- 2021 ఎన్నికల్లో 5 లక్షలకు పైగా రిజిస్ట్రేషన్
- ఈసారి 4.61లక్షలకు తగ్గిన ఓటర్లు
- నాడు ఆయా పార్టీల ఆధ్వర్యంలో పెద్దసంఖ్యలో నమోదు
- తాజాగా తగ్గడంపై అనుమానాలు
ఖమ్మం, వెలుగు: వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లోఈసారి ఓటర్ల సంఖ్య గతంలో కన్నా భారీగా తగ్గింది. 2021 ఎన్నికల నాటితో పోలిస్తే దాదాపు 44 వేల మంది తక్కువగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ మూడేండ్లలో కొత్తగా గ్రాడ్యుయేషన్ పూర్తయిన వాళ్లను కలిపితే 50 వేల మందికి పైగా గ్రాడ్యుయేట్లు ఈసారి ఓటింగ్‌కు దూరమవుతున్నారు. గ్రాడ్యుయేట్ల అనాసక్తితో పాటు, ఆయా రాజకీయ పార్టీలు పట్టించుకోకపోవడం వల్లే రిజిస్ట్రేషన్లు తగ్గాయని స్పష్టమవుతోంది. 2021 ఎన్నికల టైంలో పొలిటికల్ పార్టీలన్నీ గ్రాడ్యుయేట్ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేసి మరీ గ్రాడ్యుయేట్లతో దరఖాస్తు చేయించారు. ముఖ్యంగా నాడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసిన ఓ నేత తన యూనివర్సిటీలో చదివే విద్యార్థులను పెద్దసంఖ్యలో ఓటర్లుగా నమోదు చేయించడం అప్పట్లో చర్చనీయాంశమైంది. నాన్ లోకల్ గ్రాడ్యుయేట్లను ఓటర్లుగా నమోదు చేయించారనే ఆరోపణలు వచ్చాయి. కానీ, ఇప్పుడా పరిస్థితి లేకపోవడంతో రిజిస్ట్రేషన్ల సంఖ్య తగ్గిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
గతంలో కన్నా 43,759 ఓటర్లు తగ్గిన్రు..
ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి 2021 మార్చిలో ఎన్నికలు జరిగాయి. అప్పుడు 5,05,565 మంది ఓటర్లుగా రిజిస్టర్ చేసుకున్నారు. కానీ, ఈసారి 4,61,806 మాత్రమే ఓటు కోసం రిజిస్టర్ చేసుకున్నారు. వీరిలో 2,87,007 మంది పురుషులు, 1,74,794 మంది మహిళలతో పాటు ఇతరులు ఐదుగురు ఓటర్లుగా ఉన్నారు. నవంబర్ 1, 2023 ప్రమాణ తేదీగా తీసుకొని అధికారులు తుది ఓటర్ల జాబితా తయారు చేశారు. రూల్స్ ప్రకారం ఆ గడువుకు మూడు సంవత్సరాల కంటే ముందు నాటికి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల గ్రాడ్యుయేట్లంతా మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 2021 ఎన్నికల్లో ఓటు వేసిన ఓటర్లు కూడా ఇప్పుడు కొత్తగా దరఖాస్తు చేసుకోవాలని ఆఫీసర్లు సూచించారు. అప్పటి ఎన్నికల తర్వాత చనిపోయిన వారు, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారిని తప్పించినా కొత్తగా డిగ్రీ పూర్తి చేసుకున్న వారు దరఖాస్తు చేసుకుంటే ఓటర్ల సంఖ్య పెరగాల్సి ఉంది.
నాడు స్పెషల్ ఇంట్రెస్ట్..
ఎన్నికలు జరగనున్న మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో ప్రస్తుతం 12 జిల్లాలున్నాయి. వీటిలో అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 83,606 మంది ఓటర్లు ఉండగా, అతి తక్కువగా సిద్దిపేట జిల్లాలో 4,671 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లున్నారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్సీగా పోటీలో నిలిచారు. ఆయనకు చెందిన అనురాగ్ విద్యాసంస్థల సిబ్బందితో పాటు, ప్రైవేట్ విద్యాసంస్థలతో ఆయనకున్న పరిచయాలను ఉపయోగించుకొని ఓటర్ల నమోదులోనే స్పెషల్ ఇంట్రస్ట్ చూపిం చారు. కాలేజీల్లో డిగ్రీ పూర్తి చేసుకున్న వారిని గుర్తించి ఓటు నమోదు చేయించారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పల్లా రాజేశ్వర్ రెడ్డి జనగామ ఎమ్మెల్యేగా గెలవడంతో ఎమ్మెల్సీకి రాజీనామా చేశారు. ఉప ఎన్నిక వచ్చినప్పటికీ రాజకీయ పార్టీలు ఎంపీ ఎన్నికల్లో బిజీగా ఉండగా, చివరి నిమిషం వరకు ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేయకపోవడంతో ఓటర్ల నమోదుపై ఆసక్తి చూపలేదు. ఈలోగా ఎంపీ ఎన్నికలు ముగిసి, ఎమ్మెల్సీ ఎలక్షన్ల గడువు దగ్గరపడడంతో ప్రచారంపైనే నజర్ పెట్టారు.