హైదరాబాద్: మునుగోడు అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉపఎన్నికను రద్దు చేయాలని మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నేత గోనె ప్రకాశరావు ఎన్నికల కమిషన్ కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ కు లేఖ సమర్పించినట్లు మీడియాకు వెల్లడించారు. మునుగోడు ఉపఎన్నిక ప్రచారపర్వంలో అన్ని పార్టీలు డబ్బులు, మద్యం విపరీతంగా పంచుతున్నాయని ఆరోపించారు. ఎన్నికల నిబంధనలు ఏ పార్టీ కూడా పాటించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.
అధికార టీఆర్ఎస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలను గ్రామాలకు ఇంచార్జ్ లుగా నియమించి ఓటర్లను ప్రలోభ పెడుతున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ తోపాటు బీజేపీ కూడా ఓటర్లకు వేలకు వేలు పంచేందుకు సిద్ధమయ్యాయని తెలిపారు. ఇప్పటికే కోట్ల రూపాయలు ఖర్చు చేశారని ఈసీకి సమర్పించిన లేఖలో పేర్కొన్నారు. ఆర్టికల్ 324 ప్రకారం ఎన్నికల కమిషన్ కు ఉన్న అధికారాలతో.. మునుగోడు ఉప ఎన్నికను రద్దు చేయాలని గోనె ప్రకాశరావు కోరారు.
గత ఏడాది నల్గొండ జిల్లాలో మొత్తం 65 కోట్ల మద్యం అమ్మకం..
మునుగోడులో కేవలం 22 రోజుల్లోనే 165 కోట్ల మద్యం అమ్మకాలు..
గత సంవత్సరం మొత్తం నల్గొండ జిల్లాలో 165 కోట్ల మద్యం అమ్ముడుపోతే.. ఒక్క మునుగోడులో గత 22 రోజుల్లోనే 165 కోట్ల అమ్మకాలు జరిగాయని గోనె ప్రకాశరావు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు, ఎంపీలు, రాజ్యసభ సభ్యులు 125 మందికిపైగా మునుగోడులో డబ్బు, మద్యం పంపిణీ చేస్తూ ప్రలోభాలకు గురిచేస్తున్నారని ఆరోపించారు. మంత్రులు, ఎమ్మెల్యేలే తాగడం తెలంగాణ సంప్రదాయం అంటూ సమర్థించుకుంటున్నారని విమర్శించారు.
దేశ రాజకీయ చరిత్రలో ఎక్కడా లేనంతగా మునుగోడు ఉప ఎన్నికల్లో మద్యం, డబ్బులు, కానుకలతో ప్రలోభాలకు గురిచేస్తున్నారని చెప్పారు. హుజూరాబాద్ లో ఓటుకు 6వేలు ఇచ్చిన ఘటన చూశామని.. మునుగోడులో ఓటుకు 20వేలు.. ఇంట్లో ఆడోళ్లు ఉంటే తులం బంగారం కూడా ఇస్తున్నారని ఆరోపించారు. నిన్న రాత్రి నుండే డబ్బుల పంపిణీ జరిగిందని.. పోలీసులు ఎక్కడా ఆపకుండా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందని గోనె ప్రకాశరావు విమర్శించారు. మునుగోడులో పరిస్థితిని వివరిస్తూ కేంద్ర ఎన్నికల సంఘంతోపాటు.. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ కు లేఖ సమర్పించానని.. ఆర్టికల్ 324 ప్రకారం ఎన్నికను రద్దు చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని గోనె ప్రకాశరావు కోరారు.