డీసీసీబీ చైర్మన్​పై అవిశ్వాసానికి అంతా రెడీ

  • నేడే అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్​
  • క్యాంపు నుంచి హైదరాబాద్​ చేరుకున్న డైరెక్టర్లు
  • అమెరికా నుంచి వచ్చిన వైస్​చైర్మన్​ ఏసిరెడ్డి
  • 15 మందికి చేరిన 'కుంభం' బలం
  • ఇద్దరు తోడైతే అవిశ్వాసం వీడిపోతుందని చైర్మన్​ ధీమా 

నల్గొండ, వెలుగు : డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్​రెడ్డిపై పెట్టిన​అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్​ కొద్దిగంటల్లో జరగనుంది. శుక్రవారం ఉదయం 11 గంటలకు డీసీసీబీ ఆఫీసులో ఓటింగ్ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. 18 రోజుల నుంచి క్యాంపులో ఉన్న 14 మంది డైరెక్టర్లు గురువారం ఉదయం గోవా నుంచి హైదరాబాద్​చేరుకున్నారు. అమెరికా పర్యటనలో ఉన్న వైస్​చైర్మన్​ఏసిరెడ్డి దయాకర్​రెడ్డి సైతం హైదరాబాద్​కు చేరుకున్నారు. వీరంతా శుక్రవారం ఉదయం క్యాంపు నుంచి నేరుగా డీసీసీబీ కార్యాలయానికి చేరుకుంటారు. 

ఏసిరెడ్డి రాకతో చైర్మన్​కు వ్యతిరేకంగా అవిశ్వాసం తీర్మానం పెట్టిన డైరెక్టర్ల సంఖ్య 15కు చేరింది. మొత్తం 19 మంది డైరెక్టర్లలో 14 మంది సంతకాలు చేయగా, వైస్​చైర్మన్​అమెరికాలో ఉన్నందున కుదరలేదు. అవిశ్వాసంపై ఓటింగ్​నెగ్గేందుకు కో–ఆపరేటివ్​రూల్స్ ప్రకారం మొత్తం డైరెక్టర్లలో 2/3 వంతు మంది ఉండాలి. ఈ లెక్కన 14 మంది డైరెక్టర్లు ఉంటే సరిపోతుంది. 

కానీ 15 మంది వన్​సైడ్​అయ్యారు. చైర్మన్​పక్షాన ముగ్గురు డైరెక్టర్లు మాత్రమే మిగిలారు. మరో ఇద్దరు డైరెక్టర్లు చైర్మన్​శిబిరంలో చేరితే అవిశ్వాసం వీగిపోతుంది. అవిశ్వాసం ఓటింగ్​జరిగే సమయానికి కచ్చితంగా ఇద్దరు డైరెక్టర్లు తనవైపు వస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. నాలుగేళ్ల పాలనలో ఏ ఒక్కరికీ అన్యాయం చేయలేదని, చివరకు చైర్మన్ రేసులో ఉన్న కుంభం శ్రీనివాస్​రెడ్డి సైతం తనతో సన్నిహితంగా మెలిగారని చైర్మన్ చెబుతున్నారు. రూ.900 కోట్ల నుంచి రూ.2,400 కోట్లకు డీసీసీబీ లావాదేవీలు పెరిగాయని, ఇందులో డైరెక్టర్ల సహకారం కూడా ఉందన్నారు. జాతీయ స్థాయిలో అవార్డు కూడా దక్కిందని చైర్మన్​మహేందర్ రెడ్డి గురువారం మీడియాకు తెలిపారు. 

18 రోజులపాటు ఎడతెగని సస్పెన్స్..

క్యాంపు రాజకీయాలు మొదలు పెట్టగానే మహేందర్​రెడ్డి తనకు తానుగానే చైర్మన్​పదవికి రాజీనామా చేస్తారని ప్రత్యర్థి శిబిరం భావించింది. కానీ, ఏమాత్రం ఆయన వెనక్కి తగ్గలేదు. నిజానికి తనపైనే అవిశ్వాసం పెడ్తారని ముందుగానే తెలిసినప్పటికీ మహేందర్​రెడ్డి డైరెక్టర్లను కాపాడుకోలేకపోయారు. టెస్కాబ్ వైస్​చైర్మన్​పదవికి రాజీనామా చేసినట్టుగానే డీసీసీబీకి కూడా రిజైన్​చేస్తారని అనుకున్నారు. 

కానీ రెండు వర్గాలు 18 రోజులపాటు ఎడతెగని సస్పెన్స్​కొనసాగించారు. ఎవరికి వారే ఎత్తుకు పైఎత్తులు వేశారు. చివరకు చైర్మన్​ప్రధాన అనుచరుడు రాంచందర్​సైతం ప్రత్యర్థి శిబిరంలో చేరడం షాక్​కు గురిచేసింది. 40 ఏండ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన మహేందర్​రెడ్డి చివరి నిమిషం వరకు వెనక్కి తగ్గకపోగా, చైర్మన్​రేసులో ఉన్న కుంభం శ్రీనివాస్ రెడ్డి సైతం పంతం వీడడం లేదు.