ఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు

ఖమ్మం కార్పొరేషన్​, వెలుగు : కొత్త ఓటరు నమోదు ప్రక్రియ వందశాతం పూర్తవ్వాలని కలెక్టర్​ వీపీ గౌతమ్​ అధికారులకు సూచించారు. కలెక్టరేట్ లో గురువారం తహసీల్దార్లతో ఓటర్ల నమోదు, టీఎం33ధరఖాస్తుల పరిష్కారంపై వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఓటర్​ నమోదుకు  జనవరి, ఏప్రిల్, జూలై, అక్టోబర్​ 31 కటాఫ్​గా నిర్ణయించినట్టు, ఆయా తేదీల్లో నమోదు కార్యక్రమాలు చేయాలన్నారు. సమీక్షలో అడిషనల్​ కలెక్టర్లు స్నేహలతా మొగిలి, ఎన్​ మధుసూదన్​, ఖమ్మం నగరపాలక కమిషనర్​ ఆదర్శ్​ సురభి, డీఆర్​ఓ శిరీష, ఆర్డీఓ రవీంధ్రనాథ్​ పాల్గొన్నారు. 

బీసీ భవన్​ నిర్మాణంలో వేగం పెంచాలి

బీసీ భవన్​ నిర్మాణంలో వేగం పెంచాలని కలెక్టర్​ వీపీ గౌతమ్​ ఆదేశించారు. తెలంగాణ తల్లి సర్కిల్​లో నిర్మిస్తున్న బీసీ భవన్​ పనులను గురువారం సుడా చైర్మెన్​ బచ్చు విజయ్​తో కలిసి పరిశీలించారు. బీసీ స్టడీ సర్కిల్​లో శిక్షణను పరిశీలించారు. ఈ సందర్భంగా వారితో 
మాట్లాడుతూ... క్లాసులు అన్నింటికీ హాజరుకావాలని, వీకెండ్​ పరీక్షలు తప్పకుండా రాయాలని సూచించారు. కలెక్టర్​తో పాటు బీసీ సంక్షేమాధికారి జ్యోతి, పీఆర్​ ఈఈ కెవి​కె శ్రీనివాస్​, డైరెక్టర్​ శ్రీలత, ఇతర అధికారులున్నారు.

అమరుల స్ఫూర్తితో కార్మిక ఉద్యమాలు 

భద్రాచలం, వెలుగు: అమరుల స్ఫూర్తితో కార్మిక ఉద్యమాలు నిర్మించాలని సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షులు సాయిబాబా పిలుపునిచ్చారు. స్థాని క సమ్మక్క సారక్క ఫంక్షన్​ హాలులో సీఐటీయూ జిల్లా మూడో మహాసభలు గురువారం ప్రారంభమయ్యాయి. సీఐటీయూ జెండాను సీనియర్​ లీడర్​ నారాయణ ఆవిష్కరించారు. కుంజాబొజ్జి, సున్నం రాజయ్య, మల్లు స్వరాజ్యం, చల్లా వెంకన్నకు నివాళి అర్పించారు. అనంతరం సాయిబాబా మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులను దోచుకుంటున్నాయని, కార్మిక వ్యతిరేక చట్టాలను రూపొందిస్తూ కార్మికుల హక్కులను కాలరాస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వాలు కార్పొరేట్ల కోసం పని చేస్తున్నాయని, వారికి అనుగుణంగా చట్టాలను తయారు చేసి సామాన్యులకు అన్యాయం చేస్తున్నారని చెప్పారు. కార్మిక వ్యతిరేక చర్యలను తిప్పి కొట్టి, హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి బి.మధు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఏజె రమేశ్​ , బ్రహ్మచారి, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

క్యాంపస్​ ప్లేస్​మెంట్స్​లో ‘ప్రియదర్శిని’ స్టూడెంట్ల ప్రతిభ

ఖమ్మం రూరల్, వెలుగు: మండలంలోని ప్రియదర్శిని విమెన్​ ఇంజినీరింగ్​ కాలేజీకి చెందిన 11 మంది స్టూడెంట్లు హైదరాబాద్​లోని ‘క్యూస్పైడర్స్ సాఫ్ట్​వేర్​ సొల్యూషన్స్’ కంపెనీ నిర్వహించిన క్యాంపస్​ ప్లేస్​మెంట్​లో ఉద్యోగాలు సాధించారు. సీఎస్ఈ గ్రూప్ ​నుంచి 6 గురు, ఈసీఈ నుంచి 4, ఈఈఈ నుంచి ఒకరు ఏడాదికి రూ. 3.5 లక్షల ప్యాకేజీతో సెలెక్ట్​ అయినట్టు కాలేజీ చైర్మన్ కాటేపల్లి నవీన్ బాబు, ప్రిన్సిపల్​ డాక్టర్​ బి.గోపాల్​ తెలిపారు. ఈ సందర్భంగా ఎంపికైనవారిని కాలేజీ యాజమాన్యం అభినందించారు. కార్యక్రమం లో హెచ్ఓడీ లు నరసింహారావు, రమేశ్​, కుమార స్వామి, సతీశ్, డాక్టర్ విజయలక్ష్మి, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ మన్మోహన్ తివారి పాల్గొన్నారు. 

మెనూ ప్రకారం భోజనం పెట్టకపోతే చర్యలు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: మెనూ ప్రకారం స్టూడెంట్లకు భోజనం పెట్టాలని, లేకుంటే చర్యలు తీసుకుంటామని డీఈఓ సోమశేఖర శర్మ హెచ్చరించారు. పాత కొత్తగూడెం, చుంచుపల్లి మండలాల్లోని పలు స్కూళ్లను గురువారం ఆయన సందర్శించారు. పాత కొత్తగూడెం స్కూల్​లో మధ్యా హ్న భోజనాన్ని మున్సిపల్​ వైస్​ చైర్మన్​ దామోదర్​తో కలిసి రుచి చూశారు.  వారానికి 3 రోజులు గుడ్లు తప్పనిసరిగా ఇవ్వాలన్నారు. పిల్లలకు పౌష్టికాహారం అందించడంలో మధ్యాహ్నభోజనమే కీలకం అన్నారు. అనంతరం హేమచంద్రాపురంలోని కాంప్లెక్స్​ సమావేశానికి హాజరయ్యారు. నాగారం హైస్కూల్​ను సందర్శించి మన ఊరు మన బడి పనులను పరిశీలించారు. 

వైభవంగా రాములోరి కల్యాణం

భద్రాచలం, వెలుగు : భద్రాద్రి ఆలయంలో గురువారం సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, ఆరాధన తర్వాత యజ్ఞోపవీతం, కన్యాదానం, జీలకర్రబెల్లం, మాంగల్యధారణ, తలంబ్రాల వేడుకలు జరిగాయి. అంతకు ముందు గోదావరి నుంచి తీర్ధబిందెను తెచ్చి గర్భగుడిలో మూలవరులకు సుప్రభాత సేవ  చేసి బాలబోగం నివేదించారు. చింతూరు ఏఎస్పీ మహేశ్వర్​రెడ్డి రామయ్యను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. 

నేడు సీఎం కృతజ్ఞత సభ

సత్తుపల్లి, వెలుగు : రాజ్యసభ సభ్యులుగా ఇటీవల ఎంపికైన డాక్టర్ బండి పార్థసారథి రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర సేవాభావం ఉన్నవారని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, ఎమ్మెల్సీ తాత మధు కొనియాడారు. జిల్లాకు రెండు రాజ్యసభ సీట్లను కేటాయించిన సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపేందుకు శుక్రవారం ఏర్పాటుచేసిన భారీ బహిరంగ సభను, ర్యాలీని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సభ ఏర్పాట్లను పరిశీలించి, క్యాంప్​ ఆఫీస్​లో మీడియాతో మాట్లాడారు. తల్లాడ, కల్లూరు మండలాల్లో మోటార్ సైకిల్ ర్యాలీ తో ఘన స్వాగతం పలకనున్నట్లు తెలిపారు. సాయంత్రం 4 గంటలకు జేవిఆర్ కళాశాల మైదానంలో బహిరంగ సభ ప్రారంభమవుతుందన్నారు. ఎమ్మెల్సీ తాత మధు మాట్లాడుతూ పార్టీ సంస్థాగత నిర్మాణంలో పటిష్టమైన కార్యాచరణను అమలు చేస్తూ జాతీయ రాజకీయాలకు కేసీఆర్ నడుంబించారన్నారు. శుక్రవారం నాటి కృతజ్ఞతా సభకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ నామా నాగేశ్వరరావు, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు తో పాటుగా రెండు జిల్లాల జడ్పీ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అందరూ హాజరవుతారని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కూసంపుడి మహేశ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొ త్తూరు ఉమామహేశ్వర రావు, ఎంపీపీ దొడ్డ హైమావతి శంకర్రావు, జడ్పీటీసీ కోసంపూడి రామారావు, ఆత్మ కమిటీ చైర్మన్ శీలపురెడ్డి హరికృష్ణ రెడ్డి, మాజీ లైబ్రరీ చైర్మన్ ఖమర్, ఖమ్మం కార్పొరేటర్ కమర్తపు మురళి పాల్గొన్నారు. 

అర్హులకే డబుల్​ ఇండ్లు

చండ్రుగొండ,వెలుగు: చండ్రుగొండ శివారులో  గిరిజనులకు కేటాయించిన డబుల్ బెడ్​ రూమ్​ ఇండ్లలో  గిరిజనేతరులు ఉంటున్నారని ఫిర్యాదు అందడంతో డిప్యూటీ తహసీల్దార్​ ప్రసన్న, ఆర్​ఐ ముత్తయ్య గురువారం కాలనీలో తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇక్కడి 5 ఇండ్లను ఇతరులు ఆక్రమించారని, వాటిని గుర్తించి స్వాధీనం చేసుకుంటున్నామని అధికారులు తెలిపారు. అయితే   ఆకుల విశ్వనాథం అనే వ్యక్తి   అధికారుతో  వాగ్వాదానికి దిగారు.  డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి భూమి ఇచ్చానని, తనకు ఒక ఇల్లు కేటాయించాలని పట్టుపట్టాడు. జిల్లా ఆఫీసర్ల నుంచి ఆర్డర్ తెచ్చుకుంటే ఇల్లు కేటాయిస్తామని ఆఫీసర్లు చెప్పడంతో ఇల్లు ఖాళీ చేశాడు. ఈ కార్యక్రమంలో సర్వేయర్ ధర్మరాజు, వీఆర్ఏలు, ఏఎస్‌ఐ కృష్ణారావు, సిబ్బంది ఐదు ఇండ్ల తాళాలు పగలగొట్టి లబ్దిదారులకు కేటాయించారు. 

20న ‘వనసమారాధన’

ఖమ్మం రూరల్​, వెలుగు : కార్తీక వన భోజనాల్లో భాగంగా ఈనెల 20న మున్నూరుకాపు సంఘం ఆధ్వర్యంలో వనసమారాధన కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు  సంఘం జిల్లా అధ్యక్షుడు పారా నాగేశ్వరరావు తెలిపారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. రూరల్​ మండలంలోని గుదిమళ్ల పంచాయతీలోని కాళ్ల రామారావు మామిడితోలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కార్యక్రమానికి ఎంపీ వద్దిరాజు రవిచంద్ర వస్తున్నట్టు తెలిపారు.  జిల్లాలోని మున్నూరు కాపు కులస్తులు అందరూ హాజరుకావాలని కోరారు. కార్యక్రమంలో సుడా డైరెక్టర్​ బచ్చు విజయ్​కుమార్​, టీఆర్ఎస్​ జిల్లా నాయకులు కృష్ణ, నర్సయ్య పాల్గొన్నారు.