ఇల్లందకుంట, వెలుగు: తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని సోమవారం ఇల్లందకుంట మండల కేంద్రంలో వీఆర్ఏలు మోకాళ్లపై కూర్చొని భిక్షాటన చేశారు. వీఆర్ఏల జేఏసీ చైర్మన్ బైరుమల్ల తిరుపతి, కో చైర్మన్ కె.జనార్దన్మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేసి వీఆర్ఏలను ఆదుకోవాలని వేడుకున్నారు.
మెట్ పల్లి, వెలుగు: డిమాండ్లు నెరవేర్చాలని రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్ఏలు చేస్తున్న నిరసన దీక్షలు 29వ రోజుకు చేరుకున్నాయి. మెట్ పల్లి డివిజన్ లోని మెట్ పల్లి, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ మండలాల వీఆర్ఏలు సబ్ కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా నేషనల్హైవే పై మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు.
కరీంనగర్లో గ్రీవెన్స్ డేకు 264 అర్జీలు
కరీంనగర్ సిటీ, వెలుగు: సమస్యల సత్వర పరిష్కారం కోసం సోమవారం నగరంలోని కలెక్టరేట్లో నిర్వహించిన గ్రీవెన్స్‌డేకు 264ఫిర్యాదులు అందాయి. జమ్మికుంట మండలం కోరపల్లి సర్వే నంబర్969/బిలోని 5గుంటల భూమిని చర్చికే కేటాయించాలని కోరుతూ పలువురు వినతిపత్రం అందించారు. ఎస్సీ కార్పొరేషన్ శాఖకు 81, కరీంనగర్ మున్సిపాలిటీకి 14, తహసీల్దార్ రూరల్ కు 12 , ఇతర శాఖలకు సంబంధించి 157 ఫిర్యాదులు అందాయి. జిల్లా అడిషనల్ కలెక్టర్ జి.వి. శ్యామప్రసాద్ లాల్ మాట్లాడుతూ అధికారులు దరఖాస్తులను వెంటనే పరిశీలించి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్, జడ్పీ సీఈవో ప్రియాంక, ఎల్డీఎం ఆంజనేయులు, బీసీ సంక్షేమ అధికారి రాజమనోహర్ రావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
సిరిసిల్ల కలెక్టరేట్, వెలుగు-: గ్రీవెన్స్‌డేలో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని,పెండింగ్ అర్జీలపై దృష్టి సారించాలని అడిషనల్ కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్ ఆఫీసర్లను ఆదేశించారు. సోమవారం సిరిసిల్ల కలెక్టరేట్ లో అర్జీదారుల నుంచి 26 దరఖాస్తులను స్వీకరించారు. అడిషనల్కలెక్టర్మాట్లాడుతూ గ్రీవెన్స్‌డే సమస్యలపై సంబంధిత శాఖల అధికారులు దృష్టి సారించాలన్నారు.
నాలుగేండ్లయినా ‘డబుల్’ ఇండ్లు ఇవ్వలే..
వేములవాడ, వెలుగు: వేములవాడ పట్టణంలోని నిరుపేదలకు డబుల్ బెడ్రూంలు ఇస్తామని నాలుగేండ్ల కింద శంకుస్థాపన చేసినా, ఇంతవరకు నిర్మాణం పూర్తికాలేదని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎర్రం మహేశ్ఆరోపించారు. పట్టణంలోని నిర్మాణ దశలో ఉన్న డబుల్ బెడ్రూం ఇండ్ల పనులను సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మహేశ్మాట్లాడుతూ అభివృద్ధిలో సిరిసిల్లకు ఓ న్యాయం, వేములవాడకు మరో న్యాయమా అంటూ మంత్రి కేటీఆర్ ను ప్రశ్నించారు. వేములవాడకు ఇంకా ఎన్నిరోజులు టూరిస్ట్ఎమ్మెల్యే ఉంటారని ఎద్దేవా చేశారు. పట్టణంలో డబుల్బెడ్రూం పనులు నాసిరకంగా ఉన్నాయని ఆరోపించారు. కార్యక్రమంలో ముప్పిడి శ్రీనివాస్, లక్ష్మణ్, సంతోష్ యాదవ్, స్వామి, సుమన్, చారి పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో బీజేవైఎం కార్యకర్త మృతి
కరీంనగర్ క్రైం, వెలుగు: కరీంనగర్‌లోని ఆర్టీసీ వర్క్‌షాప్ వద్ద సోమవారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో బీజేవైఎం కార్యకర్త కామారపు సూర్యతేజ(22) చనిపోయాడు. పోలీసుల వివరాలిలా ఉన్నాయి.. కొత్తపల్లి గ్రామానికి చెందిన సూర్యతేజ బైక్‌పై మరో యువకుడు నునుగొండ మణిదీప్ తో కలిసి కరీంనగర్ నుంచి కొత్తపల్లి కి వెళ్తున్నాడు. ఆర్టీసీ వర్క్ షాప్ సమీపంలో ఆగి ఉన్న లారీని వెనక నుంచి సూర్యతేజ బైక్‌తో ఢీకొట్టాడు. అతనికి తీవ్రగాయాలు కాగా స్పాట్లోనే చనిపోయాడు. వెనక కూర్చున్న మణిదీప్‌కు తీవ్ర గాయాలయ్యాయి. మృతుని తండ్రి ప్రసాద్ ఫిర్యాదు మేరకు టుటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రజాసేవకే నా జీవితం
జగిత్యాల, వెలుగు: తన జీవితం ప్రజాసేవకే అంకితమని బీజేపీ లీడర్డా.ఎడమల శైలేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ఇంతకాలం టీఆర్ఎస్లో కొనసాగిన ఆయన ఆదివారం జరిగిన మునుగోడు సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరారు. జగిత్యాలలో సోమవారం మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్లో క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా, కార్యకర్తలను కాపాడుకుంటూ ముందుకు సాగానని గుర్తు చేశారు. అయినా కన్నీళ్లు, వేధింపులే మిగిలాయని, దీంతో పార్టీని వీడక తప్పలేదని పేర్కొన్నారు. ఇకపై తన రాజకీయ జీవితమంతా బీజేపీలోనేనని, ప్రజాసేవయే పరమావధిగా ముందుకు సాగుతూ నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలతో కలిసి పార్టీని బలోపేతం చేస్తానని పేర్కొన్నారు.
కలికోట సూరమ్మ ప్రాజెక్టు పనులు ప్రారంభించాలి
కథలాపూర్,వెలుగు: కథలాపూర్ మండలం కలికోట సూరమ్మ ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువల పనులు ప్రారంభించి పూర్తి చేయాలని కాంగ్రెస్ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి ఆది శ్రీనివాస్ డిమాండ్‌చేశారు. సోమవారం కలికోట సూరమ్మ ప్రాజెక్టు మత్తడి వద్ద పార్టీ మండల అధ్యక్షుడు కాయితి నాగరాజు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ 2018 ఎన్నికలకు ముందు మంత్రి హరీశ్‌రావు కలికోట గ్రామంలో శిలాఫలకం వేసి దసరా లోపు నీళ్లు వస్తాయని చెప్పి 4 దసరాలు పోయాయన్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్కు చెందిన పలువురు యువకులు కాంగ్రెస్‌లో చేరగా వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అజీం, పీసీసీ కార్యవర్గ సభ్యులు అంజయ్య, కిసాన్ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు దేవరెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ ఫిషర్మెన్కార్యదర్శి గంగాధర్ పాల్గొన్నారు.