గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో గతం కంటే ఎక్కువగా పోలింగ్ జరిగిందని రాష్ట్ర ఎన్నికల సంఘం చెబుతోంది. కానీ, పోలింగ్ రోజు చివరి గంటలో భారీగా ఓటింగ్ జరగడం రిగ్గింగ్ జరిగిందనే అనుమానాలకు తావిస్తోంది. ఎలక్షన్ కమిషన్ ఎన్ని చెబుతున్నా ఓటింగ్ తగ్గిందా? పెరిగిందా? అనే ప్రశ్న మాత్రం అందరికీ వస్తోంది. అయితే మొత్తం మీద పోలింగ్ శాతం తగ్గిందని రాజకీయ పార్టీలే కాదు ప్రజాస్వామ్యవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సగం మందికిపైగా ప్రజలు ఓటు వేయడానికి ఆసక్తి చూపకపోవడం తీవ్రమైన అంశంగానే పరిగణించాల్సి ఉంటుందని వారు చెబుతున్నారు.
దుబ్బాక ఉప ఎన్నికలో ఓటమితో షాక్ తిన్న టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి మరోసారి గెలుపొందే అవకాశం ఇవ్వకూడదని వ్యూహాత్మకంగా పావులు కదిపారు. ఇందులో భాగంగా ఓటర్లను భయపెట్టేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నం చేశారు. ఆరేండ్లుగా టీఆర్ఎస్ పాలనతో విసుగు చెందిన ప్రజలు కూడా ఓటింగ్‌పట్ల ఆసక్తి చూపలేదు. ఎన్నికల రోజు సాయంత్రం 5 గంటల వరకు చాలా తక్కువగా పోలింగ్ జరగడం, చివరి గంటలో భారీగా ఓట్లు పడటం గమనిస్తే ఆ టైమ్‌లో వీలైన చోటల్లా రిగ్గింగ్‌కు పాల్పడినట్లు వెల్లడవుతోంది. సాయంత్రం 5 గంటల వరకు 36.73 శాతం ఓట్లు పోల్ అయినట్లు ప్రకటించిన ఎన్నికల కమిషన్ రాత్రి పొద్దుపోయిన తర్వాత మొత్తంగా 46 శాతం ఓటింగ్ జరిగినట్టు ప్రకటించడం విస్మయం కలిగిస్తోంది. ఇప్పటి వరకు జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఇదే అత్యధిక పోలింగ్.
ప్రజలను భయపెట్టే ప్రయత్నాలు
దేశంలో ఎక్కడా లేని విధంగా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన రోజునే, ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం ద్వారా బీజేపీకి సిద్ధమయ్యే టైమ్ లేకుండా చేయడానికి పథకం ప్రకారం వ్యవహరించినట్లు స్పష్టమవుతోంది. ముందుగానే అభ్యర్థుల జాబితాను సిద్ధం చేసుకున్న అధికార పార్టీ, ప్రతిపక్షాలు అన్ని సీట్లలో అభ్యర్థులను నిలబెట్టే వ్యవధి కూడా లేకుండా చేసేందుకు ప్రయత్నించింది. వరుస సెలవులు రావడంతో ఉద్యోగులు, చదువుకున్నవారు, ముఖ్యంగా బీజేపీకి ఓటు వేసే మిడిల్‌క్లాస్ జనం సిటీ విడిచి వెళ్లేలా చేశారు. స్వయంగా సీఎం కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్ ఎన్నికల సందర్భంగా అల్లర్లు సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రకటనలు చేయడం ద్వారా ప్రజలను భయపెట్టే ప్రయత్నం చేశారు. ఇటువంటి పుకార్లు నమ్మవద్దని, ఎవరైనా అల్లర్లకు ప్రయత్నిస్తే అణచివేస్తామని భరోసా ఇవ్వవలసిన పోలీసులు కూడా అల్లర్లకు కుట్రలు జరుగుతున్నట్లు ప్రకటనలు చేయడం ప్రజలను భయపెట్టేందుకే అని భావించవలసి ఉంటుంది. ఎక్కువ మంది ఓటు వేసేలా ప్రోత్సహించవలసిన ప్రభుత్వం, ఎన్నికల కమిషన్, పోలీసులు ప్రజలను భయపెట్టే ప్రయత్నాలకు దిగడంతో పోలింగ్ శాతంపై ప్రభావం పడినట్లు కనబడుతోంది.
రూలింగ్ పార్టీ, ఈసీలదే బాధ్యత
జనం ఎక్కువగా ఓటు వేయకపోవడానికి రూలింగ్ పార్టీ, ఈసీ బాధ్యత వహించాలి. ప్రజలను చైతన్యవంతులను చేయడంలో ప్రతిపక్షాలూ బాధ్యత వహించాలి. మాయమాటలతో మభ్యపెట్టే ప్రయత్నాలు ఓటర్లకు విసుగు కలిగిస్తోంది. ప్రజాస్వామ్యంలో ఓటు అన్నది అత్యంత విలువైనది. దానిని తప్పనిసరి చేసే ముందు రాజ్యాంగబద్ధ సంస్థలు, పార్టీలు, ప్రభుత్వ వ్యవస్థలు ప్రజాస్వామ్యబద్ధంగా ఏ మేరకు తమ బాధ్యతలను నెరవేరుస్తున్నాయో ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇవాళ చాలా పార్టీల్లో అంతర్గత ప్రజాస్వామ్యం లేదు. చాలా వరకూ కుటుంబ పార్టీలుగానే మనుగడ సాగిస్తున్నాయి. పార్టీల్లో సంస్కరణలు తీసుకు రాకుండా ప్రజలను ఓటు వేయడం లేదని నిందించడం తగదు.
ఒక గంటలో 10 శాతం ఓటింగ్ ఎలా సాధ్యం?
పోలింగ్ సరళిని గమనించిన వారికి ఒక గంటలో 10 శాతం ఓటింగ్ జరగడం దాదాపు అసంభవమని స్పష్టంగా అర్థమవుతోంది. ముఖ్యంగా ఎంఐఎంకు పట్టున్న పాతబస్తీలో 3 గంటల వరకు చెప్పుకోదగిన పోలింగ్ జరగలేదు. చాలా డివిజన్లలో 20 శాతం లోపే ఓటింగ్ నమోదైంది. ఆ తర్వాత మహిళలు పెద్ద సంఖ్యలో పోలింగ్ బూత్ ల వద్దకు వచ్చారని, వారందరిని ఎంఐఎం వారే పంపి, రిగ్గింగ్ చేయించి ఉండవచ్చని భావిస్తున్నారు. వాస్తవానికి పాతబస్తీలో పోలింగ్ 15 నుంచి 20 శాతానికి మించలేదు. అంతకన్నా వచ్చిన పోలింగ్ అంతా రిగ్గింగ్ గా పరిగణించాలని సీనియర్ లాయర్ ఒకామె చెప్పారు. గత ఎన్నికల్లో కూడా పాతబస్తీలో ఇలాగే జరిగిందని ఆమె గుర్తు చేశారు.
కార్పొరేటర్లపై తీవ్ర వ్యతిరేకత
సీఎం కేసీఆర్ ఏలుబడిలో జీహెచ్‌ఎంసీ తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యింది. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక తోడ్పాటు కల్పించకపోవడం, సొంత వనరులు కుంచించుకుపోవడంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. అందుకే తమ కార్పొరేటర్లు ఎవరో చాలా డివిజన్లలో ప్రజలకు తెలియ లేదు. మేయర్ గా పనిచేసిన బొంతు రామ్మోహన్ ఈసారి తన భార్యను నిలబెట్టినా.. వారిని తామెప్పుడూ చూడలేదంటూ ఆయన ప్రాతినిధ్యం వహించిన డివిజన్ లోనే నిరసనలు ఎదురయ్యాయి. కార్పొరేటర్లపై వ్యతిరేకతను గమనించిన టీఆర్ఎస్ 27 మందిని మార్చినా మిగిలిన వారు కూడా ప్రజల మెప్పు పొందలేక పోయారు.
లక్షలాది ఓట్లు గల్లంతు
2018 అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్లో 53 శాతం మంది ఓటు వేయగా, ఇప్పుడు తక్కువగా ఓటింగ్ ఎందుకు నమోదైంది? విద్యావంతులు ఓటింగ్ లో పాల్గొనకపోవడం పట్ల చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేయడం సోషల్ మీడియాలో కనిపించింది. ఓటింగ్ ను నిర్బంధం చేయాలని, ఓటు వేయని వారికి ప్రభుత్వ పథకాలు అందించవద్దంటూ సూచనలు వచ్చాయి. మరోవైపు ఓటర్ల జాబితాల్లో లక్షలాది మంది పేర్లు పోలింగ్ బూత్ ల వద్ద కనిపించక వెనుదిరిగారు. దేశమంతా ఎన్నికల్లో ఈవీఎంలను వాడుతుంటే.. జీహెచ్ఎంసీలో బ్యాలెట్ బాక్స్ లను వాడటం ప్రజాభిప్రాయాన్ని కట్టడి చేసే చర్యల్లో భాగమే.
డా. టి.ఇంద్రసేనారెడ్డి, సోషల్ యాక్టివిస్ట్