వెలుగు, నెట్వర్క్: ఓట్లకు నోట్లు ఇవ్వలేదని పలు జిల్లాల్లో ఓటర్లు ఆందోళనకు దిగడం చర్చనీయాంశమైంది. ‘పైసలిస్తమంటే పట్నం నుంచి వచ్చి ఓటేసినం.. తీరా ఇక్కడ ఎవరూ పట్టించుకుంటలేరు.. బస్సు చార్జీలు, కూలీ మీద పడేటట్టు ఉన్నయి..’ అని సిద్దిపేట జిల్లా చేర్యాలలో కొందరు ఓటర్లు ఆందోళనకు దిగగా, ‘కొన్ని గ్రూపులకు పైసలిచ్చి .. మా గ్రూపులకు ఇయ్యలేదు’ అంటూ సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలో కొందరు మహిళలు ఓ నేత ఇంటికి తాళం వేశారు. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో జరిగిన ఘటనలు లీడర్ల అవకాశవాదానికి, ఓటర్ల అమాయకత్వానికి అద్దం పట్టాయి.
సిద్దిపేట జిల్లా చేర్యాలలో..
ఓటేయించుకునేందుకు పట్నం నుంచి పిలిపించుకుని పైసలెందుకియ్యట్లేదని జనగామ నియోజకవర్గం చేర్యాల మండలంలోని ఆకునూరులో గురువారం ఓటర్లు ఆందోళన చేశారు. బతుకుదెరువు కోసం హైదరాబాద్ తదితర పట్టణాలకు వెళ్లి ఉంటున్న తమను గ్రామ బీఆర్ఎస్ లీడర్లు ఓటుకు రూ.రెండు వేలు ఇవ్వడంతో పాటు, ట్రావెలింగ్ అలవెన్స్రూ.500 ఇస్తామని చెప్పి పిలిపించారన్నారు. తాము నమ్మి ఆరు బస్‌సర్వీసులను మాట్లాడుకుని వస్తే నిండా ముంచారన్నారు. కనీసం ఓటర్ స్లిప్పులు కూడా ఇవ్వలేదని సుమారు 300 మంది నిరసన తెలిపారు. వచ్చిన వారంతా బీఆర్ఎస్ లీడర్ల ఇండ్ల ముందు ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి సర్ది చెప్పినా వినలేదు. ఒక దశలో పోలీసులతోనూ వాగ్వాదానికి దిగారు. చివరకు ఎలాగో నచ్చజెప్పి అందరూ ఓట్లు వేసేలా చూశారు. బీజేపీ స్టేట్ లీడర్ బైరవభట్ల చక్రధర్, బీజేపీ అభ్యర్థి డా. ఆరుట్ల దశమంతరెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని బీఆర్ఎస్ నాయకులు అపహాస్యం చేస్తున్నారని, నమ్మించి పిలిపించి ఓటర్ స్లిప్పులు కూడా ఇవ్వకుండా ఉండడాన్ని తప్పుపట్టారు. బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి గ్రామానికి వచ్చి మాట్లాడుతూ తాము ఎవ్వరికీ డబ్బులు ఇవ్వడం లేదన్నారు.
సిరిసిల్ల జిల్లాలో...
రాజన్నసిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం లింగంపేటలో బీజేపీ లీడర్ వెంగల శ్రీనివాస్ కొన్ని మహిళ గ్రూప్‌లకు మాత్రమే డబ్బులు పంచి, మిగతా గ్రూపులకు పంచలేదని ఆయన ఇంటిముందు మహిళా సంఘాలు ఆందోళన చేశాయి. శ్రీనివాస్ డబ్బులు ఇస్తేనే ఓట్లేస్తామని గంట పాటు భీష్మించారు. ముందే సమాచారం అందుకున్న శ్రీనివాస్ ఇంటికి తాళం వేసి పరారయ్యాడు. పోలీసులు వచ్చి
వారికి సర్ధి చెప్పారు.
ములుగు జిల్లాలో..
ములుగు జిల్లా మంగపేట మండల కేంద్రంలో డబ్బులు ఇవ్వలేదని బీఆర్ఎస్ లీడర్ ఇంటిపై కొంతమంది ఓటర్లు దాడి చేశారు. ఓటర్లకు పంచాలంటూ వచ్చిన డబ్బులను మధ్యలో లీడర్లు నొక్కేశారంటూ ఫైర్ అయ్యారు. సదరు లీడర్ఇంటి తలుపులు తోసుకుని లోపలికి వెళ్లారు. అప్పటికే ఆ లీడర్ పరారయ్యాడు.
సిద్దిపేట జిల్లాలో...
సిద్దిపేట జిల్లా కొండపాక మండలం మర్పడగలో ఓటు వేస్తే పైసలు ఇస్తామని చెప్పి ఇవ్వలేదని పోలింగ్ కేంద్రాలకు వెళ్లకుండా మహిళలు, కొంత మంది ఓటర్లు బీఆర్ఎస్లీడర్ ఇంటి ఎదుట నిరసన తెలిపారు. బీఆర్ఎస్ లీడర్లు కొంతమంది ఓటర్లకు డబ్బులు ఇచ్చారని, తమకు ఇవ్వలేదని నిలదీశారు. వారి నుంచి స్పష్టత లేకపోవడంతో ఆందోళన చేసి వెళ్లిపోయారు.