కూరాకుల అవిశ్వాసంపై ఓటింగ్ పూర్తి

  •     హైకోర్టు ఆదేశాలతో నిలిచిన ఫలితం 

ఖమ్మం టౌన్, వెలుగు :  రఘునాథపాలెం మండలం వేపకుంట్ల వెంకటయపాలెం ప్రాథమిక వ్యవసాయ కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడు కూరకుల నాగభూషణంపై డీసీఓ విజయకుమారి అధ్యక్షతన నిర్వహించిన ఓటింగ్ శనివారం పూర్తయ్యింది. ఈ ఓటింగ్ కు సొసైటీ అధ్యక్షుడు, ఒక డైరెక్టర్ గైర్హాజరు కాగా,  మిగతా 11 మంది ఓటింగ్ లో పాల్గొన్నారు. సొసైటీ అధ్యక్షుడు కూరకుల నాగభూషణం సొసైటీలో అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ.. అతడిని అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని 15 రోజుల కింద 11 మంది డైరెక్టర్లు డీసీఓకు కంప్లైంట్ చేశారు.

ఈ నేపథ్యంలో డీసీఓ అధ్యక్షుడితో పాటుగా 12 మంది డైరెక్టర్లకు నోటీసులు పంపించారు. శనివారం నోటీసులు అందుకున్న డైరెక్టర్లకు ఓటింగ్ జరిపేందుకు డీసీఓ సమావేశం ఏర్పాటు చేశారు. కానీ ఓటింగ్​ వివరాలను ప్రకటించడం లేదు. హైకోర్టు ఆదేశానుసారం వాయిదా వేస్తున్నట్లు డీసీఓ తెలిపారు.

తిరిగి ఈనెల 31న సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు. వైస్ చైర్మన్ రావెళ్ల శ్రీనివాసరావు మాట్లాడారు. సొసైటీ లోన్ల ఎంపికలో అధ్యక్షుడు ఇష్టారాజ్యంగా వ్యవహరించారన్నారు. ధాన్యం కొనుగోలులో క్వింటాకు 10 కిలోల తరుగు తీయడం, గోనెసంచుల విషయంలో అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించారు.