పట్టభద్రులు పట్టించుకోవట్లే..

పట్టభద్రులు పట్టించుకోవట్లే..
  • ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎమ్మెల్సీ ఓటు నమోదుకు అనాసక్తి 
  • ఇప్పటివరకు కేవలం 23 వేల మంది మాత్రమే దరఖాస్తు
  • అవగాహన కల్పిస్తున్నా ఫలితం అంతంత మాత్రమే
  • రెండ్రోజుల్లో ముగియనున్న గడువు

ఆదిలాబాద్, వెలుగు: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఓటరు నమోదు ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్‌–నిజామాబాద్‌–కరీంనగర్‌–మెదక్‌ జిల్లాల పరిధిలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనుండగా ఓటరుగా నమోదు చేసుకునేందుకు పట్టభద్రులు అంతగా ఆసక్తి చూపడం లేదు. ఇంకా రెండ్రోజులు మాత్రమే గడువు ఉండగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు కేవలం 23 వేల మంది మాత్రమే దరఖాస్తులు చేసుకున్నారు. నాలుగు జిల్లాల్లోని 42 అసెంబ్లీ నియోజకవర్గాల్లో లక్షల్లో గ్రాడ్యుయేట్స్ ఉన్నా.. ఓటరుగా దరఖాస్తు చేసుకోకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మిగిలిన ఈ రెండు రోజుల్లో ఎంతమంది నమోదు చేసుకుంటారనేది ఆసక్తిగా మారింది.

అవగాహన కల్పిస్తున్నా..

ప్రస్తుతం గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీగా జీవన్‌ రెడ్డి కొనసాగుతున్నారు. ఆయన పదవీకాలం ఫిబ్రవరిలో ముగియనుండగా.. ప్రభుత్వం ఓటరు నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించింది. సెప్టెంబర్ 30 నుంచి నవంబరు 6వ తేదీ వరకు ప్రక్రియ కొనసాగనుంది. ఆశావహ అభ్యర్థులు సైతం ప్రచారం ప్రారంభించారు. తమను గెలిపించాలని ప్రచారం చేసుకుంటూనే.. ఓటరుగా నమోదు చేసుకోవాలని గ్రాడ్యుయేట్లను కోరుతున్నారు.

ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలు, కార్యాలయాల్లో కొందరు అభ్య ర్థులు ఓటు నమోదుపై విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. జిల్లాల్లోని అన్ని తహసీల్దార్‌, ఆర్డీవో ఆఫీసుల్లో ఓటరు నమోదు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రత్యేక అధికారిని నియమించి దరఖాస్తులు తీసుకుంటున్నారు. ఎమ్మెల్సీగా పోటీ పడే ఆశావహులు పోస్టర్లు రూపొందించి, ప్రత్యేకంగా ఓటరు నమోదు కేంద్రాలను ఏర్పాటు చేసినప్పటికీ  ఓటరు నమోదు మాత్రం ఆశించిన స్థాయిలో కనిపించడం లేదు. 

ఓటరు నమోదు చేసుకోండిలా..

పట్టభద్రుల విద్యార్హతల సర్టిఫికెట్లు, ఆధార్‌ కార్డు, ఓటర్‌ ఐడీ, తదితర వివరాలను సేకరించి ఓటరు నమోదు ప్రక్రియను పూర్తిచేస్తున్నారు. 2021 అక్టోబరు 31 వరకు డిగ్రీ పూర్తిచేసిన వారు ఓటరుగా అర్హులు. ఫారం–18ను పూర్తిచేసి ఓటు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే సెల్ ఫోన్లలోనూ ఓటరు నమోదు చేసుకునే అవకా శాన్ని ఎన్నికల కమిషన్‌ కల్పించింది. సంబంధిత ఫారాన్ని పూర్తిచేసి గెజిటెడ్‌ అధికారి ధ్రువీకరించిన డిగ్రీ ప్రొవిజనల్‌, ఆధార్‌, ఓటర్‌ ఐడీలతో పాటు ఫొటోను వెబ్‌సైట్‌ www.ceotelangana.nic.in <http://www.ceotelangana.nic.in> లో  అప్‌లోడ్‌ చేస్తే సరిపోతుంది.

ఆన్​లైన్ లోనూ దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించినప్పటికీ నామమాత్రంగానే వస్తున్నాయి.  6వ తేదీలోగా పూర్తిచేసుకున్న దరఖాస్తులను పరిశీ లించి నవంబర్ 23న ముసాయిదా ఓటరు జాబితాను అధికారులు విడుదల చేయనున్నారు. అభ్యంతరాల స్వీకరణ అనంతరం డిసెంబర్ 30న తుది జాబితా వెల్లడిస్తారు. అయితే ఓటరుగా నమోదు చేసుకున్నవారి సంఖ్య తక్కువగా ఉండడంతో ఈనెల 6న ముగుస్తున్న గడువును పొడిగించాలని అభ్యర్థులు, ఆయా పార్టీల లీడర్లు కోరుతున్నారు.