కోడ్​ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : పీవీ గౌతమ్

ఖమ్మం టౌన్, వెలుగు :  ఎన్నికల  కోడ్​ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఖమ్మం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వీపీ గౌతమ్ హెచ్చరించారు. శుక్రవారం అర్ధరాత్రి తర్వాత నగరంలోని నయాబజార్, వెంకటేశ్వర నగర్, బొక్కలగడ్డ, సారథినగర్, గొల్లబజార్, గాంధీచౌక్, చర్చి కాంపౌండ్, తుమ్మలగడ్డ, నిజాంపేట, జడ్పీసెంటర్లలోని సమస్యాత్మక ప్రాంతాల్లో ఆయన అధికారులతో కలిసి తనిఖీలు చేశారు. నగరంలో 3 ఎఫ్ఐఆర్ లు నమోదుచేసినట్లు కలెక్టర్​ చెప్పారు.

కొత్తగూడెం ప్రాంతం ఆర్య కలర్ జిరాక్స్ సెంటర్ వద్ద బీఆర్ఎస్ కార్యకర్త ఓటర్లకు డబ్బులు పంచుతుండగా ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ పట్టుకొని ఖానాపురం హావేలి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కస్బా బజార్ వద్ద బీఆర్ఎస్ కార్యకర్త రూ. 27,900, ఓటర్ స్లిప్పులతో పంపిణీ చేసేందుకు ప్రయత్నిస్తుండగా ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ పట్టుకొని ఖమ్మం 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు చెప్పారు.

 ఓటర్లకు పంచేందుకు మహబూబాబాద్​ కాంగ్ఎస్​ అభ్యర్థి అనుచరులు తరలిస్తున్న రూ.8.70 లక్షలు సీజ్​ చేసినట్టు, కాంగ్రెస్ కార్యకర్తలపై ఖమ్మం 1 టౌన్ లో కేసు నమోదు చేసినట్టు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 23 ఎంసీసీ టీమ్​లు, 17 ఎస్ఎస్టీ టీములు, 20 ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్​లు ఏర్పాటుచేసి 24 గంటలు నిరంతర నిఘా పెట్టినట్లు చెప్పారు. 12 ఇంట్రాస్టేట్, 6 ఇంట్రాడిస్ట్రిక్ట్ చెక్ పోస్టులు ఏర్పాటుచేసి ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నట్లు తెలిపారు.

సీ విజిల్ యాప్ పై ఓటర్లలో, యువతలో అవగాహన కల్పించాలన్నారు.  ఎన్నికల అక్రమాలు దృష్టికి వస్తే సీ విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు. సీ విజిల్ ద్వారా ఫిర్యాదు చేస్తే నిఘా టీమ్ 20 నిమిషాల్లో సంఘటనా స్థలానికి చేరుకుంటుందన్నారు. ఓటర్లు డబ్బు, మద్యం, ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు  200 సీయూలు 

200 ఈవీఎంలను అదనంగా  భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు పంపిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. శనివారం రాజకీయ పార్టీల ప్రతినిధులసమక్షంలో జిల్లా ప్రజాపరిషత్ ఆవరణలోని గోడౌన్ నుంచి జిల్లాకు కేటాయించిన అదనపు సీయూలను పంపించే ప్రక్రియ చేపట్టినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా అడిషనల్​ కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్, కలెక్టరేట్ ఎన్నికల విభాగ సూపరింటెండెంట్ రాంబాబు, బీజేపీ ప్రతినిధి జీఎస్ఆర్ఏ విద్యాసాగర్, సీపీఎం ప్రతినిధి ప్రకాశ్, బీఆర్ఎస్ ప్రతినిధి ఆర్​జీ కృష్ణ, తాజోద్దీన్, టీడీపీ ప్రతినిధి కృష్ణ ప్రసాద్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి తాజోద్దీన్, కలెక్టరేట్ ఎన్నికల విభాగ సీనియర్ అసిస్టెంట్ హుస్సేన్ పాల్గొన్నారు.

ఈవీఎం, వీవీ ప్యాట్ గోడౌన్ ను ఓపెనింగ్ 

నూతన కలెక్టరేట్ ఆవరణలో రూ. 278 లక్షల వ్యయంతో నిర్మించిన  ఈవీఎం, వీవీ ప్యాట్ గోడౌన్ ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వీపీ గౌతమ్ శనివారం ప్రారంభించారు. ఈవీఎంల  భద్రపరిచేందుకు, తనిఖీ చేసేందుకు ఏర్పాటు చేసినట్టు  ఆయన తెలిపారు. ఎన్నికల అనంతరం ఐదు నియోజకవర్గాల ఈవీఎంలు భద్రపర్చనున్నట్లు చెప్పారు. ఖమ్మం మున్సిపల్​ కమిషనర్ ఆదర్శ్ సురభి, అడిషనల్​ కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్, ఎస్డీసీ ఎం. రాజేశ్వరి, ఆర్ అండ్ బీ ఈఈ శ్యామ్ ప్రసాద్, జేఈ విశ్వనాథ్, కలెక్టరేట్ ఏవో అరుణ, ఎన్నికల విభాగ పర్యవేక్షకులు రాంబాబు, అధికారులు పాల్గొన్నారు.