తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు 2024 పోలింగ్ ప్రారంభం అయ్యింది. మే 13వ తేదీ ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా.. రాష్ట్రవ్యాప్తంగా ఓటర్లు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. హైదరాబాద్ సిటీలో ఉదయమే సెలబ్రిటీలతోపాటు ఓటర్లు పోలింగ్ బూతులకు తరలివచ్చారు. ఇక జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. గ్రామాల్లోనూ ఓటర్లు ఉత్సాహంగా బయటకు వచ్చారు. పోలింగ్ ప్రారంభం అయిన గంటకే.. అంటే 8 గంటల సమయానికే రాష్ట్రంలోని చాలా పోలింగ్ బూతుల్లో ఓటర్ల క్యూ కనిపించింది.
ఎండాకాలం కావటంతో.. మధ్యాహ్నం ఎండ తీవ్రత ఉంటుందనే ఉద్దేశంతో ఓటర్లు ఉదయాన్నే ఓటు వేయటానికి తరలివచ్చారు. గతంలో కంటే భిన్నంగా ఈసారి ఓటర్లలో ఉత్సాహం కనిపించటం విశేషం. హైదరాబాద్ సిటీలోనూ ఇదే విధంగా కనిపించగా.. నల్గొండ, పెద్దపల్లి, మహబూబ్ నగర్, మెదక్, చేవెళ్ల, ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, సికింద్రాబాద్, మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాల్లో ఓటు వేయటానికి ఉదయమే తరలివచ్చారు ఓటర్లు.