మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ కు ఓటు వేయాలి : మంత్రి జగదీశ్ రెడ్డి

  • కేసీఆర్​కు ఓటేయకుంటే పింఛన్లు పోతయ్
  • మునుగోడు బైపోల్ ప్రచారంలో మంత్రి జగదీశ్ రెడ్డి

యాదాద్రి​, వెలుగు : కేసీఆర్ సర్కారు​ అమలు చేస్తున్న పథకాలు కొనసాగాలంటే, మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ కు ఓటు వేయాలని మంత్రి గుంటకండ్ల జగదీశ్​రెడ్డి కోరారు. పొరపాటు చేస్తే అందరి బతుకులు దెబ్బతింటాయని, పింఛన్లు, కరెంట్ బంద్ అవుతాయన్నారు. వాటిని పోగొట్టుకొని గుజరాత్​కు పోతరా అని ఓటర్లను ఆయన అడిగారు. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా యాదాద్రి జిల్లా దండు మల్కాపురంలో మంత్రి మాట్లాడారు. మునుగోడు బైపోల్ ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం కేసీఆర్​ మధ్య జరుగుతున్నదని, కూసుకుంట్ల, కోమటిరెడ్డి మధ్య జరుగుతన్నది కాదని  పేర్కొన్నారు. “రూ.2 వేల పింఛన్​ కొనసాగాలా? వద్దా?  రైతుబంధు ఉండాలా? తీసేయాల్నా?’’ అన్న దానిపై బైపోల్ జరుగుతున్నదని, పథకాలు వద్దనుకునే వాళ్లు మోడీకి ఓటు వేసుకోవచ్చని మంత్రి  సూచించారు. ఓట్లు ఒకరికి వేసి, మరొకరు పనిచేయాలంటే కుదరదన్నారు. ‘‘గాడిదలకు గడ్డేసి, ఆవులకు పాలు పిండితే ఇవ్వదు. పొరపాటు చేస్తే అందరి బతుకులు దెబ్బతింటయి.

మీ (జనం) సమస్యలు తీరాలంటే ఎమ్మెల్యేగా కూసుకుంట్ల ఉండాలి. లేకుంటే పరిష్కరించడం ఎవ్వరి వల్ల కాదు. మోడీకి ఓటేస్తే అన్ని బంద్​ అవుతాయి. పెట్రోల్, డీజిల్, గ్యాస్​ ధరలు మరింత పెరగాలంటే, పింఛన్​, కరెంట్​ పోవాలంటే మోడీకి ఓటు వేసుకోండి” అని మంత్రి పేర్కొన్నారు. ‘‘కూసుకుంట్ల ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు డంపింగ్ యార్డు సమస్యను పరిష్కరించిండు.

డబుల్​ బెడ్​రూం ఇండ్లు మొదలుపెట్టిండు. ఆయన ఎమ్మెల్యేగా ఉండుంటే ఇప్పటికే ఇండ్లు కంప్లీట్​అయ్యేవి. మీరు అండ్ల సంసారం చేసేటోళ్లు. మొన్నటి ఎమ్మెల్యే ఒక్కరోజు రాలే. పట్టించ్చుకోలే. రేపు కూసుకుంట్ల ఎమ్మెల్యే అయితే 2 నెలల్లో డబుల్ బెడ్ రూం ఇండ్లు పూర్తిచేస్తం. మీరు అడిగిన 400 ఇండ్లు మంత్రి కేటీఆర్​తో కలిసి వచ్చి ఇస్తం” అని జగదీశ్ హామీ ఇచ్చారు. టీఆర్ఎస్​ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్​రెడ్డి, ఎమ్మెల్యే జీవన్​రెడ్డి, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.