ఖమ్మం టౌన్/కల్లూరు,వెలుగు : ఎన్నికల నిబంధనలపై ఆఫీసర్లు పూర్తి అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ లో ఏఎల్ఎంటీ, ఏఆర్ఓ లకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. చెక్‌పోస్ట్ ల వద్ద విస్తృత తనిఖీలు నిర్వహించి నగదు, మద్యం రవాణాను నియంత్రించాలన్నారు. అలాగే సీపీ విష్ణు వారియర్‌తో కలిసి కల్లూరు మండలంలోని తిరువూరు క్రాస్ రోడ్ చెక్ పోస్ట్, పేరువంచ చెక్‌పోస్ట్, ముత్తగూడెం గ్రామం వీఎం బంజర వద్ద ఏర్పాటు చేసిన ఇంటర్ స్టేట్ చెక్‌పోస్టులను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఎన్ని వాహనాలు తనిఖీ చేసింది తెలుసుకున్నారు. ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలని సూచించారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. వాహనాల తనిఖీ రిజిస్టర్‌ను నిర్వహించాలన్నారు. ప్రతి చెక్ పోస్ట్ లో వీడియోగ్రఫీకి చర్యలు తీసుకోవాలన్నారు. 24 గంటల నిఘా పెట్టాలని అన్నారు. వారి వెంట అడిషనల్ డీసీపీ ప్రసాద్, ఏసీపీ రామానుజం , ఆర్డీవో అశోక చక్రవర్తి, ఎన్నికల డీటీ బాబ్జి ప్రసాద్, ఎస్సై రఘు, ఎస్సై స్రవంతి,అధికారులు తదితరులు ఉన్నారు.
గోడౌన్లు పరిశీలించిన కలెక్టర్
ఖమ్మం టౌన్/ వైరా/ సత్తుపల్లి, వెలుగు : రానున్న శాసనసభ ఎన్నికల దృష్ట్యా ఈవీఎం ల భద్రత, రిసెప్షన్ కేంద్ర ఏర్పాటుకు ప్రతిపాదిత భవనాలను కలెక్టర్ గౌతమ్, సీపీ విష్ణు వారియర్ తో కలిసి సోమవారం పరిశీలించారు. వైరా అసెంబ్లీ నియోజకవర్గంలోని వైరా వ్యవసాయ మార్కెట్ కమిటీ గోడౌన్లు, సత్తుపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలోని జ్యోతి నిలయం హైస్కూల్ ను తనిఖీ చేశారు. అక్కడ చేయాల్సిన ఏర్పాట్ల గురించి అధికారులకు సూచనలు చేశారు. ఈవీఎం ల భద్రతకు గదులు, చేపట్టాల్సిన చర్యలు, భోజన ఏర్పాట్లు, వాహనాల పార్కింగ్ ల ఏర్పాటు ను పరిశీలించారు.
బ్యారికేడ్ల ఏర్పాటుపై అధికారులకు సూచనలు చేశారు. ఎన్నికల రోజు ఆ స్కూళ్లకు సెలవులు ఇచ్చేలా చూడాలన్నారు. ఈవీఎం స్ట్రాంగ్ రూమ్, అదనపు ఈవీఎంలను భద్రపర్చడానికి హాల్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. వారి వెంట అదనపు కలెక్టర్ సత్యప్రసాద్, అదనపు డీసీపీ ప్రసాద్ రావు, కల్లూరు ఆర్డీవో అశోక్ చక్రవర్తి, ఏసీపీలు రహమాన్, రామాంజనేయులు, తహసీల్దార్లు శ్రీనివాస్, బాబ్జి ప్రసాద్, మునిసిపల్ కమిషనర్లు వెంకటేశ్వర్లు, సుజాత, ఏఎంసీ ప్రసాద్, అధికారులు తదితరులు ఉన్నారు.