
- రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీపీ గౌతమ్
- ఇందిరమ్మ ఇండ్లకు ఇసుకను ఫ్రీగా ఇస్తామని వెల్లడి
సిద్దిపేట రూరల్, వెలుగు: ఇందిరమ్మ ఇండ్లను రూల్ మేరకు లబ్ధిదారులు నిర్మించుకోవాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీపీ గౌతమ్ స్పష్టంచేశారు. 400 స్క్వేర్ ఫీట్ల నుంచి 600 స్క్వేర్ ఫీట్లలోపు మాత్రమే ఇంటిని నిర్మించుకోవాలని, అంతకంటే ఎక్కువగా కట్టుకుంటే ఖర్చులు ఎక్కువ అవుతాయని పేర్కొన్నారు. సోమవారం పైలట్ గ్రామమైన వెంకటాపూర్ లో ఇండ్ల నిర్మాణాలను ఆయన పరిశీలించారు.
అనంతరం లబ్ధిదారులతో సమావేశమై తగు సూచనలను, సలహాలు ఇచ్చారు. సిమెంటు, ఐరన్, ఇసుక, ఇటుకలతో పాటు మేస్త్రి రేట్లు పెరిగాయని లబ్ధిదారులు తెలుపగా, ఫ్రీగా ఇసుక పంపిణీ చేస్తామని తెలిపారు. ధరల నియంత్రణకు సప్లయర్లతో జిల్లాస్థాయిలో మీటింగ్ నిర్వహించి పెరగకుండా ఆదేశాలు జారీ చేయాలని కలెక్టర్ కు చెబుతానని చెప్పారు. సిద్దిపేట అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్, గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ దామోదర్ రావు అధికారులు ఉన్నారు.