ఓటరు మిత్రమా జాగ్రత్త.. ఓటేస్తే ఆ సౌండ్​ రావాల్సిందే....

మే 13, 2024.. సోమవారం. రెండు రాష్ట్రాల్లో ఓట్ల పండుగ. ప్రతీ ఓటరు ఓటేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తోన్న సందర్భం. ఈ నేపథ్యంలో ఓటుకు ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఓటు వేయడానికి అమల్లో ఉన్న పద్ధతులేంటీ? అన్న విషయాలు తెలుసుకుందాం.

ఓటరు జాబితాలో పేరుందా?

మీరు ముందుగా చెక్ చేసుకోవాల్సిన విషయం మీ పేరు ఓటరు జాబితాలో ఉందా? ఎన్నికల సంఘం వెబ్సైట్లో మీ పేరు లేదా ఎపిక్ నెంబర్ లేదా అడ్రస్తో చెక్ చేసుకోవచ్చు.

https://electoralsearch.eci.gov.in/ వెబ్ సైట్ లో మీరు సులభంగా చెక్ చేసుకోవచ్చు

ఎపిక్ డౌన్లోడ్ చేసుకోండి

ఓటరు గుర్తింపు కార్డు(ఎపిక్) ఉండడం మంచిది. మీ పేరు జాబితాలో ఉంటే మీ ఎపిక్ను మీరు సులభంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు https://voterportal.eci.gov.in/login వెబ్సైట్లోకి వెళ్లి మీ వివరాలు నమోదు చేయగానే డౌన్లోడ్ అప్షన్ వస్తుంది. అయితే మీ మొబైల్ నెంబర్ అనుసంధానం కాకపోతే మాత్రం మీరు డౌన్లోడ్ చేసుకోలేరు.

ఎపిక్ లోపాలుంటే…

ఇక కొందరి ఓటరు కార్డుల్లో స్వల్ప తేడాలు (అడ్రస్ మార్పు, ఫోటో పాతది ఉండడం లేదా పేరు అక్షరాల్లో మార్పులు) ఉండొచ్చు. దానికి ఎలాంటి కంగారు లేదు. ఎపిక్ వివరాల్లో స్వల్ప తేడాలున్నా, ఓటరు గుర్తింపు నిర్ధారణ అయితే ఓటు హక్కు కల్పిస్తారు. ఓటరు గుర్తింపు కార్డులో ఫొటోలు తారుమారు కావడం, ఇతర లోపాలతో ఓటరు గుర్తింపు ధ్రువీకరణ సాధ్యం కానప్పుడు, కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన జాబితాలోని ప్రత్యామ్నాయ ఫొటో గుర్తింపు పత్రాల్లో ఏదైనా ఒకదానిని ఆధారంగా చూపాల్సి ఉంటుంది. ప్రవాస భారత ఓటర్లు తమ పాస్పోర్టును తప్పనిసరిగా చూపాల్సి ఉంటుందని తెలిపింది.

  • *  ఆధార్ కార్డు
  • *  ఉపాధి హామీ కార్డు
  • *   జాబ్ కార్డు
  • *   బ్యాంకు/తపాలా కార్యాలయం జారీ చేసిన ఫొటోతో కూడిన పాసుబుక్
  • *   కేంద్ర కార్మికశాఖ పథకం కింద జారీ చేసిన ఆరోగ్య బీమా స్మార్ట్ కార్డు
  • *   డ్రైవింగ్ లైసెన్స్
  • *   పాన్ కార్డు
  • రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సెస్ కమిషనర్, ఇండియా(ఆర్జీఐ).. నేషనల్ పాపులేషన్ రిజిస్ట్రార్(ఎన్పిఆర్)కింద జారీ చేసిన స్మార్ట్ కార్డు
  • *  భారతీయ పాస్పోర్టు
  • *  ఫొటో గల పెన్షన్ పత్రాలు
  • * కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాలు/పీఎస్యూలు/ పబ్లిక్ లిమిటెడ్
  • *  కంపెనీలు జారీ చేసిన ఉద్యోగి గుర్తింపు కార్డులు
  • *  ఎంపీలు/ఎమ్మెల్యేలు/ఎమ్మెల్సీలకు జారీ చేసిన అధికారిక గుర్తింపు కార్డులు
  • *  కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత మంత్రిత్వ శాఖ జారీ చేసిన యూనిక్ డిజెబిలిటీ గుర్తింపు కార్డు(యూడీఐడీ)

పోలింగ్ స్లిప్పులు

పోలింగ్ కు కొన్ని రోజుల ముందే పోలింగ్ కేంద్రం పేరు, తేదీ, సమయం, ఇతర వివరాలతో ఓటర్లకు పోలింగ్ ఇన్ఫర్మేషన్ స్లిప్పులను జారీ చేస్తారు. అయితే, వీటిని ఓటరు గుర్తింపుగా పరిగణించరు. కానీ ఇందులో.. పార్ట్ నెంబర్, ఓటరు సీరియల్ నెంబరు ఉంటాయి. ఈ వివరాలతో ఓటరు జాబితాలో మిమ్మల్ని సులభంగా గుర్తిస్తారు. ప్రభుత్వ గుర్తింపు కార్డు ఏదున్నా.. మీకు ఓటు హక్కు కల్పిస్తారు. కాబట్టి పోలింగ్ స్లిప్పు ఉంటే మీ పని చాలా సులభం.

 ఓటు వేయడం చాలా సులభం

  • • కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం
  • • మీ ఓటర్ స్లిప్పు భద్రపరుచుకోండి
  • • మీ వెంట గుర్తింపు కార్డు తీసుకెళ్లండి
  • • పోలింగ్ బూత్లో ప్రశాంతంగా ఓటేయండి
  • • ఓటు వేశారా లేదా.. జాగ్రత్తగా పరిశీలించండి
  • • ఈవీఎం గురించి తెలుసుకోండి.. ఎవరి మాటలు వినొద్దు..
  • • ఓటు వేసిన తర్వాత బీప్ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు
  • • మీరు వేసిన ఓటు సరిగా పడిందా లేదా వీవీ పాట్లో చెక్ చేసుకోవచ్చు
  • పోలింగ్ బూత్ లో మీ ఓటు ఎలా వేసుకోవాలంటే.?
  • • పోలింగ్ బూత్లోకి వెళ్లగానే మీ దగ్గరున్న పోలింగ్ స్లిప్పును చూపించండి. లేదా మీ ఓటరు సీరియల్ నెంబర్, పార్టు నెంబరు చెప్పండి.
  • • ఈ వివరాలను బట్టి ఒక్క నిమిషంలో ఓటర్ వివరాలను ధృవీకరిస్తారు
  • • వివరాలన్నీ సరిగ్గా ఉన్నాయని నిర్ధారణ అయిన తరువాత మరో పోలింగ్ అధికారి మీ ఎడమ చూపుడువేలిపై సిరా గుర్తు వేస్తారు.
  • • మీ వివరాలను (ఓటరు ఐడీ నెంబరు) ఫారం 17Aలో నమోదు చేస్తారు.
  • • ఓటరు జాబితాలో బొటనవేలి ముద్ర లేదా సంతకం చేయించుకుంటారు.
  • • ఎలక్టోరల్ రోల్ కాపీలో గుర్తు పెట్టి మీరు ఓటు వేయడానికి ఓటింగ్ కంపార్ట్మెంట్కు వెళ్లడానికి అనుమతిస్తారు.
  • • ఓటింగ్ కోసం ఏర్పాటు చేసిన చిన్న గదిలో ఓటేసే EVM మెషీన్, దాని పక్కనే VVPAT యంత్రమూ ఉంటుంది.
  • • (మీరు ఎవరికి ఓటేశారో కాగితంపై ముద్రించి చూపించే యంత్రమే ఈ VVPAT)
  • • ఈవీఎంపై అభ్యర్థుల పేర్లు ఒక పక్క…. వారికి కేటాయించిన గుర్తులు మరో వైపు… వీటి పక్కన్నే నీలి రంగు బటన్ ఉంటాయి.
  • • మీకు నచ్చిన అభ్యర్థికి కేటాయించిన గుర్తు పక్కన్నే ఉన్న నీలి రంగు బటన్ ను నొక్కితే మీ ఓటు నమోదైనట్లు లెక్క.
  • • బటన్ నొక్కిన తరువాత అయిదు సెకన్ల పాటు బీప్​ అనే చిన్న శబ్దం వినిపిస్తుంది.
  • • ఆ వెంటనే VVPAT మెషీన్పై పచ్చటి లైట్ వెలుగుతుంది.
  • • VVPATపై ఉండే స్క్రీన్పై చూస్తే… మీరు ఓటేసిన అభ్యర్థి తాలూకూ గుర్తు, ఈవీఎంపై అతడికి కేటాయించిన క్రమసంఖ్య, పేరు ముద్రించిన కాగితపు స్లిప్ ఏడు సెకన్లపాటు కనిపిస్తుంది.
  • • ఏడు సెకన్ల తరువాత ఈ స్లిప్ కాస్తా బాక్స్ లోకి పడిపోతుంది.

ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు రెండూ జరుగుతున్నాయి కాబట్టి.. పోలింగ్ బూత్లో రెండు ఈవీఎంలు, రెండు వీవీ పాట్లు ఉంటాయి. ఒక ఓటు మాత్రమే వేసి రెండో ఓటు మరిచిపోవద్దు. ఓపిగ్గా.. రెండు ఓట్లు వేసి ప్రజాస్వామ్యంలో ఓటరుగా మీ బాధ్యతను నిర్వర్తించుకోవాలి