- 2016లో 1,68,025 మంది.. ప్రస్తుతం 85,128
- గడువు ముంచుకొస్తున్నా ఖరారు కాని రిజర్వేషన్లు
- బకాయి గడువు ముగిసినా స్పందించని వినియోగదారులు
రాజన్న సిరిసిల్ల, వెలుగు : సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం(సెస్) ఎన్నికల నేపథ్యంలో ఈసారి భారీగా ఓటర్లు తగ్గిపోయారు. జిల్లావ్యాప్తంగా 85,128 మంది ఓటర్లు ఉన్నట్లు సెస్ ఎన్నికల అధికారి సుమిత్ర 19వ తేదీ రాత్రి ఓరల్ గా ప్రకటించారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఓటర్లు భారీగా తగ్గారు. 2016 ఎన్నికల్లో 1,68,025 ఓటర్లు ఉండగా ఈసారి అందులో సగమే ఉన్నారు. సెస్ లో బకాయిలు ఉన్న కస్టమర్లు నవంబర్16 వరకు చెల్లించేందుకు అవకాశం ఇచ్చారు. బకాయిలు వసూలైతే ఓటర్లు పెరిగే అవకాశం ఉండేది. కానీ చాలా మంది ఓటర్లు బకాయిలు చెల్లించి ఓటు వేసేందుకు ఆసక్తి చూపలేదు. మరోవైపు షెడ్యూల్ ప్రకారం ఓటర్‌జాబితా, రిజర్వేషన్ సిద్ధం చేయకపోవడంతో ఎన్నికల ప్రక్రియ అయోమయంగా తయారైంది.
చనిపోయినవారి లిస్ట్‌లో సెస్ మాజీ చైర్మన్..
ఓటర్‌లిస్ట్‌ను గ్రామాలవారీగా జీపీలలో డిస్ ప్లే చేస్తామని చెప్పిన అధికారులు ఆదివారం వరకు చాలా చోట్ల డిస్ ప్లే చేయలేదు. కొన్ని గ్రామాలలో చేసినా ఓటరు లిస్ట్ లో తప్పులు దొర్లాయి. బతికున్నోళ్లు చనిపోయినట్లు, చనిపోయినోళ్లు బతికున్నట్లు కనిపించడంతో ఓటర్లు ఖంగుతింటున్నారు. సెస్ మాజీ చైర్మన్ మరణించినట్లు ఓటర్‌లిస్ట్ చూపించడంతో ఆయన సెస్ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అవగాహన లేని వారితో సెస్ ఎన్నికల ఆథారిటీ ఓటర్ల లిస్ట్ ను అప్లోడ్ చేయించారని సెస్ ఉద్యోగులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రకటించిన ఓటరు లిస్ట్ లో 43,800 మంది మరణించినట్లు తెలిపారు. మరణించిన ఓట్లతోపాటు విద్యుత్బకాయి ఉన్న వారి ఓట్లు తొలగించడంతో 85వేల మంది ఓటర్లు మాత్రమే మిగిలారు.
వివరాలు ఇవ్వని ఆఫీసర్లు..
ఓటర్ల వివరాలు ఇవ్వడానికి సెస్ ఆఫీసర్లు జంకుతున్నారు. ఏ విషయమైనా ఎన్నికల అధికారి చెబుతారని సమాధానం దాటవేస్తున్నారు. ఓ వైపు ఎన్నికల గడువు ముంచుకొస్తున్నా ఇప్పటికీ మండలాలవారీగా ఓటరు లిస్ట్ ప్రకటించలేదు. రిజర్వేషన్ ఖరారు చేయలేదు. డిసెంబర్ 5 నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో భారీగా తగ్గిన ఓటర్లతో ఆశావాహులు బెంబెలెత్తుతున్నారు. డిసెంబర్ 13 నుంచి నామినేషన్ల స్వీకరణ ఉండడంతో రిజర్వేషన్లు తేలితే ఆశావాహుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
డైరెక్టర్ స్థానాలు పెంచే యత్నం..
జిల్లాలో 13 మండలాలతో పాటు సిరిసిల్ల, వేములవాడ పట్టణాలు సెస్ పరిధిలో ఉన్నాయి. 13 మండలాలకు 11 డైరెక్టర్ స్థానాలుండగా వాటిని 15 కు పెంచేందుకు రాష్ట్రస్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొత్తగా ఏర్పడిన మండలాలు వీర్నపల్లి, రుద్రంగి మండలాలతోపాటు మరో డైరెక్టర్ స్థానాన్ని పెంచేందుకు కోర్టును ఆశ్రయించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అధికార పార్టీ లీడర్లు చెబుతున్నారు. మరోవైపు సెస్ ఎన్నికల ప్రక్రియ మొదలైన నాటి నుంచి ఎండీ రామకృష్ణ అనారోగ్యంతో మెడికల్ లీవ్ లో ఉండడంతో సెస్ కు సంబంధించిన విషయాలపై క్లారిటీ ఇచ్చేవారు కరువయ్యారు. ఎన్నికల అధికారి సుమిత్ర హైదరాబాద్ నుంచి వస్తూ పోతూ ఉన్నప్పటికీ ఉన్నతాధికారులెవరూ అందుబాటులో ఉండడం లేదు.