
హుస్నాబాద్, వెలుగు : అభూత కల్పనలు, అబద్ధాలతో అరచేతిలో వైకుంఠం చూపించడం తన విధానం కాదని, రాజకీయ నాయకుడిగా ప్రజలను భ్రమల్లో ముంచేయడం తెలిసినా అలా చేయబోనని బీఆర్ఎస్ నేత, హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితల సతీశ్‌కుమార్ అన్నారు. ఆదివారం ఆయన హుస్నాబాద్‌లో జరిగిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు.
ఆరు గ్యారంటీలతోపాటు స్థానిక సమస్యలపై ప్రజలను భ్రమల్లో ముంచడంతోనే కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ గెలిచారన్నారు. కోట్ల రూపాయలతో నియోజకవర్గాన్ని అనేక రకాలుగా అభివృద్ధి చేశానన్నారు. ప్రభుత్వ వ్యతిరేకతతోపాటు కొందరు కార్యకర్తల నమ్మకద్రోహమే తనను ఓడించిందని చెప్పారు. ఎన్నికలకు ముందు మంత్రి పొన్నం ప్రభాకర్ పొట్లపల్లిలోని రాజన్నగుడిలో ప్రమాణం చేస్తూ నియోజకవర్గానికి పనులు చేస్తానని బాండ్ రాసి ఇచ్చారన్నారు. వందరోజుల్లో ఆ ప్రమాణాన్ని నిలుపుకోకపోతే నిలదీస్తామన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీ వినోద్‌రావు, అన్ని మండలాల పార్టీ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.