
మెదక్ టౌన్, వెలుగు: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో యువ ఓటర్లు ఉత్సాహంగా ఓటింగ్‌లో పాల్గొనాలని, వంద శాతం పోలింగ్ జరిగేలా చూడాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజర్షి షా పిలుపునిచ్చారు. గురువారం కలెక్టరేట్లో యువ ఓటర్లను ఆకర్షించడానికి సెల్ఫీ పాయింట్లను, ఎన్నికల సాధారణ పరిశీలకుడు పృథ్వీరాజ్, వ్యయ పరిశీలకుడు సంజయ్ కుమార్, పోలీస్ పరిశీలకుడు సంతోష్ కుమార్ తుకారాం, ఎస్పీ రోహిణి ప్రియదర్శినిలతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, డీఆర్వో పద్మశ్రీ, డీడబ్ల్యువో బ్రహ్మాజీ, డీఎస్వో రాజిరెడ్డి, విజయలక్ష్మి, కరుణ, ఏవో యూనస్, డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్, విద్యార్థులు పాల్గొన్నారు.
ఓటరు స్లిప్పులు, ఓటరు గైడ్, సీ-విజిల్ పాంప్లెట్స్ అందించాలి
జిల్లాలో ఓటరు స్లిప్పులతో పాటు ఓటరు గైడ్, సీ-విజిల్ పాంప్లేట్స్ అందించాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. పట్టణంలోని దాయర వీధిలో ఓటర్ సమాచార స్లిప్‌ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల రోజుకు మరో 13 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయని, బీఎల్వోలు, బీఎల్వో సూపర్వైజర్లు ప్రతి ఇంటికీ వెళ్లి ఓటర్ స్లిప్పులు, ఇతర పాంప్లేట్స్పంపిణీ చేయాలని సూచించారు. ఓటర్లు అందుబాటులో లేనట్లయితే వారి కుటుంబసభ్యులకు అందించాలన్నారు. ప్రతి ఓటరుకు సీ- విజిల్ యాప్ , టోల్ ఫ్రీ నెంబర్ 1950 పై అవగాహన కల్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, బీఎల్వో మాధవి, సిబ్బంది పాల్గొన్నారు.
ఓటర్లను చైతన్య పరచాలి
సంగారెడ్డి టౌన్: జిల్లాలో ఓటు ఉన్న ప్రతి ఒక్కరూ కచ్చితంగా వినియోగించుకునేలా ఓటర్లను చైతన్య పరచాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శరత్ అధికారులకు సూచించారు. గురువారం ఆయన టెలి కాన్ఫరెన్స్ ద్వారా అధికారులు చేపట్టాల్సిన కార్యక్రమాలపై దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఓటరు అవేర్ నెస్ ఫోరమ్స్ ద్వారా ప్రతి ఒక్క ఓటు వేసేలా అవగాహన కల్పించి చైతన్య పరచాలని సూచించారు. కాలనీల్లో, మున్సిపాలిటీల్లో, పరిశ్రమల్లో, ఓటరు అవేర్ నెస్ ఫోరమ్స్ ఏర్పాటు చేయాలన్నారు.
ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలన్నారు. ఓటరు స్లిప్పులు, పోలింగ్ కేంద్రం, ఓటు వేయడానికి గుర్తింపు కార్డులు, ఓటు ప్రాధాన్యం, పోలింగ్ తేదీ తదితర విషయాల గురించి తెలియజేయాలన్నారు. ఈ టెలి కాన్ఫరెన్స్ లో అడిషనల్కలెక్టర్ చంద్రశేఖర్, మాధురి, స్వీప్ నోడల్ అధికారి అఖిలేశ్‌రెడ్డి, సెక్టోరల్ అధికారులు, సీఎస్ఆర్ క్లస్టర్ ఆఫీసర్లు పాల్గొన్నారు.