- బల్దియా కమిషనర్ రోనాల్డ్ రోస్
హైదరాబాద్, వెలుగు : రెండో స్పెషల్ సమ్మరీ రివిజన్లో భాగంగా అర్హులైన వారందరూ ఓటరుగా నమోదు చేసుకోవడానికి సెప్టెంబర్ 2,3 తేదీల్లో రెండ్రోజుల పాటు పోలింగ్ స్టేషన్ స్థాయిలో స్పెషల్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఓటరు జాబితా తయారీలో భాగంగా 18 ఏండ్లు నిండిన వారు, ఇప్పటి వరకు ఓటరు జాబితా పేరు లేని వారితో పాటు అక్టోబర్ 1, 2023 నాటికి 18 ఏండ్లు నిండబోయే వారు ముందస్తుగా నమోదు చేసుకోవచ్చన్నారు.
21-08, -2023 న ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేసిన నేపథ్యంలో ఓటరు జాబితాలో పేరు ఉందో లేదో ముందుగా పరిశీలన చేసుకోవాలని, పేరులో ఏదైనా తప్పులు ఉంటే సవరించుకునే అవకాశం ఉందన్నారు. స్పెషల్ క్యాంపెయిన్ సందర్భంగా బూత్ లెవెల్ అధికారి పోలింగ్ స్టేషన్లో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటారన్నారు. ఓటరు జాబితాలో చెక్ చేయడానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్ సైట్ ceotelangana.nic.in లో కూడా పరిశీలన చేసుకోవచ్చన్నారు.
నూతన ఓటరు నమోదుకు ఫారం-6, ఆధార్‌ను లింక్ చేయడానికి ఫారం 6బీ, ఓటరు జాబితా అభ్యంతరాలు, ఓటరు తొలగింపునకు ఫారం-7, మార్పులు చేర్పులకు ఫారం-8 ద్వారా సెప్టెంబర్ 19లోగా నమోదు చేసుకోవచ్చన్నారు. ఈసీఐ వెబ్ సైట్ https://voters.eci.gov.in లేదా voter helpline app డౌన్లోడ్ చేసుకోవాలని ఆయన కోరారు.