ప్రభుత్వంలో గ్రామ స్థాయి ఉద్యోగి, పథకాల అమలులో క్రియాశీల వారధి.. విలేజ్‌రెవెన్యూ అసిస్టెంట్(వీఆర్ఏ). నిజాం కాలం నుంచి నేటి వరకు గ్రామాల్లో అనేక సేవలు అందిస్తూ వస్తున్న వీరిని మస్కూరీలుగా, షేక్ సిందులుగా, నీరటీలుగా, సుంకరి తదితర పేర్లతో పిలిచేవారు. ప్రస్తుతం గ్రామ రెవెన్యూ సహాయకులుగా పిలుస్తున్నారు. గతంతో పోలిస్తే పేరు మారింది తప్ప.. వీఆర్ఏల జీవితాలు మారడం లేదు. చేస్తున్న పనులకు, ప్రభుత్వం ఇస్తున్న గుర్తింపు, వేతనాలకు సంబంధమే ఉండటం లేదు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 23 వేల మంది వీఆర్ఏలు ఉన్నారు. స్వరాష్ట్రంలో ప్రభుత్వం వీఆర్ఏల సంక్షేమం కోసం ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు కావడం లేదు. రాష్ట్రం ఏర్పాటై ఎనిమిదేండ్లు దాటినా..వీఆర్ఏల సమస్యలు తీరడం లేదు. గ్రామాల్లో చెరువులు, ప్రభుత్వ భూములు, సహజ సంపదల రక్షణ చూసేది వీఆర్ఏలే. అతివృష్టి, అనావృష్టి పరిస్థితుల్లో నష్టం అంచనా వేసి ప్రభుత్వానికి అందించేది వీఆర్ఏలే. ప్రభుత్వ 36 శాఖలకు సంబంధించి ఏ అధికారి వచ్చినా.. రిసీవ్ చేసుకునేది వీఆర్ఏలే. గ్రామాల్లో శాంతి భద్రతలను గమనిస్తూ.. పోలీసులకు సాయం చేసేది వీఆర్ఏలే. ప్రభుత్వ భూములు, చెరువు శిఖం కబ్జా కాకుండా చూసేది, ఆక్రమణలు జరిగితే ప్రభుత్వానికి తెలిపేది వీఆర్ఏలే. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు లబ్ధిదారుల సమాచారాన్ని సేకరించడం ఇలా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఒక క్రియాశీల వారధిగా పనిచేస్తున్న వీఆర్ఏలకు ప్రభుత్వం ఏ మేరకు భరోసా ఇస్తోందో ఒక్కసారి ఆలోచించాలి.
అన్ని శాఖలకు సేవలందిస్తూ..
వీఆర్ఏలు టెక్నికల్‌గా రెవెన్యూ సహాయకులే అయినా.. అన్ని శాఖల కోసం పనిచేస్తున్నారు. వైద్య విధాన పరిషత్‌కు సేవలందించడంలో భాగంగా.. ప్రస్తుతం సీజనల్ వ్యాధులు ప్రబలకుండా గ్రామంలో శుక్రవారం డ్రై డేలో పాల్గొంటున్నారు. ఆశా కార్యకర్తలతో కలిసి ఇంటింటికీ తిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. కరోనా సమయంలో కీలకంగా పనిచేశారు. రైతు బంధు, రైతు బీమా, ఆసరా పెన్షన్లు, జనన, మరణ ధ్రువీకరణలు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లాంటి అన్ని పథకాల అమలులో వీఆర్ఏల పాత్ర ఉన్నది. గ్రామాల్లో ఇసుక, వృక్ష సంపదను కాపాడేందుకు శ్రమిస్తున్నారు. అక్రమ ఇసుక రవాణాను అడ్డుకొని ఇసుక మాఫియా కుట్రలకు చాలా మంది బలయ్యారు. నిజామాబాద్ జిల్లా బోధన్ డివిజన్లో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నందుకు ఒక వీఆర్ఏను దారుణంగా చంపారు. అనేక మంది వీఆర్ఏల మీద దాడులు జరుగుతున్నాయి. అయినా వీఆర్ఏలు వెనక్కి తగ్గకుండా వారి బాధ్యతలను నిర్వర్తిస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం వారికి ఇస్తున్న గుర్తింపు ఏది? అన్నింటిలో కీలక పాత్ర పోషిస్తున్న వీఆర్ఏలకు ప్రభుత్వం ఇచ్చే గౌరవవేతనం రూ.10,500 మాత్రమే. పని ఎక్కువగా ఉన్నా ప్రభుత్వం తమను ఉద్యోగులుగా గుర్తించి పే స్కేలు అమలు చేయడం లేదని వీఆర్ఏలు బాధపడుతున్నారు.
95 శాతం అణగారిన వర్గాల వారే..
రాష్ట్రంలో వీఆర్ఏలుగా సేవలందిస్తున్న వారంతా నూటికి 95 శాతం మంది అణగారిన వర్గాలకు చెందిన వారే. చాలీచాలని వేతనాలతో, అన్ని శాఖల పని ఒత్తిడిలతో కాలం వెళ్లదీస్తున్న వీఆర్ఏలకు ప్రభుత్వం ఎలాంటి భరోసా ఇవ్వడం లేదు. కామారెడ్డి జిల్లాలో ఆరు నెలల కింద జీతం సరిపోవడం లేదని రమేశ్ అనే వీఆర్ఏ ఆత్మహత్య చేసుకున్న విషయం రాష్ట్ర ప్రజలకు తెలిసిందే. అనేక విజ్ఞప్తులు, పోరాటాల ఫలితంగా 2017లో సీఎం కేసీఆర్ వీఆర్ఏల ప్రతినిధులను ప్రగతి భవన్ కు రమ్మని మాట్లాడారు. పే స్కేలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. 2020లో నూతన రెవెన్యూ చట్టం తీసుకు వస్తున్నప్పుడు కూడా వీఆర్ఏలకు తక్షణమే పేస్కేలు ఉద్యోగులుగా గుర్తిస్తామని సీఎం చెప్పారు. ఈ హామీలు ఇచ్చి ఏండ్లు గడుస్తున్నా పే స్కేలు అమలు కావడం లేదు. నిత్యావసరాల ధరల పెరుగుదల, కుటుంబంలో అనారోగ్య సమస్యలు, పిల్లల స్కూలు పీజులు, ఇంటి అద్దె ఇలా.. అన్ని కష్టాలు వారికి ప్రభుత్వం ఇచ్చే రూ.10,500 తోనే వెళ్లదీయాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించుకున్నా.. స్పందన లేకపోవడంతోనే వీఆర్ఏలు వారి హక్కుల సాధన కోసం ఉద్యమ బాట పట్టారు. మొదలు తహసీల్దార్, కలెక్టర్ఆఫీసుల్లో వినతిపత్రాలు ఇచ్చారు. అయినా ప్రభుత్వం స్పందించకపోవడంతో హైదరాబాద్ సీసీఎల్ఏ ముందు ధర్నా నిర్వహించారు. గత నెలలో మంత్రి కేటీఆర్ సిరిసిల్ల జిల్లాకు వస్తున్నారని తెలిసి ప్లకార్డులతో 300 మంది వీఆర్ఏలు నిరసన తెలిపితే.. వారిలో 9 మందిపై పోలీసులు కేసులు పెట్టారు. హక్కుల కోసం పోరాడుతున్నందుకు ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా వీఆర్ఏలపై కేసులు పెట్టిస్తోంది. అయినా వీఆర్ఏల పోరు ఆగదు. వీఆర్ఏల సమ్మె కు రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. వీఆర్ఏల అరెస్టులను తహసీల్దార్ల సంఘం కూడా ఖండించింది.
ప్రభుత్వం స్పందించాల్సిందే..
ప్రభుత్వం వీఆర్ఏల న్యాయమైన సమస్యలను పరిష్కరించేందుకు ముందుకు రావాలి. వీఆర్ఏ రాష్ట్ర ప్రతినిధులతో చర్చలు జరపాలి. వీఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, పే స్కేలు అమలు చేయాలి. అర్హత ఉన్న వారికి పదోన్నతులు కల్పించాలి. మహిళా వీఆర్ఏలకు ప్రసూతి సెలవులు ఇవ్వాలి. వీఆర్ఏల సమ్మెతో రెవెన్యూ శాఖలో చాలా పనులు పెండింగ్‌లో పడుతున్నాయి. వివిధ శాఖల పనులకు కూడా ఇబ్బందులు వస్తున్నాయి. కాబట్టి ప్రభుత్వం మరోసారి ఆలోచించాలి. వీఆర్ఏలకు న్యాయం చేయాలి.
- మల్లారం అర్జున్, వీఆర్ఏ జేఏసీ, రాజన్న సిరిసిల్ల జిల్లా