స్మార్ట్ సిటీ పనులను స్పీడప్ చేయాలి

 స్మార్ట్ సిటీ పనులను స్పీడప్  చేయాలి
  • ఎల్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ దరఖాస్తుల పరిశీలనను గడువులోగా పూర్తి చేయాలి 
  • కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పర్యటించిన సీడీఎంఏ గౌతమ్ 

కరీంనగర్ టౌన్, వెలుగు: స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చేపట్టిన పనులను స్పీడప్ చేయాలని, బయోమైనింగ్ ను వేగవంతం చేసి డంపింగ్ యార్డును త్వరగా ఖాళీ చేయాలని మున్సిపల్‌‌‌‌‌‌‌‌ అడ్మినిస్ట్రేషన్​ కమిషనర్టి, డైరెక్టర్​(సీడీఎంఏ) వీపీ గౌతమ్ మున్సిపల్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లను ఆదేశించారు. బుధవారం కరీంనగర్ పర్యటనకు వచ్చిన ఆయన.. మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్‌‌‌‌‌‌‌‌పాయ్‌‌‌‌‌‌‌‌తో కలిసి  స్మార్ట్ సిటీ పనులను పరిశీలించారు. మానేరు ఒడ్డున ఉన్న డంపింగ్ యార్డు, బయోమైనింగ్ ను సందర్శించి  పేరుకుపోయిన చెత్తను బయోమైనింగ్ ద్వారా త్వరగా క్లియర్ చేయాలని ఆదేశించారు. మున్సిపాలిటీ కమాండ్ కంట్రోల్  సిస్టమ్‌‌‌‌‌‌‌‌లో కంట్రోలింగ్ లొకేషన్స్ ను పరిశీలించారు. 

ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలన గడువులోగా పూర్తిచేయాలన్నారు.  వెండర్స్ కోసం  ప్రత్యేక గ్రూపులు  ఏర్పాటు చేయాలని, ఈవెంట్ ఆర్గనైజేషన్‌‌‌‌‌‌‌‌తోపాటు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కుట్టు మిషన్లు, తదితర  అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులను ఆదేశించారు. 

డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను సిద్ధం చేయండి

డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో పెండింగ్  పనులను వేగంగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందుబాటులోకి తీసుకురావాలని సీడీఎంఏ గౌతమ్ ఆదేశించారు. బల్దియాలో సమావేశం అనంతరం కలెక్టర్ పమేలా సత్పతితో కలిసి చింతకుంట పరిధిలో  నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఆయన  పరిశీలించారు. ఇళ్ల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.  

ఆ ఇండ్లలో ఉండేందుకు అవసరమైన నీటి వసతి, డ్రైనేజీ, ఆట స్థలం.. వంటి మౌలిక వసతులు కల్పించాలన్నారు. ఆయన వెంట అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్,  ట్రైనీ కలెక్టర్ అజయ్ యాదవ్, కార్పొరేటర్లు,  కోఆప్షన్ మెంబర్లు,అధికారులు, తదితరులు  ఉన్నారు. కాగా సిటీలోని వివిధ సమస్యలపై సీడీఎంఏకు పలువురు వినతిపత్రాలు సమర్పించారు.

ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల పేరిట రూ.5కోట్ల మేర అవినీతి  జరిగిందని,  విచారణ చేసి బాధ్యులను శిక్షించాలని బీఆర్ఎస్ సిటీ ప్రెసిడెంట్ చల్ల హరిశంకర్ వీపీ గౌతమ్ కు వినతిపత్రం ఇచ్చారు. కిసాన్ నగర్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌‌‌‌‌‌‌‌లో రూ.80లక్షల మేర, పలు  జంక్షన్లల్లో పెద్దమొత్తంలో అవినీతి జరిగిందని, విచారణ చేసి బాధ్యులను శిక్షించాలని  44వ డివిజన్  కార్పొరేటర్  మెండి  శ్రీలత కోరారు.  

కరీంనగర్ అభివృద్ధి కోసం నిధులు  మంజూరు చేయాలని బీఆర్ఎస్ కార్పొరేటర్లు విన్నవించారు. ఉద్యోగులతోపాటు అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల మనోభావాలను దెబ్బతినేలా డిప్యూటీ కమిషనర్ స్వరూపరాణి వ్యవహరిస్తున్నారని ఆమెపై చర్యలు తీసుకోవాలని మున్సిపల్ ఉద్యోగుల  జేఏసీ ఆధ్వర్యంలో వినతిపత్రం ఇచ్చారు.