ప్రజాస్వామ్యంలో సామాన్యుడు సైతం ఎన్నికల్లో నిలబడే అవకాశాన్ని రాజ్యాంగం అందించింది. రాజ్యాంగం ద్వారా పొందిన హక్కు వినియోగించుకోవడానికి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎమ్మెల్యే అభ్యర్థులుగా అనేకమంది ఇండిపెండెంట్లుగా నేడు పోటీ చేస్తున్నారు. అనేక నియోజకవర్గాలలో రైతులు, గల్ఫ్ కార్మికులు, భూనిర్వాసితులు, నిరుద్యోగులు, మాజీ ఐఎఎస్, ఐపీఎస్ అధికారులు, ఉన్నత విద్యావంతులు, సామాజిక ఉద్యమకారులు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. అయితే వీరిని బ్యాలెట్ పేపర్‌కు భారంగానే చూస్తున్నారు. ఆ అభ్యర్థుల లక్ష్యంగానీ, ఎజెండా గానీ గుర్తించలేకపోవడం ప్రజాస్వామ్య వ్యవస్థలో విచారకరం. నిర్లక్ష్యానికి, నిరాదరణకు గురైనవారు తమ గొంతును, బాధను వెల్లడించడానికి
నిరసనను తెలియజేయడానికి పెద్దయెత్తున వివిధ నియోజకవర్గాలలో నామినేషన్లు వేసినా ప్రజల నుంచి వారికి ఆదరణ కరువు అవుతుంది. చాలామంది స్వతంత్ర అభ్యర్థులు ఎగతాళికి గురవుతున్నారు. సంప్రదాయ పార్టీలు తమ ఆర్థిక, అధికార, అంగ బలాలతో వారిని పాతాళానికి తొక్కే ప్రయత్నం చేస్తున్నారు. సామాన్యుడు సైతం ప్రజా సమస్యలపై పోరాడుతున్నప్పుడు ప్రజలు వారి వెన్నంటే ఉండాలి. ఆత్మ విశ్వాసాన్ని కలిగించడం కోసమైనా పెద్ద ఎత్తున మద్దతు ఇయ్యాల్సిన అవసరం ఉంది.
ప్రజల అసమ్మతిని తెలిపే 'నోటా'
నోటా అనేది ఎన్నికల వ్యవస్థలో ప్రత్యేకమైన ఓటింగ్ ఎంపిక. ఇది ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులపై ఓటర్లు తమ అసమ్మతిని వ్యక్తం చేసేందుకు సహాయపడుతుంది. ఎన్నికల ప్రక్రియలో పాల్గొంటూనే పౌరులు తమ అసమ్మతిని వ్యక్తం చేయడానికి నోటా ఒక వేదికను కల్పిస్తున్నది. ప్రజాస్వామ్య స్ఫూర్తిపై ఇది ఆధారపడి ఉంటుంది. నోటాకు ఓటు వేయడం ద్వారా ఓటర్లు తమ అసంతృప్తి లేదా నిరసన ద్వారా స్పష్టమైన సంకేతాన్ని పంపే అవకాశం ఉంది. 2013లో ప్రవేశపెట్టిన నోటా ఆప్షన్ క్రమంగా భారత ఎన్నికలలో గుర్తించదగిన భాగంగా మారింది. నోటా ప్రవేశపెట్టినప్పటి నుంచి దాదాపు అన్ని ఎన్నికల్లోనూ ఇలాంటి నోటా అనుకూల ప్రచారం జరుగుతున్నది.
అయితే, నోటా పోలింగ్ గణాంకాలు తక్కువగానే ఉంటున్నాయి. సగటున పోలైన మొత్తం ఓట్లలో నోటా ఓట్ల శాతం 2.02 శాతం దాటడంలేదు. స్వతంత్ర అభ్యర్థులు, 'నోటా' ఆప్షన్ అనేక నియోజకవర్గాల్లో పెద్దగా ప్రభావాన్ని చూపలేకపోతున్నాయి. స్వతంత్ర అభ్యర్థుల ఓట్ల శాతం కొంత మేరకు సమస్యల తీవ్రతను తెలియజేసేందుకు ఉపయోగపడినప్పటికీ 'నోటా' ఆప్షన్ ప్రభావాన్ని మాత్రం అటు ప్రజలు, నాయకులు పెద్దగా పట్టించుకోవడం లేదు.
ప్రజాస్వామ్య స్ఫూర్తి పటిష్టం చేయాలి
ఓటు ప్రాధాన్యత అందరికీ తెలిసినట్టుగానే అనిపించినప్పటికీ, ఫలితాలు మాత్రం ఆర్థిక, అంగబలం ఉన్న వ్యక్తులే నాయకులుగా ఎన్నికయ్యేలా ఉంటున్నాయి. ప్రజల కోసం నిస్వార్థంగా పనిచేయడానికి వచ్చిన నాయకులకు ఆదరణ లేకపోవడం.. ప్రజల్లో ప్రజాస్వామ్య స్ఫూర్తి పూర్తిగా లోపించడాన్ని తెలియజేస్తోంది. ప్రజలు చైతన్యవంతులై తమ విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించి ఓటు వేయాలి. తద్వారా ప్రజాస్వామ్యం మరింత పటిష్టంగా మారుతుంది.
ఆర్థిక బలమే నాయకుడి ప్రధాన బలంగా ప్రజలు భావించడం బాధాకరం. నేతల గారడి మాటలకు మోసపోకూడదు. యువశక్తి ఉపాధికి ప్రాధాన్యతనిచ్చే వారికే మద్దతు తెలపాలి. పోరాడుతున్న నిజమైన అభ్యర్థులను బలపరిచి ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలి.
- చిట్టెడ్డి కృష్ణారెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ.