రాజన్న సిరిసిల్ల, వెలుగు: ‘మా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు నచ్చినా, నచ్చక పోయినా ఈ ఎన్నికల్లో నేను ఓటర్లకు పైసలు పంచ, మందు పొయ్య.. నేను పనికొస్తా.. అభివృద్ధి చేయగలుగుతా అంటే ఓటెయ్యండి.. లేదంటే మీ ఇష్టం.. నాకంటే గొప్పగా పనిచేసేవారు ఎవరైనా సిరిసిల్లకు వస్తే ఆయనకే ఓటేసుకోండి’ అని సిరిసిల్ల ప్రజలకు మంత్రి కేటీఆర్ సూచించారు. శుక్రవారం ఆయన సిరిసిల్లలో జరిగిన యువజన ఆత్మీయ సమ్మెళనంలో పాల్గొని మాట్లాడారు. 14 ఏండ్లుగా సిరిసిల్ల నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తూ, నియోజకవర్గ అభివృద్ధికి పాటు పడుతున్నానని కేటీఆర్చెప్పారు. కేసీఆర్ దయతో మంత్రినై, తొమ్మిదిన్నరేండ్లలో సిరిసిల్లను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానన్నారు. కేటీఆర్ అన్ని నిధులు సిరిసిల్లకే తీసుకపోతోండని రాష్ట్రంలోని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయని, సిరిసిల్లలోని కొంత మంది నాయకులకు మాత్రం అభివృద్ధి కనిపిస్తలేదంటున్నరని ఎద్దేవా చేశారు.
ఆలోచించి ఓటేయండి..
కుల, మతాల పేరుతో ఓట్ల రాజకీయాలు చేస్తున్న వాళ్ల చేతిలో యువత మోసపోవద్దని కేటీఆర్ సూచించారు. పెండ్లి కోసం ఎంత ఆలోచిస్తామో, రాష్ట్రాన్ని ఎవరి చేతిలో పెట్టాలో కూడా అంత ఆలోచించాలన్నారు. ‘చావు నోట్లో తలకాయ పెట్టిన కేసీఆర్ వైపు నిలబడతారా, ఓటుకు నోటు కేసులో పైసలతో అడ్డంగా దొరికిన దొంగ రేవంత్ చేతిలో పెడతారా అనేది నిర్ణయించుకోవాలి’ అని అన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక కాంగ్రెస్ ను బర్తరఫ్ చేయాలని గాంధీ పిలుపునిచ్చారని, 70 ఏండ్ల పాటు పాలించిన ఆ పార్టీ దేశానికి చేసిందేమీ లేదన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులను పొట్టన పెట్టుకున్నది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు.1969లో 369 మంది ఉద్యమకారులను కాల్చి చంపిన కాంగ్రెస్.. తప్పనిసరి పరిస్థితుల్లో తెలంగాణ ఇచ్చిందన్నారు. ‘‘బీజేపీ నేత బండి సంజయ్ మోడీని దేవుడన్నా అంటాగు, ఎవ్వనికి దేవుడు, ఎట్ల దేవుడో చెప్పాలె’ అని కేటీఆర్ నిలదీశారు. సిరిసిల్లకు మెడికల్, ఇంజనీరింగ్, నర్సింగ్, అగ్రికల్చర్, పాలిటెక్నిక్ కాలేజీలను మంజూరుచేశామని, 9వ ప్యాకేజీ ద్వారా నర్మాల ప్రాజెక్ట్ ను నింపుతున్నామన్నారు. నేత కార్మికుల కోసం వర్కర్ టూ ఓనర్ పథకం రూపొందించామని, అపెరల్ పార్క్, నర్మాల ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, అక్వాహబ్ ల ద్వారా యువతకు పెద్ద సంఖ్యలో ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నామని, అభివృద్ధిని చూసి తనకు ఓటువేసి గెలిపించాలని కోరారు. కాంగ్రెస్, బీజేపీ వాళ్లు సోషల్ మీడియాలో అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని, అదే సోషల్ మీడియా వేదికగా యువత నిజాలను ప్రచారం చేయాలని కేటీఆర్ కోరారు.