- సెప్టెబర్ 2న సుప్రీంలో వాదనలు
హైదరాబాద్: ఓటుకు నోటు కేసు విచారణను వచ్చే నెల 2కు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై వాదనలు జరిగిన విషయం తెలిసిందే. కేసు ట్రయల్ ను మధ్యప్రదేశ్ రాష్ట్రానికి బదిలీ చేయాలని జగదీశ్ రెడ్డి తరఫు న్యాయవాది సుందరం వాదనలు వినిపించారు. అనంతరం విచారణ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేసింది. 2 గంటలకు మళ్లీ విచారణ చేపట్టిన బెంచ్ పలు కీలక వ్యాఖ్యలు చేసిందని న్యాయవాది సుందరం తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై రేవంత్ రెడ్డి స్పందన ప్రస్తావనకు వచ్చిందని చెప్పారు.
బాధ్యత గల స్థానంలో ఉన్న వ్యక్తులు ఉన్నత న్యాయస్థానం తీర్పుపై ఎలా వ్యాఖ్యలు చేస్తారని ధర్మాసనం ప్రశ్నించిందని సుందరం తెలిపారు. ఇలాంటప్పుడు కేసు ట్రయల్ సజావుగా సాగుతుందని నమ్మలేమని వ్యాఖ్యానించిందని చెప్పారు. ట్రయల్ కొనసాగించేందుకు సీనియర్ న్యాయవాదులు ఉమామహేశ్వరరావు, అశోక్ దేశాయ్ పేర్లను ధర్మాసనం ప్రతిపాదించింది. ఇరు పక్షాల మధ్య ఏకాభిప్రాయం రాకపోవడంతో విచారణను వచ్చే నెల 2వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది.