- 12 జిల్లాల్లో ఫస్ట్ ప్లేస్
- ఎమ్మెల్సీ ఎన్నికల్లో 78.59 శాతం పోలింగ్ నమోదు
- లోక్ సభ ఎన్నికల్లోనూ పర్సంటేజ్ ఎక్కువే
- అసెంబ్లీ ఎన్నికల్లో స్టేట్‌లో మనమే టాప్
- యాదాద్రి జిల్లాలో ఓటరు చైతన్యం
యాదాద్రి, వెలుగు : ఇటీవల జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ యాదాద్రి జిల్లా ఓటర్లు చైతన్యం చూపుతున్నారు. రాజ్యాంగం ప్రసాదించిన ఓటు హక్కును ప్రతి ఎన్నికల్లోనూ జిల్లా ప్రజలు సమర్థవంతంగా వినియోగించుకుంటున్నారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లా స్టేట్‌లో మొదటి స్థానంలో నిలిచింది. ఈ మధ్య జరిగిన లోక్‌సభ ఎన్నికలతోపాటు సోమవారం జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ పెద్ద ఎత్తున ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో రాష్ట్రంలో అందరి దృష్టి యాదాద్రి జిల్లాపై పడింది.
12 జిల్లాల్లో యాదాద్రి టాప్..
సోమవారం జరిగిన నల్లగొండ, -వరంగల్, -ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో యాదాద్రి జిల్లా ఓటర్లు టాప్‌లో నిలిచారు. జిల్లాలో 34,080 మంది పట్టభద్రులైన ఓటర్లు ఉన్నారు. వీరిలో 26,785 మంది (78.59 శాతం) తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జనగామ జిల్లాలో 23,419 ఓటర్లకు 17,879 మంది (76.34 శాతం) ఓట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత స్థానాల్లో సిద్దిపేట, ములుగు, జయశంకర్భూపాలపల్లి, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు నిలవగా, 67.62 శాతం ఓట్లతో ఖమ్మం జిల్లా చివరి స్థానంలో నిలిచింది.
లోక్‌సభ ఎన్నికల్లోనూ 82.70 శాతం..
లోక్‌సభ ఎన్నికల్లోనూ భువనగిరి స్థానంలో ఎక్కువ ఓట్లు పోల్ కావడంతో టాప్‌లో నిలిచింది. ఈ స్థానం పరిధిలోని ఐదు జిల్లాల్లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, వీటిలో భువనగిరి, ఆలేరు నియోజకవర్గాలు యాదాద్రి జిల్లా పరిధిలో ఉన్నాయి. ఈ రెండు నియోజకవర్గాల్లో 4,55,866 మంది ఓటర్లు ఉండగా, 3,77,299 మంది (82.70 శాతం) తమ ఓటు హక్కును వినియోగించుకొని టాప్‌లో నిలిచారు. భువనగిరి లోక్‌సభ స్థానంలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 18,08,585 మంది ఓటర్లు ఉండగా, 13,88,680 మంది (76.78 శాతం) ఓటు హక్కును వినియోగించుకోవడంతో స్టేట్‌లోని టాప్‌లో నిలిచింది.
అసెంబ్లీ ఎన్నికల్లో స్టేట్ ఫస్ట్..
గతేడాది నవంబర్30న జరిగిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌లో యాదాద్రి జిల్లా టాప్‌లో నిలిచింది. భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల్లో 4,50,207 మంది ఓటర్లకు 4,06,804 మంది (90.36 శాతం) తమ ఓటు హక్కును వినియోగించుకొని స్టేట్‌లోనే మొదటి స్థానంలో నిలిచారు. నియోజకవర్గాలవారీగా జిల్లాలోని ఆలేరులో 90.77 శాతం, భువనగిరిలో 89.91 శాతం పోలింగ్‌నమోదు చేసి రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి.
ఓటర్లకు అభినందనలు..
యాదాద్రి జిల్లా ఓటర్లు సమర్థవంతంగా తమ ఓటు హక్కును వినియోగించు కుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల నుంచి ఇది కొనసాగుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ తాము ఊహకు మించి ఓటర్లు ఓట్లు వేశారు. 12 జిల్లాల్లో జరిగిన ఈ ఎన్నికల్లో యాదాద్రి జిల్లాను మొదటి స్థానంలో నిలిపిన ఓటర్లకు అభినందనలు.
- హనుమంతు జెండగే, యాదాద్రి జిల్లా కలెక్టర్