ఎన్నికల వేళ బీఆర్ఎస్​కు షాక్​ .. కాంగ్రెస్ లో చేరిన వొడితల ప్రణవ్

కరీంనగర్, వెలుగు:  మాజీ ఎంపీ, దివంగత సింగాపురం రాజేశ్వర్ రావు మనుమడు వొడితెల ప్రణవ్ బాబు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరారు. తన కుటుంబ సభ్యులతో కలసి ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే సమక్షంలో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. గతంలో హుస్నాబాద్ అసెంబ్లీ ఎన్నికలు, హుజూరాబాద్ బైఎలక్షన్ లో బీఆర్ఎస్ కోసం పని చేసిన ఆయన ఇప్పుడు కాంగ్రెస్ లో చేరడం హుజూరాబాద్ నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది. రెండు నెలల క్రితం హుజూరాబాద్ లో తన తాత సింగాపురం రాజేశ్వర్ రావు విగ్రహాన్ని మంత్రి హరీశ్ రావు చేతుల మీదుగా ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. దీంతో అప్పట్లో బీఆర్ఎస్ హుజూరాబాద్ టికెట్ కోసం ప్రణవ్ ప్రయత్నిస్తున్నారని స్థానికంగా చర్చ జరిగింది. అయితే ఆ పార్టీలో ఆయనకు అవకాశం లభించకపోవడంతో కాంగ్రెస్ లో చేరినట్లు తెలుస్తున్నది. హుజూరాబాద్ కాంగ్రెస్ టికెట్ కన్ఫామ్ చేశాకే ప్రణవ్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నాడనే ప్రచారం జరుగుతున్నది.

తాత వారసత్వం కలిసొచ్చేనా.. 

రాజేశ్వర్ రావు కాంగ్రెస్ పార్టీలో ఇందిరాగాంధీ, రాజీవ్‌ గాంధీ, పీవీ నర్సింహారావుకు అత్యంత నమ్మకస్తుడైన వ్యక్తిగా ఉన్నారు. రాజ్యసభ సభ్యుడిగా పని చేశారు. రాజేశ్వర్ రావు తర్వాత ఆయన కొడుకులెవరూ పాలిటిక్స్ లోకి రాలేదు. ఆయన సోదరుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఎమ్మెల్యేగా, మంత్రి, రాజ్యసభ సభ్యుడుగా కొనసాగారు. కెప్టెన్ కుమారుడు సతీశ్ బాబు హుస్నాబాద్ ఎమ్మెల్యేగా రెండుసార్లు గెలిచారు. రాజేశ్వర్ రావు మనుమడు ప్రణవ్ 2019లో జరిగిన లోకల్​బాడీ ఎలక్షన్స్​లో సైదాపూర్ జడ్పీటీసీగా పోటీకి రెడీ అయినా  టీఆర్ఎస్ టికెట్ దక్కలేదు. 

పోటీలో నిలిచేందుకే..

హుజూరాబాద్ కాంగ్రెస్ ఇన్ చార్జ్​గా ఉన్న బల్మూరి వెంకట్ స్థానికుడు కాకపోవటం, లోకల్​నేతలు సహకరించట్లేదు. దీంతో తను ఈసారి అక్కడి నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపట్లేదని తెలిసింది. ఈ క్రమంలో హుజూరాబాద్ లో బీజేపీ ఎమ్మెల్యే ఈటల, బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డిని ఎదుర్కొనేందుకు బలమైన లీడర్​ను వెతికే క్రమంలోనే ప్రణవ్ ను పార్టీలోకి ఆహ్వానించినట్లు సమాచారం.