వీఆర్ఏలకు న్యాయం చేయండి

పెద్దపెల్లి జిల్లాకు చెందిన వీఆర్ఏ దోస్తు ఒకరు ఫోన్​చేశాడు. 2012లో ఏపీపీఎస్సీ ద్వారా రిక్రూట్​అయిన అతను 2013లో పెండ్లి చేసుకున్నాడు. 2014లో ఒక పాప పుట్టింది. తెలంగాణ వచ్చింది కదా! వీఆర్ఏలు జీవితాల్లో వెలుగులు వస్తాయని అనుకున్నాడు. స్వరాష్ట్రంలో కొంత జీతం పెరిగిన మాట వాస్తవమే కానీ.. ఇప్పుడున్న ధరలకు అది ఏ మూలకూ సరిపోతలేదు. 2017లో మళ్లా ఓ బిడ్డ పుట్టింది. ఇద్దరు ఆడ బిడ్డలు, తల్లిదండ్రులు సహా మొత్తం ఆరుగురు కుటుంబం ఆయనకొచ్చే రూ.10 వేల జీతంతోనే నడవాలి. పిల్లల స్కూలు ఫీజులు, అనారోగ్య సమస్యలకు జీతం సరిపోక బయట అప్పు చేశాడు. ఇటీవల ఇద్దరు బిడ్డలకు బ్లడ్ ఇన్​ఫెక్షన్ వచ్చింది. హాస్పిటల్​లో బిల్లు కట్టే మార్గం లేక, పాత అప్పులు తీర్చలేక, తనకు ఉన్న మూడు గంటల ఇంటి జాగను అమ్ముకున్నాడు. ఇవన్నీ విన్న నాకు కండ్లల్లో నీళ్లు తిరిగినయి. ఒక్క పెద్దపల్లి మిత్రుడే కాదు, రాష్ట్రవ్యాప్తంగా 23 వేల మంది వీఆర్ఏలు ఇలాంటి ఇబ్బందులే పడుతున్నారు. వచ్చే జీతం సరిపోక, పిల్లలకు మంచి చదువులు చెప్పించలేక, బయట అప్పులు చేస్తూ కష్టపడుతున్నారు. 4 నెలల కింద సూర్యాపేటకు చెందిన వీఆర్ఏ మిత్రుడు వెంకటేశ్వర్లు బిడ్డ పెళ్లి చేయడానికి అప్పు చేశాడు. ఆ తర్వాత నెలకే ఆయనకు కిడ్నీ పాడైంది. నెలనెలా మందులు కొనలేక, బిడ్డ పెళ్లి అప్పులు తీర్చే స్తోమత లేక ఉరితాడు బిగించుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కామారెడ్డికి చెందిన వీఆర్ఏ చల్లా రమేశ్ అప్పు చేసి ఇల్లు కట్టుకున్నాడు. వచ్చే జీతం ఈఎంఐకే పోతుంటే.. ఇల్లు గడవలేక ఒత్తిడికి గురై ఉరి వేసుకున్నాడు. రాష్ట్రంలో వీఆర్ఏలందరిదీ ఇలాంటి పరిస్థితే ఉన్నది. 

పని ఎక్కువ

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వీఆర్ఏలు గ్రామాల్లో కీలకంగా పనిచేస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకెళ్లే విషయంలో ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పని చేస్తున్నారు. గ్రామీణ స్థాయిలో సహజ వనరులను, ప్రభుత్వ భూములను పరిరక్షించడం చేస్తున్నారు. రెవెన్యూ పనులతోపాటు పోలీస్, విద్య, వైద్యా ఆరోగ్య, వెటర్నరీ, ఇరిగేషన్ మైనింగ్, ఇలా ఒక్కటేమిటి 36 ప్రభుత్వ విభాగాలకు గ్రామానికి ఒక ప్రతినిధిగా ఉంటూ పనిచేస్తున్నాడు. మహిళా వీఆర్ఏ ఉద్యోగులకు కనీసం ప్రసూతి సెలవులు కూడా లేవు. 9 నెలల గర్భిణులు కూడా ఉద్యోగాలు చేస్తుండటం బాధాకరం. వీఆర్ఏలు ఇన్ని రకాల పనులు చేస్తున్నప్పటికీ, ప్రభుత్వం పార్ట్ టైం ఉద్యోగులుగా గుర్తిస్తూ నెలకు రూ.10,500 వేతనం మాత్రమే ఇస్తున్నది.   

ప్రభుత్వ హామీలు

2017 ఫిబ్రవరి 24న సీఎం కేసీఆర్ ​ప్రగతి భవన్ కు వీఆర్ఏ రాష్ట్ర ప్రతినిధులను పిలిపించుకొని వీఆర్ఏలకు పే స్కేలు అమలు చేస్తామని, పదోన్నతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. 2020 సెప్టెంబర్ 20న కొత్త రెవెన్యూ చట్టం తీసుకువస్తున్న సందర్భంగా.. వీఆర్ఏలందరినీ పే స్కేలు ఉద్యోగులుగా గుర్తిస్తామని నిండు సభలోనే కేసీఆర్ ప్రకటించారు. 2021 మార్చి15న మరోసారి అసెంబ్లీ సాక్షిగా వీఆర్ఏల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందన్నారు. ఇలా ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చినా, ఇప్పటికీ ఏ ఒక్కటి అమలు కాకపోవడంతో వచ్చే జీతం సరిపోక, ఉద్యోగ భద్రత లేక పని భారంతో వీఆర్ఏలు ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 80 రోజులపాటు వీఆర్ఏలు సమ్మె చేశారు. కలెక్టరేట్ల ముందు దీక్షలు, వంటావార్పులు నిర్వహించారు. 2022 సెప్టెంబర్13న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వందలాది మంది వీఆర్ఏలు హుస్సేన్ సాగర్ కు చేరుకోవడం ఉద్యమ కాలం నాటి మిలియన్ మార్చ్​ను తలపించింది. ఇన్ని చేసినా వీఆర్​ఏలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరడం లేదు. సుమారు 68 మంది వీఆర్ఏలు చనిపోయారు. వారిలో నలుగురు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. వీఆర్ఏల ఆకలి చావులను ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించాలి. వీఆర్ఏలు అత్యధికంగా సుమారు నూటికి 87 శాతం బడుగు బలహీన సామాజిక వర్గాలకు చెందిన వారే ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం పేస్కేల్​ వర్తింపజేసి, పదోన్నతులు కల్పించి వీఆర్ఏల కుటుంబాల్లో ఆత్మస్థైర్యం నింపాలి. 

– డా. మల్లారం అర్జున్, వీఆర్ఏ జేఏసీ, సిరిసిల్ల జిల్లా