా వొడఫోన్, ఐడియాలకు విడివిడిగా పెద్ద చరిత్ర ఉంది. అయితే దశాబ్ధకాలం కిందట ముఖేష్ అంబానీ దేశీయ టెలికాం వ్యాపారంలోకి నేరుగా 4జీ సేవలను లాంచ్ చేయటం ద్వారా తొలి అడుగువేశారు. ఆ తర్వాత అంబానీ వ్యాపార వ్యూహం ముందు నిలవలేక యూనినార్, విర్జిన్ మెుబైల్స్, డొకోమో, ఎయిర్ సెల్ వంటి అనేక సంస్థలు కనుమరుగయ్యాయి. అయితే ఈ క్రమంలోనే బిర్లాలకు చెందిన ఐడియా, బ్రిటీష్ కంపెనీ వొడఫోన్ గ్రూప్ ఒక్కటిగా తమ ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్లటం మెుదలు పెట్టాయి.
అంబానీ దూకుడు వేగం ముందర నిలవలేని వొడఫోన్ ఐడియా వ్యాపారం రోజురోజుకూ భారీ నష్టాల్లోకి జారుకుంటోంది. ఈ క్రమంలో స్పెక్ట్రమ్ చెల్లింపులు చేపట్టడం కూడా కష్టతరంగా మారింది. అయితే దాదాపు రూ.36 వేల 950 కోట్ల స్పెక్ట్రమ్ బకాయిలను కేంద్ర ప్రభుత్తవం ఈక్విటీ వాటాలుగా మార్చింది. దీంతో కంపెనీలో భారత ప్రభుత్వానికి ఉన్న వాటాలు 22.6 శాతం నుంచి ప్రస్తుతం 48.99 శాతానికి చేరుకున్నాయి. ఈ వార్తతో నేడు ఇంట్రాడేలో వొడఫోన్ ఐడియా స్టాక్ 20 శాతం మేర లాభపడగా, ఇండస్ టవర్స్ స్టాక్ దాదాపు 7 శాతానిక పైగా లాభపడింది.
ప్రభుత్వానికి విఐ సంస్థ ఒక్కో షేరును రూ.10 ముఖ విలువతో 3 వేల 695 కోట్ల షేర్లను జారీ చేసింది. ఈ మార్పుల తర్వాత కంపెనీలో ప్రమోటర్లకు నిర్వహణ హక్కులు అలాగే కొనసాగనున్నట్లు వెల్లడైంది. దీంతో వరుసగా రెండోసారి వొడఫోన్ ఐడియా అప్పులను ప్రభుత్వం ఈక్విటీలుగా కన్వర్ట్ చేసింది. దీనికి ముందు తొలిసారిగా 2023లో రూ.16 వేల 133 కోట్ల అప్పులను ప్రభుత్వం ఇలాగే ఈక్విటీ వాటాలుగా కన్వర్ట్ చేసేందుకు అనుమతించింది.
ప్రస్తుత చర్యలతో దాదాపు 49 శాతం స్టేక్ భారత ప్రభుత్వం స్వాధీనం అయ్యింది. ఇది కంపెనీని ప్రభుత్వ యాజమాన్య సంస్థగా మారటానికి అత్యంత చేరువ చేసింది. భవిష్యత్తులో ఏదైనా ఇలాంటి రుణాలను ఈక్విటీలుగా బదలాయింపు ప్రక్రియ జరిగితే వొడఫోన్ ఐడియాలో ప్రభుత్వ వాటా 50 శాతం దాటి అది ప్రభుత్వ రంగంలోని కంపెనీగా మారే అవకాశం ఉందని దేసీయ బ్రోకరేజ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ నిపుణుడు ఆదిత్య బన్సల్ అన్నారు. వాస్తవానికి ఇది కంపెనీలో వాటాలను కలిగి ఉన్న 60 లక్షల మంది షేర్ హోల్డర్లకు ఒక శుభవార్త లాంటిది.
స్టాక్ దూకుడుపై బ్రోకరేజీల మాట..
- అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ సిటీ రీసెర్చ్ తన బై రేటింగ్ కొనసాగిస్తూ స్టాక్ టార్గెట్ ధరను రూ.12 వద్ద ఉంచింది.
- భారతీయ బ్రోకింగ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ షేర్లకు హైరిస్క్ హై రివార్డ్ కేటగిరీ కింద చూస్తున్నట్లు పేర్కొంటూ టార్గెట్ ధరను రూ.6.5 వద్ద ఉంచింది
కంపెనీ ఆర్థిక పరిస్థితి దిగజారుతున్న వేల గడచిన ఏడాది కాలంలో వొడఫోన్ ఐడియా స్టాక్ ధర 50 శాతం పతనాన్ని చూసింది. ప్రస్తుతం కంపెనీ తన 4జీ, 5జీ కవరేజీని దేశవ్యాప్తంగా పెంచుకునేందుకు అవసరమైన నిధులను సమకూర్చుకోవటం కోసం ఇబ్బందులు ఎదుర్కొంటోంది. దీర్ఘకాలంలో కంపెనీ బతికి ఉండాలంటే దానికి స్పెక్ట్రమ్ బకాయిల చెల్లింపులు చాలా కీలకంగా మారిన వేళ వాటిని 2021 టెలికాం రిఫార్మ్స్ మెజర్స్ కింద ప్రస్తుతం ఈక్విటీలుగా మార్చి ప్రభుత్వానికి చెల్లింపులు చేయటం చాలా కీలకంగా మారిందని నిపుణులు చెబుతున్నారు.
NOTE: పైన అందించిన వివరాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటి ఆధారంగా ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు తీసుకోకండి. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోల్లో పెట్టుబడులు నష్టాలతో కూడుకున్నవి. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకోవటానికి ముందుగా మీ ఆర్థిక సలహాదారులను సంప్రదించటం ఉత్తమం. మీరు తీసుకునే నిర్ణయాలకు V6 యాజమాన్యం లేదా ఉద్యోగులు ఎట్టిపరిస్థితుల్లోనూ బాధ్యత వహించరు.