
- రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఎండీ వీపీ గౌతమ్
వనపర్తి/కొత్తకోట/గద్వాల, వెలుగు: గ్రామ సభల ద్వారా ఆమోదం పొందిన లబ్ధిదారుల ఇండ్ల నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించాలని రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఎండీ వీపీ గౌతమ్ ఆదేశించారు. సోమవారం కలెక్టర్ ఆదర్శ్ సురభి, అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్ తో కలిసి కొత్తకోట మండలం రామనాథపురం, వనపర్తి మండలం అప్పాయపల్లి గ్రామాలను సందర్శించి లబ్ధిదారుల ఇండ్లను పరిశీలించారు. అప్పాయిపల్లి గ్రామంలో లబ్ధిదారులు సువర్ణ, వరలక్ష్మి ఇండ్లను సందర్శించి వారి ఆర్థిక స్థితిగతులు అడిగి తెలుసుకున్నారు.
గ్రామాల్లో ఇప్పటికే ప్రభుత్వం నిర్మించిన డబల్ బెడ్రూమ్ ఇండ్లను పరిశీలించారు. సౌలతులు కల్పించాలని స్థానికులు కోరగా, సానుకూలంగా స్పందించారు. అనంతరం వనపర్తి జడ్పీ ఆఫీస్ ఆవరణలో నిర్మాణంలో ఉన్న మోడల్ ఇందిరమ్మ ఇంటిని పరిశీలించారు.
ఐడీఓసీ కాన్ఫరెన్స్ హాల్లో హౌసింగ్ అధికారులు, ఎంపీడీవోలతో సమావేశం నిర్వహించారు. లబ్ధిదారులు ఇంటి నిర్మాణం ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మార్చి 31 లోగా లబ్ధిదారులకు మొదటి విడత చెల్లింపులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు.
ప్రతి దశలో పంచాయతీ కార్యదర్శులు ఫొటోలను పంపించాల్సి ఉంటుందని చెప్పారు. ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి నిర్దేశిత డిజైన్ లేదని, 400 చదరపు గజాలలో వారికి నచ్చిన విధంగా ఇంటి నిర్మాణం చేసుకోవచ్చని తెలిపారు. ఇసుక గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, దగ్గరలోని ఇసుక రీచ్ నుంచి తహసీల్దార్ పర్మిషన్తో ఉచితంగా ఇసుకను పొందవచ్చని చెప్పారు. అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, జడ్పీ సీఈవో యాదయ్య, ఆర్డీవో సుబ్రహ్మణ్యం, హౌసింగ్ అధికారులు విఠోబా, పర్వతాలు, పంచాయతీరాజ్ ఈఈ మల్లయ్య, తహసీల్దార్లు రమేశ్ రెడ్డి, కిషన్ పాల్గొన్నారు.
పేదల సొంతింటి కల సాకారం..
పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని ప్రారంభించిందని రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఎండీ గౌతమ్ తెలిపారు. సోమవారం జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం బట్లదిన్నె గ్రామంలో ఇందిరమ్మ ఫేజ్–1 ఇండ్ల నిర్మాణ పనులను కలెక్టర్ సంతోష్ తో కలిసి పరిశీలించారు.
కొత్త ఇండ్ల నిర్మాణానికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. మండలంలో బట్లదిన్నె గ్రామం మాడల్ విలేజ్‌గా ఎంపికైందని, లబ్ధిదారులు తమ స్థలాల్లో ఇండ్లను నిర్మించుకోవాలని సూచించారు. అడిషనల్ కలెక్టర్ నర్సింగరావు, గృహ నిర్మాణ శాఖ చీఫ్ ఇంజనీర్ చైతన్య, ఎస్ఈ భాస్కర్ రెడ్డి, హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ భాస్కర్, ఎంపీడీవో అజర్ మోహినుద్దీన్, పంచాయతీ సెక్రటరీ నివేశ్ పాల్గొన్నారు.