- 40 ఏండ్లలోపు 9,29,325 మంది ఓటర్లు
- గెలుపోటములు నిర్ణయించేదీ వాళ్లే
- యువతను ఆకట్టుకోవడానికి అభ్యర్థుల హామీలు
యాదాద్రి, వెలుగు : లోక్‌సభ ఎన్నికల్లో యువత ఓట్లే కీలకం కానున్నాయి. ఓటర్లలో సగానికి పైగా వారే ఉండడంతో గెలుపోటములను నిర్ణయించనున్నారు. వారు ఏ పార్టీ వైపు మొగ్గు చూపితే ఆ పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశాలు కన్పిస్తున్నాయి. అభ్యర్థులు కూడా యువతను తమ వైపు ఆకట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ హామీలు ఇస్తున్నారు.
సగానికిపైగా యువ ఓటర్లే..
భువనగిరి లోక్‌సభ పరిధిలో ఇబ్రహీంపట్నం, మునుగోడు, నకిరేకల్, భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి, జనగామ శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. ఎన్నికల కమిషన్ విడుదల చేసిన తుది ఓటరు జాబితా ప్రకారం భువనగిరి లోక్‌సభ నియోజవర్గంలో 18,08,585 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుష ఓటర్లు 8,98,416 మంది ఉండగా, మహిళా ఓటర్లు 9,10,090 మంది ఉన్నారు. 79 మంది థర్డ్ జెండర్ఓటర్లున్నారు. లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో 18 నుంచి 40 ఏండ్లలోపు ఓటర్లు 9,29,325 మంది ఉన్నారు. 40 నుంచి49 ఏండ్లలోపు ఓటర్లు 3,52,333 మంది ఉన్నారు. వీరే రాజకీయ నేతల తలరాతను రాయనున్నారు. దీంతో పోటీలో ఉన్న అభ్యర్థులు యువతను ప్రసన్నం చేసుకోవడంపై దృష్టి సారించారు.
ఉద్యోగ, ఉపాధి సమస్య..
నియోజకవర్గ పరిధిలోని యువతను ఉపాధి, ఉద్యోగాల సమస్య తీవ్రంగా వేధిస్తోంది. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఈ సమస్య అంత కన్పించకున్నా మిగిలిన నియోజకవర్గాల్లో పరిస్థితి తీవ్రంగా ఉంది. ఈ నియోజకవర్గాల పరిధిలో ఉపాధి కల్పించేందుకు స్థానికంగా పెద్దగా అవకాశాలు లేవు. దీంతో ఉపాధి కోసం 40 ఏండ్లలోపున్న యువత హైదరాబాద్‌కే పయనమవుతోంది. అక్కడ షాపులు, చిన్న కంపెనీల్లో తక్కువ వేతనాలకు పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
అభ్యర్థుల హామీలు..
భువనగిరిలో పోటీ చేస్తున్న కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్అభ్యర్థులు చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, బూర నర్సయ్య గౌడ్, క్యామ మల్లేశ్ కూడా ఇక్కడి యువతను ఆకట్టుకోవడానికి హామీలు ఇస్తున్నారు. ఐటీ హబ్ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు. ఇండస్ట్రీయల్కారిడార్ఏర్పాటు చేయిస్తున్నామని హామీలు ఇస్తున్నారు. దీంతో ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభిస్తాయని అంటున్నారు. పరోక్షంగా అనేకమందికి ఉపాధి లభిస్తుందని చెబుతున్నారు. ఇక కాంగ్రెస్ ఇటీవలే 30 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చిన సంగతిని గుర్తు చేస్తోంది. జాబ్ క్యాలెండర్, ఉద్యోగాల కల్పన వంటి అంశాలను ప్రస్తావిస్తోంది.
నిర్ణయాత్మక శక్తి యువతే..
గెలుపోటములను నిర్ణయించేది యువ ఓటర్లే అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. గత ఎన్నికల కంటే ఈసారి ఓటర్లలో చైతన్యం రావడం, ఓటర్ల నమోదుపై విస్తృతంగా ప్రచారం జరిగింది. దీంతో కొత్తగా ఓటు హక్కు పొందిన వారి సంఖ్య 60 వేలు దాటింది. స్వీప్ కార్యక్రమాల ద్వారా ఓటర్లకు అవగాహన కల్పించడంతో ఈసారి ఓటింగ్‌లో యువత ఎక్కువగా పాల్గొనే అవకాశాలున్నాయి. గతంతో పోలిస్తే ఈసారి ఎన్నికల్లో పోలింగ్‌శాతం పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ పరిస్థితులన్నింటినీ బేరీజు వేసుకుంటే ఎన్నికల్లో యువ ఓటర్లు ఎవరికి ఓటు వేస్తారో అనే విషయం ఆసక్తికరంగా మారింది.