నవంబర్ 13న జార్ఖండ్ ఫస్ట్ ఫేజ్

నవంబర్ 13న జార్ఖండ్ ఫస్ట్ ఫేజ్

రాంచీ:  జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫస్ట్ ఫేజ్​కు ఎన్నికల సంఘం(ఈసీ) అన్ని ఏర్పాట్లు చేసింది. మొత్తం 81 స్థానాల్లో 43 సీట్లకు బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈ స్థానాల పరిధిలోని 1.37 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 43 సీట్లలో.. 17 జనరల్ సీట్లు, 20 ఎస్టీలకు, ఆరు ఎస్సీలకు రిజర్వు చేయబడ్డాయి. ఈ సీట్లలో మొత్తం 683 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినప్పటి నుంచి రూ.179.14 కోట్ల విలువైన అక్రమ సామగ్రి, నగదును స్వాధీనం చేసుకున్నట్లు మంగళవారం ప్రధాన ఎన్నికల అధికారి కె.రవికుమార్ తెలిపారు.

వయనాడ్​లో పోలింగ్ ఇయ్యాల్నే..

వయనాడ్ లోక్​సభ నియోజకవర్గానికి బుధవారం ఉప ఎన్నిక జరగనుంది. కాంగ్రెస్ తరఫున ప్రియాంక గాంధీ ఇక్కడ బరిలోకి దిగారు. దాదాపు నెల రోజుల పాటు ప్రియాంక ప్రచారం చేశారు. వయనాడ్ ఎంపీగా తన సోదరుడు అక్కడి ప్రజలతో మమేకమైన తీరును హైలెట్ చేశారు. రాహుల్ కూడా అక్కడ నిర్వహించిన సభలు, ర్యాలీల్లో ఆమెతో కలిసి పాల్గొన్నారు. తనను ఆదరించినట్లే తన సోదరికి మద్దతు పలకాలని ప్రజలను కోరారు. వయనాడ్ నియోజకవర్గంలోని 14 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం 16 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.