అర్హులందరికీ పథకాలను అందజేస్తాం : వీపీ గౌతమ్

ఖమ్మం టౌన్/కామేపల్లి /ములకలపల్లి/కారేపల్లి/బూర్గంపహాడ్/కల్లూరు, వెలుగు :  ప్రజాపాలన ద్వారా వచ్చే దరఖాస్తులను పరిశీలించి అర్హులందరికీ ప్రభుత్వ పథకాలను అందజేస్తామని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. గురువారం ఖమ్మం నగరంలోని 46వ డివిజన్ జూబ్లీ క్లబ్, ఖమ్మం రూరల్ మండలం జలగం నగర్, ఏదులాపురంలో ఏర్పాటు చేసిన గ్రామ సభల్లో దరఖాస్తుల స్వీకరణను ఆయన పరిశీలించారు.

రేషన్ కార్డుల కోసం అధికంగా దరఖాస్తులు వస్తున్నాయని, వాటిని కూడా తీసుకోవాలని అధికారులకు సూచించారు. గృహజ్యోతి పథకానికి కిరాయి ఇంట్లో ఉన్న వారు కూడా అర్హులేనని, ఎవరూ ఆందోళన చెందోద్దని సూచించారు. గ్రామసభల్లో ఆరవ రోజు 61,691 దరఖాస్తులు  వచ్చినట్టు తెలిపారు. కామేపల్లి మండలంలోని గోవింద్రాలలోని సభను ఖమ్మం అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్ సందర్శించారు.

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ములకలపల్లి మండలంలోని సీతారాంపురం, సుబ్బనపల్లి, ములకలపల్లి, మూకమామిడి, జగన్నాథపురం, సీతాయగూడెంలోని సభలను ఎమ్మెల్యే జారే ఆదినారాయణ సందర్శించారు. ప్రజలు ఇచ్చే ప్రతి దరఖాస్తును అధికారులు సమగ్రంగా పరిశీలించాలని సూచించారు.

కారేపల్లి మండలంలోని ఏర్రబోడు సభలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పాల్గొని మాట్లాడారు. ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనేతరుల పోడు పట్టాల సమస్యను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. బూర్గంపహాడ్ మండలంలోని అంజనాపురంలోని సభను ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, కల్లూరు మండలం హనుమాతండా, ఖాన్ పేటలోని సభలను ఎమ్మెల్యే మట్టా రాగమయి పరిశీలించి పలు సూచనలు చేశారు.