- ఖమ్మం జిల్లాలో పకడ్బందీగా ఇందిరమ్మ ఇండ్ల సర్వే : ఎండీ వీపీ గౌతమ్
ఖమ్మం టౌన్, వెలుగు : ఇందిరమ్మ ఇండ్ల యాప్ ద్వారా ఖమ్మం జిల్లాలో ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుల సర్వే పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర హౌజింగ్ ఎండీ వీపీ గౌతమ్ అధికారులకు సూచించారు. శుక్రవారం ఖమ్మం రూరల్ మండలం జలగంనగర్, ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలోని మోతినగర్, బొక్కలగడ్డ ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల సర్వేను కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సర్వేపై దరఖాస్తుదారులకు ముందస్తు సమాచారం అందించాలన్నారు.
ప్రజలు కూడా అవసరమైన డాక్యుమెంట్లను సిద్ధం చేసుకొని సర్వేకు సహకరించాలని సూచించారు. రోజూ నిర్దేశించుకున్న లక్ష్యం మేరకు ఎన్యుమరేటర్లు ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తు సర్వే పూర్తి చేయాలని చెప్పారు. సకాలంలో సర్వే పూర్తి చేసేందుకు అవసరమైతే అదనపు లాగిన్లు రూపొందించాలని సూచించారు. ఆయన వెంట డీఆర్డీవో సన్యాసయ్య, హౌజింగ్ పీడీ బి. శ్రీనివాసరావు, ఖమ్మం రూరల్ మండల తహసీల్దార్ రాం ప్రసాద్, ఎంపీడీవో కుమార్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.