ఢిల్లీ: చావు నుంచి త్రుటిలో తప్పించున్నట్లు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కీలక వ్యాఖ్యలు చేశారు. రాజీనామా చేసిన సమయంలో బంగ్లాదేశ్లో తన రాజకీయ ప్రత్యర్థులు తనను, తన సోదరిని చంపడానికి కుట్ర పన్నారని, ఆ కుట్ర నుంచి తప్పించుకుని ప్రాణాలతో బయటపడి ఇండియాకు చేరుకున్నానని బంగ్లాదేశ్ మాజీ ప్రధాని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.
రెహానా, తాను 20 నుంచి 25 నిమిషాల వ్యవధిలో చావు నుంచి తప్పించుకున్నట్లు హసీనా ఆడియో మెసేజ్లో చెప్పుకొచ్చారు. బంగ్లాదేశ్ అవామీ లీగ్ అఫిషియల్ ఫేస్ బుక్ పేజ్లో హసీనా ఆడియో మెసేజ్ పోస్ట్ చేశారు. తన జీవితంలో చాలాసార్లు హత్యాయత్నం నుంచి తప్పించుకున్నానని, తనను పలుమార్లు చంపాలని చూశారని షేక్ హసీనా ఆ ఆడియో మెసేజ్లో తెలిపారు.
భారత్లో ఆశ్రయం పొందుతూ ఇక్కడే ఉండిపోవడంపై ఈ 77 ఏళ్ల మాజీ ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికీ తాను బాధపడుతూనే ఉన్నానని, తన దేశానికి దూరమయ్యానని, తన ఇంటికి దూరమయ్యానని, ఆశలన్నీ కాలి బూడిదయిపోయాయని ఆమె బాధపడ్డారు. ఆగస్ట్ 21న కోటలీపరలో బాంబు దాడి నుంచి బతికి బయటపడ్డానని, ఆగస్ట్ 5, 2024లో కూడా ఆ అల్లా దయ వల్ల ప్రాణాలు దక్కాయని షేక్ హసీనా చెప్పారు. తాను బతికి ఉన్నానంటే ఇంకా ఏదో మంచి చేయాలనే ఉద్దేశంతోనే అల్లా తనను కాపాడాడని బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా చెప్పుకొచ్చారు.