కమలనా.. ట్రంపా: ఇద్దరి వైపు చెరి సగం మొగ్గుతున్న ఓటర్లు..

కమలనా.. ట్రంపా: ఇద్దరి వైపు చెరి సగం మొగ్గుతున్న ఓటర్లు..
  • యూఎస్ ఎకానమీని ఎవరు బాగా హ్యాండిల్ చేయగలరు?

వాషింగ్టన్:  అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడుతున్న రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్​లలో ఎవరు ఎకానమీని బాగా హ్యాండిల్ చేయగలరన్న విషయంలో ఓటర్లు ఒక పట్టాన తేల్చుకోలేకపోతున్నారని అసోసియేటెడ్ ప్రెస్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ప్రెసిడెంట్ ఎన్నికల్లో ఎకానమీ అభివృద్ధి అన్నదే కీలకమైన విషయమని అక్కడి ఓటర్లు భావిస్తున్నారు. అయితే, ఎకానమీని పరుగులు పెట్టించడంలో ఎవరు బెస్ట్? అంటే మాత్రం ఇద్దరి వైపు దాదాపుగా చెరి సగం ఓటర్లు మొగ్గుతున్నారని ఈ సర్వే తేల్చింది.

ఎన్నికల రేసు నుంచి బైడెన్ తప్పుకునేదాకా ఎకానమీ విషయంలో ట్రంప్ ఆధిక్యంలో ఉన్నారని, కానీ ఆ తర్వాత పరిస్థితి మారిపోయిందని అసోసియేటెడ్ ప్రెస్ వెల్లడించింది. గత జూన్​లో ఇదే సంస్థ నిర్వహించిన సర్వేలో బైడెన్ కన్నా ట్రంపే ఎకానమీని బాగా హ్యాండిల్ చేయగలరని జనం అభిప్రాయపడ్డారు. తాజా సర్వేలో ప్రతి 10 మందిలో ట్రంప్ వైపు నలుగురు, కమల వైపు నలుగురు మొగ్గారని వెల్లడైంది. వీరిద్దరూ ఎకానమీని హ్యాండిల్ చేయలేరని ప్రతి పది మందిలో ఒకరు అభిప్రాయపడినట్టు తేలింది.

ఎకానమీకే ఓటర్ల ప్రాధాన్యం.. 

అమెరికన్ ఓటర్లలో అత్యధిక మంది పరిగణనలోకి తీసుకునే అంశాల్లో ఎకానమీ గ్రోత్ మొదటి స్థానంలో ఉంటుందని అసోసియేటెడ్ ప్రెస్ పేర్కొంది. సగానికిపైగా ఓటర్లు హెల్త్ కేర్​కు, దాదాపు సగం మంది నేరాల నియంత్రణ, వలసల నివారణ, అబార్షన్, గన్ పాలసీలకు ప్రాధాన్యం ఇస్తారని తెలిపింది. వీటితోపాటు ఇజ్రాయెల్, హమాస్ యుద్ధం కూడా ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం ఉన్నట్టు పేర్కొంది.