ఓటరు జాబితాను పకడ్బందీగా రూపొందించాలి : సురేంద్ర మోహన్

ఓటరు జాబితాను పకడ్బందీగా రూపొందించాలి : సురేంద్ర మోహన్

నిర్మల్, వెలుగు: సమగ్ర ఓటరు జాబితాను పకడ్బందీగా రూపొందించాలని ఉమ్మడి జిల్లా ఓటరు జాబితా పరిశీలకుడు కె.సురేంద్ర మోహన్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్​లో అడిషనల్ కలెక్టర్ కిశోర్ కుమార్, ఉట్నూర్ సబ్ కలెక్టర్ యువరాజ్ తో కలిసి ఎన్నికల అధికారులు, సహాయ ఓటరు నమోదు అధికారులు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో రివ్యూ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా రాజకీయ పార్టీల ప్రతినిధుల సమన్వయంతో స్పష్టమైన ఓటరు జాబితా రూపొందించాలని ఆదేశించారు.

రాజకీయ పార్టీలు ప్రతి పోలింగ్ కేంద్రానికి తమ ఏజెంట్లను నియమించాలని, జాబితా రూపకల్పనపై అధికారుల సమన్వయంతో పనిచేయాలన్నారు. జనవరి 1, 2025 నాటికి 18 ఏండ్లు నిండిన వారు ఓటరు నమోదుకు అర్హులని.. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఓటరు నమోదుపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. సమావేశంలో ఆర్డీఓలు రత్నకల్యాణి, కోమల్ రెడ్డి, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

18 ఏండ్లు నిండినవారిని ఓటరుగా నమోదు చేయాలి

ఆదిలాబాద్ ​టౌన్: ఓటు వేసేందుకు అర్హులైన 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేయాలని ఓటరు జాబితా పరిశీలకుడు సురేంద్ర మోహన్​ ఆదేశించారు. ఆదిలాబాద్​పట్టణంలోని పలు పోలింగ్ కేంద్రాల్లో జరుగుతున్న ఓటరు నమోదు ప్రక్రియను కలెక్టర్​ రాజర్షి షాతో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్​లో తహసీల్దార్లు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి ఓటరు నమోదు కార్యక్రమంపై సమావేశం నిర్వహించారు. పొరపాట్లకు తావులేకుండా రాజకీయ పార్టీల ప్రతినిధుల సమన్వయంతో స్పష్టమైన ఓటరు జాబితా రూపొందించాలని సూచించారు. ఐటీడీఏ పీఓ ఖుష్బూ గుప్తా, అడిషనల్ ​కలెక్టర్ శ్యామలా దేవి, ఆర్డీఓ వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.