హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్ఏల ఆందోళన కొనసాగుతోంది. ఇవాళ 78వ రోజు సందర్భంగా తహసీల్దార్ ఆఫీసులకు తాళాలు వేసి నిరసనలు తెలియజేశారు. పే స్కేల్, వారసత్వ ఉద్యోగాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 22వేల మంది వీఆర్ఏలు నిరసనల్లో పాల్గొంటున్నారు. తమ ఉద్యోగాలు ఉంటాయో,, ఊడ్తయో తెల్వడం లేదని.. ఇంకోవైపు మూడు నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో కుటుంబాలు పూటగడవని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తూ నిరసనలు నిర్వహించారు.
పూట గడవని పరిస్థితుల్లో..
సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ అమలు చేయమని అడుగుతున్నామే తప్ప.. గొంతెమ్మ కోరికలేమీ కాదని ఈ సందర్భంగా వీఆర్ఏలు గుర్తు చేశారు. ఆర్ధిక ఇబ్బందుల్లో ఇండ్లు, పొలాలు, జాగాలు, పెద్దల ఆస్తులన్నీ తాకట్టు పెడుతున్నా కష్టాలు తీరడం లేదని..చాలా మంది పూట గడవని పరిస్థితుల్లో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఆత్మీయులు అనారోగ్యాలకు గురైతే.. వైద్యం చేయించి కాపాడుకోలేకపోతున్నామని వీఆర్ఏలు తీవ్ర మనోవేదనకు గురవుతున్నామని చెప్పారు.
నిజామాబాద్ జిల్లా బోధన్ లో..
నిజామాబాద్ జిల్లా బోధన్ లో తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసనకు దిగారు వీఆర్ఏలు. తహసీల్దార్ కార్యాలయం గేటుకు తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు. నిరసన చేపట్టి 78 రోజులు గడుస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ 23 వేల మంది వీఆర్ఏలు సమ్మె చేస్తున్నట్లు తెలిపారు. అయినా సర్కార్ స్పందించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని.. లేకుంటే సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడికి సిద్ధమవుతామని వీఆర్ఏలు ప్రకటించారు.
మెదక్ జిల్లాలో ఆందోళనలు..
మెదక్ జిల్లాలో VRAల ఆందోళనలు కొనసాగుతున్నాయి. శివ్వంపేట తహసీల్దార్ కార్యాలయానికి తాళం వేసి నిరసన తెలిపారు. ఆఫీసర్లు లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. 78రోజులు ఆందోళన చేసిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
సంగారెడ్డి తాహసీల్దార్ ఆఫీసు ముందు వీఆర్ఏల ఆందోళన
సంగారెడ్డి జిల్లాలో వీఆర్ఏల ఆందోళనలు కొనసాగుతున్నాయి. పఠాన్ చెరు మండలంలోని తహసీల్దారు ఆఫీస్ ముందు ధర్నాకు దిగారు. అధికారులు లోపలికి వెళ్లకుండా.. గేటు ముందు కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్నారు. పేస్కేలు అమలు చేయాలని డిమాండ్ చేశారు
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో..
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ తహశీల్దార్ కార్యాలయాన్ని వీఆర్ఏలు ముట్టిడించారు. కార్యాలయం ప్రధాన గేటు ముందు బైఠాయించి అధికారులు, సిబ్బంది లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది 78 రోజులుగా ఆందోళన చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. పేస్కేల్ అమలు చేయాలని.. విద్యార్హతలను బట్టి వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.