మొదలైన ఢిల్లీ ఎన్నికల పోలింగ్.. 70 స్థానాలకు 699 మంది అభ్యర్థులు పోటీ

మొదలైన ఢిల్లీ ఎన్నికల పోలింగ్.. 70 స్థానాలకు 699 మంది అభ్యర్థులు పోటీ

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ మొదలైంది. రాష్ట్రంలో మొత్తం 1.56 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. 13,766 పోలింగ్ స్టేషన్లను ఎలక్షన్ అధికారులు ఏర్పాటు చేశారు. 220 కంపెనీల పారామిలటరీ బలగాలు, 35వేల మంది ఢిల్లీ పోలీసులు, 19వేల మంది హోంగార్డులు ఎన్నికల విధుల్లో ఉన్నారు. 3వేల పోలింగ్ స్టేషన్లను సెన్సిటివ్గా గుర్తించారు. 

ఈ ప్రాంతాల్లో డ్రోన్ల సహాయంతో ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించనున్నారు. సీనియర్ సిటిజన్లు, దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా 733 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఇప్పటికే 6,980 మంది హోం ఓటింగ్ ద్వారా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 70 స్థానాలకు 699 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

ఆప్ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్ గెలుపుపై ధీమాతో ఉన్నారు. కేజ్రీవాల్, సీఎం ఆతిశి ఢిల్లీ వ్యాప్తంగా ప్రచారం చేశారు. ఇక బీజేపీ తరఫున ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, పార్టీ ప్రెసిడెంట్ జేపీ నడ్డా, పలువురు కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలు క్యాంపెయిన్లో పాల్గొన్నారు. 

ఆప్ అవినీతి, ఢిల్లీలో లా అండ్ ఆర్డర్ సమస్యలపై విమర్శలు గుప్పించారు. ఇక కాంగ్రెస్ తరఫున రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ప్రచారం చేశారు. ‘శీష్​ మహల్’, యమునా నది కాలుష్యం, ఓటర్ ట్యాంపరింగ్, ఏఐ జనరేటెడ్ ఫొటోలు వంటి అంశాలపై ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకున్నారు.

మాకు సౌలతులు కల్పించండి.. ఢిల్లీ పోలీసులకు సీఆర్పీఎఫ్ లేఖ
దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బందోబస్తు విధులు నిర్వహిస్తున్న సీఆర్పీఎఫ్​ బలగాలు తమకు సరైన సౌలతులు కల్పించకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సీఆర్పీఎఫ్​ ఐజీ జ్ఞానేంద్ర కుమార్ వర్మ ఢిల్లీ స్పెషల్ సీపీ దేవేశ్ చంద్ర శ్రీవాస్తవకు లేఖ రాశారు. మొబైల్ టాయిలెట్లు నిండిపోయాయని, గదులు అధ్వాన్నంగా ఉన్నయని, తాగునీరు, విద్యుత్తు సదుపాయాలు లేవని తెలిపారు. 

తాము విధులు నిర్వహిస్తున్న చాలా ప్రాంతాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పారు. సమర్థవంతంగా డ్యూటీలను నిర్వర్తించడానికి వీలుగా తమ బలగాలకు ప్రాథమిక అవసరాలను కల్పించాలని పేర్కొన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను నిష్పక్షపాతంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు కేంద్ర హోం శాఖ 220 కంపెనీల సీఆర్పీఎఫ్ బలగాలను మోహరించింది.