నియోజకవర్గ ప్రజలకు కష్టసుఖాల్లో తోడుంటా :  వొడితెల ప్రణవ్

హుజూరాబాద్, వెలుగు: నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ మీ కష్టసుఖాలలో పాలుపంచుకుంటానని కాంగ్రెస్ హుజూరాబాద్​ఎమ్మెల్యే అభ్యర్థి ప్రణవ్ బాబు అన్నారు.  శుక్రవారం హుజూరాబాద్​ మండలం  బోర్నపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను మీలో ఒక్కడినని, మీ ఇంట్లో కొడుకులాగా ఆదరించాలని కోరారు. బీఆర్ఎస్ ​ప్రభుత్వం 10 ఏండ్లు పాలించినా ప్రజలుకు చేసిందేమీ లేదన్నారు.

అధికారంలో ఉన్నప్పుడు గుర్తుకురాని ప్రజల కష్టాలు.. ఎలక్షన్లు రాగానే గుర్తుకువచ్చాయా అని బీఆర్ఎస్​ లీడర్లను ప్రశ్నించారు. తాను గెలిస్తే నియోజకవర్గంలోని ప్రతి మండలంలో డిజిటల్ లైబ్రరీలు, స్టడీ సెంటర్లు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ఏడుసార్లు గెలిచిన ఈటల రాజేందర్ ​నియోజకవర్గానికి చేసిందేమీ లేదన్నారు.

గురువారం రేవంత్‌రెడ్డి సభకు వచ్చిన ఓ మహిళ గ్రామానికి వెళ్తూ ట్రాక్టర్​ మీద నుంచి పడి తీవ్రగాయాలతో చికిత్స పొందుతూ చనిపోవడం బాధకరమని, ఆమె కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు. అనంతరం బీఆర్ఎస్​, బీజేపీకి చెందిన పలువురు లీడర్లు ప్రణవ్​ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. టౌన్ అధ్యక్షుడు సొల్లు బాబు, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పుష్పలత, నాయకులు, కార్యకర్తలు  పాల్గొన్నారు.