ఓటర్ ఐడీతో ఆధార్ లింక్ ! ఆధార్ లింక్ తప్పనిసరా అని ఈసీని అడిగితే..

ఓటర్ ఐడీతో ఆధార్ లింక్ ! ఆధార్ లింక్ తప్పనిసరా అని ఈసీని అడిగితే..
  • యూఐడీఏఐ సీఈవోతో కేంద్ర హోంశాఖ చర్చలు
  • గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేంద్రం
  • త్వరలోనే యూఐడీఏఐతో ఎన్నికల సంఘం చర్చలు
  • ఆధార్ లింక్ తప్పనిసరి కాదు, స్వచ్ఛందమేనన్న ఈసీ

న్యూఢిల్లీ: ఓటర్ ఐడీతో ఆధార్ కార్డ్ లింక్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆధార్, ఓటర్ ఐడీ అనుసంధానంపై చర్చించేందుకు మంగళవారం కేంద్ర హోం, న్యాయ శాఖ, ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సెక్రటరీలతో యూఐడీఏఐ సీఈవో సమావేశం నిర్వహించినట్టు ఈ మేరకు ఎన్నికల సంఘం(ఈసీ) వెల్లడించింది. ప్రస్తుత చట్టం, సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగానే ఓటర్ ఐడీ, ఆధార్ సీడింగ్ చేస్తామని తెలిపింది. 

ఇందు కోసం త్వరలోనే ఈసీ, యూఐడీఏఐ మధ్య టెక్నికల్ కన్సల్టేషన్లు ప్రారంభిస్తామని పేర్కొంది. అయితే, ఓటర్ ఐడీతో ఆధార్ను అనుసంధానం చేసుకోవడం తప్పనిసరి కాదని, ఓటర్లు ఇష్టపడితేనే తమ ఆధార్ను స్వచ్ఛందంగా లింక్ చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఓటర్ ఐడీతో ఆధార్ సీడింగ్ చేసుకోని ఓటర్ల పేర్లను లిస్టులో నుంచి తొలగించబోమని తేల్చి చెప్పింది.

‘‘భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 326 ప్రకారం దేశ పౌరులకు మాత్రమే ఓటు హక్కును కల్పిస్తున్నాం. అయితే, ఆధార్ అనేది పౌరుల గుర్తింపు కోసం తెచ్చిన విధానం మాత్రమే. అందుకే ఆర్టికల్ 326లోని 23(4), 23(5), 23(6) సెక్షన్లు, ప్రజా ప్రాతినిధ్య చట్టం, 1950 నిబంధనలు, 2023 నాటి సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగానే ఓటర్ ఐడీతో ఆధార్ అనుసంధానం జరుగుతుంది. ఇందుకోసం త్వరలోనే యూఐడీఏఐతో ఈసీ టెక్నికల్ ఎక్స్పర్ట్లు సంప్రదింపులు ప్రారంభిస్తారు” అని ఈసీ వివరించింది.