
- వీఆర్ఏ వారసులకు కూడా ఉద్యోగాలు ఇవ్వాలి: ఆర్.కృష్ణయ్య
- ఇందిరా పార్క్ ధర్నాచౌక్లో వీఆర్ఏ కుటుంబ సభ్యుల మహాధర్నా
ముషీరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 70 వేల ఉద్యోగా లు ఇచ్చి రికార్డు క్రియేట్ చేసిందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. అలాగే 61 ఏండ్లు నిండిన వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలు ఇచ్చి వారి కుటుంబాల ను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
తెలం గాణ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో చైర్మన్ నీల వెంక టేశ్, జేఏసీ అధ్యక్షుడు ఆంజనేయులు అధ్యక్షతన ఇందిరా పార్క్ ధర్నాచౌక్లో సోమవారం వీఆర్ఏల కుటుంబ సభ్యులతో కలిసి ఆర్. కృష్ణయ్య మహాధర్నా నిర్వహించారు. ఆ తర్వాత ఆర్.కృష్ణయ్య మాట్లాడారు. తెలంగాణలో మొత్తంగా 20,555 మంది వీఆర్ఏలు ఉన్నారని, జీవో నెంబర్ 81 ప్రకారం వారికి ఉద్యోగాలు ఇచ్చారని చెప్పారు.
మిగిలిన 3,797 వీఆర్ఏల ఉద్యోగాలను భర్తీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని విమర్శించారు. ఇప్పటివరకు 456 మంది వీఆర్ఏలు చనిపోయారని, 28 మంది వీఆర్ఏల వారసులు ఆత్మహత్యలు చేసుకున్న ప్రభుత్వం న్యాయం చేయకపోవడం బాధకరమని ఆవేదన వ్యక్తం చేశారు. జీవో వచ్చి 18 నెలలు గడిచిన ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. జీవో నెంబర్ 81, 85 ప్రకారం వారసులకు తక్షణమే ఉద్యోగ నియామక పత్రాలు అందించాలని డిమాండ్ చేశారు.