- హుస్నాబాద్‌లో బీఆర్ఎస్ గ్రాఫ్ డౌన్
- కౌశిక్ తీరుతో హుజూరాబాద్‌లోనూ వ్యతిరేకత
- సతీశ్‌ను హుజూరాబాద్‌కు మార్చే ఆలోచనలో హైకమాండ్
- ఇదే జరిగితే హుస్నాబాద్ సీటు కామ్రేడ్స్కే.. !
కరీంనగర్, వెలుగు: ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో తమదైన ముద్ర వేసుకున్న వొడితల ఫ్యామిలీ తమ పాత నియోజకవర్గం హుజూరాబాద్‌పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. గౌరవెల్లి ప్రాజెక్టు భూనిర్వాసితుల విషయంలో సర్కార్ అణచివేత ధోరణితోపాటు నియోజకవర్గంలో ఇతర పరిణామాలతో హుస్నాబాద్‌లో బీఆర్ఎస్ గ్రాఫ్ డౌన్ అయిందనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో హుజూరాబాద్‌కు షిఫ్ట్ కావాలని హుస్నాబాద్ఎమ్మెల్యే సతీశ్‌బాబు భావిస్తున్నట్లు సమాచారం. ఇటు హుజూరాబాద్‌లోనూ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి తీరు వివాదాస్పదం కావడం, సొంత పార్టీలోనే వ్యతిరేకత పెరగడంతో సతీశ్‌బాబును బీఆర్ఎస్ హైకమాండ్ ప్రత్యామ్నాయంగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే హుస్నాబాద్ సీటు సీపీఐకి దక్కే అవకాముందని ప్రచారం నడుస్తోంది.
హుజూరాబాద్‌పై వొడితల ఫ్యామిలీకి పట్టు
వొడితల ఫ్యామిలీకి ఎప్పటినుంచో హుజురాబాద్ నియోజకవర్గంపై మంచి పట్టుంది. రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు అన్న సింగాపురం రాజేశ్వర్ రావు హయాం నుంచి ఇక్కడి రాజకీయాల్లో వీరి ప్రభావం ఉంది. నియోజకవర్గాల పునర్విభజనకు ముందు 2004లో హుజూరాబాద్ నుంచి కెప్టెన్ లక్ష్మీకాంతారావు గెలిచి బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా పని చేశారు. ఆ తర్వాత ఎన్నికల్లో ఆయన హుస్నాబాద్‌కు మారగా 2009లో ఓడిపోయారు. అదే స్థానం నుంచి 2014, 2018 ఎన్నికల్లో కెప్టెన్ కుమారుడు సతీశ్కుమార్ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఈసారి నియోజకవర్గంలో వ్యతిరేకత ఉన్నట్లు తెలుస్తోంది.
మరోవైపు పొత్తులో భాగంగా ఈ సీటు తనకు ఇవ్వాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడా వెంకట్ రెడ్డి పట్టుబట్టుతుండడంతో సతీశ్ బాబుకు స్థానచలనం తప్పని పరిస్థితి నెలకొంది. ఈక్రమంలోనే ఆయన తన ఫ్యామిలీకి పట్టున్న హుజూరాబాద్‌కు షిఫ్ట్ కావాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌కు వొడితల ఫ్యామిలీతో ఉన్న అనుబంధం మేరకు సతీశ్‌కుమార్‌ను ఎక్కడో ఒక చోట అకామిడేట్ చేయాలనే ఉద్దేశంతో.. వారికి పట్టున్న హుజూరాబాద్ వైపు మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. ఇదే జరిగితే ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి త్యాగం చేయక తప్పదనే ప్రచారం జరుగుతోంది.
హుస్నాబాద్‌లో బీఆర్ఎస్‌కు వ్యతిరేకత
హుస్నాబాద్ పరిధిలో చేపట్టిన గౌరవెల్లి ప్రాజెక్టు విషయంలో సర్కార్‌పై స్థానికంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. గుడాటిపల్లి భూనిర్వాసితులు నిర్వహించిన ఆందోళనలను లాఠీచార్జులు, అరెస్టులతో ప్రభుత్వం అణచివేసిన విషయం తెలిసిందే. ఓ దశలో బీఆర్ఎస్ నాయకులు స్వయంగా నిర్వాసితులపై దాడులకు దిగారు. గౌరవెల్లి రైతులకు బేడీలు వేయడంపై రాష్ట్రవ్యాప్తంగా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇవన్నీ సతీశ్‌బాబుకు ప్రతికూలంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో సతీశ్‌బాబుకు టఫ్ ఫైట్ ఇచ్చే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో ఈ సీటును పొత్తు కుదిరితే సీపీఐకి కేటాయించాలని బీఆర్ఎస్ హైకమాండ్ భావిస్తున్నట్లు తెలిసింది. ఒకప్పుడు హుస్నాబాద్ సీపీఐకి కంచుకోటగా ఉండేది. గతంలో ఇందుర్తిగా ఉన్న ఈ నియోజకవర్గం నుంచి సీపీఐ తరఫున దేశిని చిన్నమల్లయ్య 3 సార్లు, 2004లో చాడ వెంకట్‌రెడ్డి ఒకసారి గెలిచారు. 2009, 2018లో ఆయన పోటీ చేసి ఓడిపోయారు. రాష్ట్రంలో సీపీఐ కేటాయించాలని పట్టబడుతున్న స్థానాల్లో కొత్తగూడెంతోపాటు హుస్నాబాద్ కూడా ఉంది. ఎలాగూ తమకు అనుకూలంగా లేనందున ఈ సీటును సీపీఐకే కేటాయించాలని బీఆర్ఎస్ హైకమాండ్ భావిస్తున్నట్లు తెలిసింది.