ప్రజా సమస్యలపై పట్టింపేది..అనుకూల వార్డులకే అభివృద్ధి నిధులు

  • ఇష్టారాజ్యంగా కేటాయింపులు
  • అధికార, ప్రతిపక్ష కౌన్సిలర్ల గుర్రు 
  • మినిట్స్​బుక్​లో కానరాని అంశాలు
  • నేడు కొత్తగూడెం మున్సిపల్​కౌన్సిల్​ మీటింగ్

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు  ప్రజా సమస్యలపై పాలకవర్గానికి పట్టింపు లేకేండాపోతోంది. అత్యవసర పనులకు నిధుల కేటాయింపుకన్నా కమీషన్లు వచ్చేవాటికే పాలకులు, ఆఫీసర్లు ఇష్టారాజ్యంగా కేటాయిస్తున్నారనే  ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తమకు అనుకూలంగా ఉన్న వార్డులకే నిధులు ఇస్తున్నట్లు అధికార పార్టీతోపాటు ప్రతిపక్ష కౌన్సిలర్లు కూడా మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్​అనంతరం చర్చించిన అంశాలు, మినిట్స్​లో రాసిన విషయాలు, తీర్మానాలతోపాటు అజెండా కాపీలను నోటీస్​బోర్డులో పెట్టాలని ప్రభుత్వ ఆదేశాలున్నాయి. వీటిని కొత్తగూడెం మున్సిపల్​ఆఫీసర్లు బేఖాతరు చేస్తున్నారు. 

అంతా వాళ్ల ఇష్టమే.. 

నిధుల కేటాయింపులో ‘అంతా మా ఇష్టం’ అన్నట్టు కొత్తగూడెం మున్సిపాలిటీలో సాగుతోంది. తమకు అనుకూలంగా ఉన్న కౌన్సిలర్లకే నిధులను అధికంగా కేటాయిస్తున్నట్లు అధికార బీఆర్ఎస్​ పార్టీతోపాటు ప్రతిపక్ష కౌన్సిలర్లు చైర్మన్, కమిషనర్​తీరుపై గుర్రుగా ఉన్నారు. బుధవారం జరుగనున్న కొత్తగూడెం మున్సిపల్ కౌన్సిల్​మీటింగ్​కు సంబంధించి అజెండాను ఇష్టారాజ్యంగా రూపొందించినట్లు కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు. రామవరంలోని మాతా, శిశు సంరక్షణ కేంద్రంలో దశాబ్ది వేడుకల్లో భాగంగా నిర్వహించే న్యూట్రీషన్​కిట్ల పంపిణీకి మున్సిపాలిటీ​ నుంచి రూ.1.80లక్షలు కేటాయించడం దారుణమని కౌన్సిలర్లతోపాటు పట్టణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

హెల్త్​డిపార్ట్​మెంట్​నిర్వహించే ప్రోగ్రాంకు మున్సిపల్ నిధులు కేటాయించడమేంటని సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. జిమ్​లు, వైకుంఠదామాలు, ఇతరత్రా పనులకు రూ.లక్షల్లో ఫండ్స్​కేటాయిస్తున్న పాలకులు ప్రతి రోజు నీటి సరఫరా చేసేందుకు అవసరమైన నిధులను ఎందుకు కేటాయించలేకపోతున్నారనే విమర్శలున్నాయి. పలు వార్డుల్లో ఇంటర్నల్ రోడ్లు అధ్వానంగా ఉన్నా నిధులను ఇవ్వడం లేదని పలువురు కౌన్సిలర్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు. లక్ష్మీదేవిపల్లి మండలంలోని ముర్రెడు వాగు బ్రిడ్జిపై లైట్ల నిర్వహణకు రూ. లక్షలు కేటాయించడాన్ని కూడా ప్రశ్నిస్తున్నారు. 

నచ్చిన వారికి నిధులిస్తున్నరు..

మున్సిపల్​కౌన్సిల్​మీటింగ్​లను తూతూమంత్రంగానే చేస్తున్నరు. ప్రతి రోజూ మంచినీటి సరఫరా చేసే విధంగా ప్లాన్ చేయాలని చర్చించినం. అయినా ఫలితం లేదు. తమకు నచ్చిన వారికి నిధులిస్తున్నరు. ఇది మరీ దారుణం. ప్రజా సమస్యల కన్నా తమకు కమీషన్లు వచ్చే వాటిపైనే పాలకులు ఎక్కువగా ఫోకస్​పెడుతున్నరు. 

వై. శ్రీనివాస్​రెడ్డి, సీపీఐ మున్సిపల్​ ఫ్లోర్​లీడర్, కొత్తగూడెం