- ఇండియన్ సైంటిస్ట్ నేతృత్వంలో ట్రయల్స్
- మంచి ఫలితాలిచ్చిన ‘వొసోరిటైడ్’ మందు
అకండ్రోప్లాసియా.. అర్థం కాలేదా..! సైన్స్ భాషలో మరుగుజ్జు తనం. మన శరీరంలోని ఒక జీన్ పనిచేయకపోవడం వల్ల ఎముకలు, వెన్ను, పుర్రె కింది భాగం పెరగవు. దీంతో వయసు పెరిగినా ఎత్తు మాత్రం పెరగరు. చిన్నపిల్లల్లా ఉండిపోతారు. 25 వేల మందిలో ఒకరికి వచ్చే ఈ లోపం.. వారి జీవితాన్ని నరకప్రాయం చేస్తోంది. ఇప్పుడు ఆ లోపానికి మందు కనిపెట్టారు సైంటిస్టులు. దానిపైనే ప్రయోగాలు, పరిశోధనలు చేస్తున్నారు. ఆ మందు పేరు ‘వొసోరిటైడ్’. బయోమారిన్ అనే బ్రిటన్ ఫార్మా సంస్థ ఆ మందును తయారు చేసింది. ఆ మందుపై భారత సంతతికి చెందిన సైంటిస్టు ప్రొఫెసర్ రవి సవారిరాయన్ నేతృత్వంలో ట్రయల్స్ జరుగుతున్నాయి.
ఆస్ట్రేలియాలోని ముర్డాక్ చిల్డ్రెన్స్రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లో ఆయన పనిచేస్తున్నారు. ఈ పరిశోధనలో ఆయనతో పాటు లండన్‌లోని ఎవెలినా లండన్ చిల్డ్రెన్స్ హాస్పిటల్ సైంటిస్టులూ కీలక పాత్ర పోషిస్తున్నారు. వారితో పాటు అమెరికా, ఫ్రాన్స్‌కు చెందిన సైంటిస్టులూ ట్రయల్స్‌లో భాగమయ్యారు. ఇప్పటికే ఈ మందుపై అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ చర్చలు కూడా జరిపింది. ట్రయల్స్‌పై వివరాలు తీసుకుంది.మందు తీసుకురావడమే కాదు, దాని వల్ల పిల్లలకు భవిష్యత్తులో ఎలాంటి హాని కలగకుండా ఉండేలా చూస్తున్నారు సైంటిస్టులు.
లండన్‌కు చెందిన సామ్ షార్ట్ (9), టోరీ ఆండ్రియా ఇంగ్లిష్ (12) అనే ఇద్దరు పిల్లలపై ఆ మందును పరీక్షించారు. పరీక్షల్లో మంచి ఫలితాలొచ్చినట్టు సైంటిస్టులు చెప్పారు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పిల్లలు హైట్ పెరిగారని చెప్పారు. ట్రయల్స్‌లో భాగమవడానికి ఏడాది ముందు కేవలం 3 సెంటీమీటర్లు (ఒక అంగుళం) పెరిగిన సామ్, ట్రయల్స్‌లో మందు వాడిన తర్వాత 6 సెంటీమీటర్లు పెరిగాడని చెప్పారు. ఇటు టోరీ ఇంగ్లిష్ విషయంలోనూ మంచి ఫలితాలొచ్చాయని ఆమె తల్లి ఆంథియా చెబుతోంది. నర్సుగా పనిచేసే ఆంథియా, టోరీనీ ట్రయల్స్‌లో భాగం చేసింది. వాళ్లిద్దరే కాకుండా మరికొంత మంది మరుగుజ్జులపైనా ట్రయల్స్ చేస్తున్నారు. దీనిపై యాక్టివిస్టులు మాత్రం పెదవి విరస్తున్నారు. ఇదంతా డబ్బు కోసం చేస్తున్న ప్రయత్నమేనని శాన్ డియాగో స్టేట్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ జోసెఫ్ స్ట్రామోండో విమర్శించారు. అయితే, దీనిని కేవలం ఓ కాస్మెటిక్‌గా చూడొద్దని లీడ్ సైంటిస్ట్ రవి సవారీరాయన్ చెప్పారు.
ఏంటీ అకాండ్రోప్లాసియా?
ఫైబ్రోబ్లాస్ట్ గ్రోత్ ఫ్యాక్టర్ రిసెప్టర్ 3 (ఎఫ్జీఎఫ్ఆర్3) అనే జీన్ ఎముక కార్టిలేజ్‌ను నియంత్రిస్తుంది. ప్రొటీన్లు ఆ జీన్‌ను యాక్టివేట్ చేస్తే ఎముక కార్టిలేజ్ పెరుగుదలకు కారణమయ్యే కాండ్రోసైట్స్ అనే కణాలను ఆపేస్తుంది. దీంతో వాళ్లు అందరిలా ఎత్తు పెరగరు. 80% కేసులు ఎఫ్జీఎఫ్ఆర్3లో మార్పుల వల్లే జరుగుతున్నాయి. కొన్ని వారసత్వంగానూ వస్తున్నాయి. ఇప్పుడు బయోమారిన్ సంస్థ తయారు చేస్తున్న ఈ మందు, ఈ ఎఫ్జీఎఫ్ఆర్3ని నిరోధించడం ద్వారా కార్టిలేజ్ కణాలు యాక్టివ్‌గా ఉండేలా చేస్తుంది. దాని వల్ల ఎముకలు పెరిగి హైట్ కూడా పెరుగుతుంది.