భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పలు ప్రాంతాల్లో అధికార బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులను ఓటర్లు, కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. కొత్తగూడెం నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు తన అనుచరులతో లక్ష్మీదేవిపల్లి మండలంలోని రేగళ్లలో ఓటింగ్ సరళిని పరిశీలించేందుకు వెళ్లగా ఓటర్లు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే ఒక్కరే వెళ్లాలని, అనుచరులతో వెళ్లకూడదని ఓటర్లు పట్టుబట్టడంతో ఓటర్లకు, బీఆర్ఎస్ అనుచరులకు మధ్య వాగ్వావాదం జరిగింది.
చివరకు ఎమ్మెల్యే వెళ్లిపోవడంతో ఆందోళన సద్దుమణిగింది. పినపాక నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి రేగా కాంతారావు.. ఏడూళ్ల బయ్యారంలో పోలింగ్ బూత్‌ను పరిశీలించేందుకు వెళ్లగా కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. చివరకు పోలీసులు లాఠీలకు పనిచెప్పడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఇల్లెందు నియోజకవర్గంలోని టేకులపల్లి గవర్నమెంట్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలోకి ఎమ్మెల్యే అభ్యర్థి బానోత్ హరిప్రియ భర్త హరిసింగ్ తన వెహికిల్‌లో లోపలికి వెళ్లడంతో పలువురు ఓటర్లతో పాటు కాంగ్రెస్ నాయకులు అభ్యంతరం తెలిపారు.
కాంగ్రెస్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వెళ్లాలని చెప్పడంతో ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు. టేకులపల్లి మండలంలోని సులానగర్ పోలింగ్ బూత్‌లో విధుల్లో ఉన్న బీఎల్ఓ పద్మపై బీఆర్ఎస్ లీడర్ గురువయ్యతో పాటు ఆయన అనుచరులు కూడా దాడి చేశారు. పోలింగ్ బూత్ వద్ద ఆమెతో పాటు మరో బీఎల్ఓవెంకటేశ్, సెక్రటరీ పవిత్రపై దాడికి యత్నించడంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ లీడర్లు దాడి చేస్తున్నా పోలీసులు పట్టించుకోలేదనే విమర్శలు వెల్లువెత్తాయి. ఇల్లెందులో బీఆర్ఎస్ లీడర్లు డబ్బులు పంచలేదని ఆరోపిస్తూ పట్టణంలోని పలు వార్డులకు చెందిన ఓటర్లు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ క్యాంపు ఆఫీసులో ఆందోళన నిర్వహించారు. డబ్బులిస్తామంటూ చెప్పి మోసం చేశారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే పాల్వంచ మండలంలోని హమాలీ కాలనీ, వనమా కాలనీల్లో వచ్చిన ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావును ఓటర్లు అడ్డుకున్నారు.
మందుపాతర నిర్వీర్యం
చర్ల మండలం చినముడిసిలేరు బి.కొత్తూరు రహదారి మధ్యలో మావోయిస్టులు అమర్చిన మందుపాతరను బాంబ్ స్క్వాడ్ బృందాలు నిర్వీర్యం చేశాయి. దీంతో పెను ప్రమాదం తప్పినట్లైంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.